దేవస్థానం పునర్నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్న బాలాజీ

చిల‌క‌లూరిపేట‌, ప్రజలందరికీ అష్టైశ్వర్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని తాను స్వామివార్ల‌ను వేడుకున్న‌ట్లు జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ చెప్పారు. బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని కళామందిర్ సెంటర్లోని శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో ఆయ‌న స‌తీస‌మేతంగా పాల్గొన్నారు. అనంత‌రం విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు లభించాలని వేడుకున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మేలైన జీవనం ఇవ్వమని కోరినట్లు తెలిపారు. రానున్న ఎన్నిక‌ల్లో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న చోటు లేకుండా స‌జావుగా సాగి ప్ర‌జా అభిష్టం మేర‌కు ఉమ్మ‌డి కూట‌మి అధికారంలోకి రావాల‌ని ఆకాంక్షించిన‌ట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమ పాలన అంతమయ్యేందుకు రోజులు దగ్గర పడ్డాయని జగన్ పాలనపై అన్ని వర్గాలు ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని తెలిపారు. సువ‌ర్ణ‌పాల‌న కోసం, సంక్షేమాభివృద్ది కోసం జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీలను ఆశీర్వదించాలని కోరారు. రాష్టానికి అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతో జనసేన తెలుగుదేశం పార్టీలు తీసుకుంటాయని అన్నారు. ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చినా వైసీపీ ఆగ‌డాలు ఆగ‌టం లేద‌ని, ఇందుకు కొంత‌మంది అధికారులు వైసీసీ తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. వాలంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల్లోనూ, వైసీపీ పార్టీ పార్టీ కార్య‌క్ర‌మాల్లో వినియోగించ‌రాద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ చేసిన సూచ‌న‌లు కూడా పాటించ‌టం లేద‌న్నారు. ప్ర‌జ‌లు, జ‌న‌సైనికులు స్వ‌చ్చంధంగా క‌దిలి వ‌చ్చి ఎవ‌రైనా, ఎక్క‌డైనా ఎన్నిక‌ల దుర్వినియోగానికి పాల్ప‌డితే ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.