కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ

తిరుమల కొండపై 2 వందల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన కర్ణాటక సత్రంకు పునాదిరాయి పడింది. తిరుమలలో కర్ణాటక సత్రాల ప్రాంతంలో రూ.200 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వసతి సముదాయాలకు ఈ రోజు ఉదయం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, బి.ఎస్‌.యడ్యూరప్ప కలిసి భూమి పూజ చేశారు. పూర్తిగా అధునాతన రీతిలో నిర్మించబోతున్న కర్ణాటక సత్రాన్ని ఏడు ఎకరాల పరిధిలో ఐదు కాంప్లెక్సులుగా నిర్మిస్తారు. కర్ణాటక నుంచి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు వసతి కోసం ఈ సత్రాన్ని నిర్మిస్తున్నారు. రోజుకి 1800 మంది భక్తులకు వసతి కల్పించేలా ఈ నిర్మాణం ఉంటుంది. నిర్మాణానికి అయ్యే రూ. 200 కోట్లను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే టీటీడీకి ఇచ్చింది. పూర్తిగా కర్ణాటక ఇచ్చిన నిధులతో ఈ భవన సముదాయం నిర్మిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం.