జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు

అన్నదాతకు ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకునేందుకు, అండగా నిలిచేందుకు జనసేన పార్టీ ఎల్లపుడు సిద్ధంగా ఉంటుందని పార్టీ విస్తృత స్థాయి సమావేశం తీర్మానించింది. కోనసీమ అల్లర్లు విషయంలో ప్రభుత్వం అనుసరించిన, ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరినీ ఖండిస్తూ తీర్మానం చేసింది. కోనసీమ అల్లర్లు ప్రభుత్వం చేసిన కుట్రగా పార్టీ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు. శనివారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జిలు, వివిధ విభాగాల ఛైర్మన్లు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.
తీర్మానాలు
• జనసేన పార్టీ తొలి నుంచీ రైతుల పక్షమే. ధాన్యం కొనుగోలులో రైతులను నష్టపరచే ప్రభుత్వ విధానాలపై 2019 డిసెంబర్ 12వ తేదీన రైతు సౌభాగ్య దీక్ష చేపట్టినప్పటి నుంచి చూస్తే తుపానుతో సర్వం కోల్పోయిన రైతుల కోసం పోరాటం చేయడం, నేడు కౌలు రైతుల్లో భరోసా నింపే దిశగా యాత్ర చేపట్టాం. గత మూడేళ్లలో రాష్ట్రంలో 3వేల మంది కౌలు రైతులు అప్పులు పాలై… ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు కౌలు రైతుల స్థితిగతులకు చలించిపోయారు. ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వ్యక్తిగతంగా రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చి నిధిని నెలకొల్పారు. విశాల హృదయంతో మన అధ్యక్షులు నిధిని ఏర్పాటు చేసి మనసున్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ విస్తృత స్థాయి సమావేశం మన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి సగౌరవంగా అభినందనలు తెలియచేస్తూ తీర్మానాన్ని ప్రవేశంపెడుతున్నాం. వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రతి రైతు పక్షాన జనసేన నిలబడుతుంది.
• అమలాపురంలో చోటు చేసుకున్న అల్లర్లు పాలకపక్ష ప్రేరేపితమైనవిగా భావిస్తున్నాం. వర్గ, కుల విభేదాలను సృష్టించి లబ్ధి పొందాలనే కుట్రపూరితమైన ఉద్దేశంతోనే ఈ అల్లర్లు సృష్టించారు. ఈ వైఖరిని ఖండిస్తున్నాం. ఈ అల్లర్ల పేరుతో అమాయకులను ఇబ్బందిపెట్టే దిశగా వ్యవహరించాలననే విధానాన్ని ప్రభుత్వం విడనాడాలని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం – వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొనే ఉద్యోగుల నుంచి, వ్యాపార వర్గాల వారి మీదా ప్రభావం చూపిస్తోంది. కోనసీమలో శాంతిసామరస్యాలు నెలకొని జనజీవనం ప్రశాంతంగా సాగాలని కోరుకొంటూ.. శాంతి కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం.
• రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కక్ష సాధింపు కోసం జనసేన నాయకులు, జనసైనికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజా పక్షం, బాధిత వర్గాల పక్షం వహించిన సందర్భాల్లోనూ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వెల్లడించిన నాయకులు, శ్రేణులపై కేసులు పెడుతున్నారు. అక్రమ కేసుల ద్వారా కట్టడి చేయాలనే ప్రయత్నం అప్రజాస్వామికం. మా నాయకులు, శ్రేణులకు పార్టీ అండగా నిలిచి న్యాయపరంగా పోరాటం చేస్తుంది.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తోంది. ప్రధానంగా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోయాయి. అత్యాచార ఘటనల్లో బాధితులకు భరోసా ఇవ్వడం ధర్మం. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ, హోమ్ శాఖ మంత్రి, ఇతర మంత్రులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం శోచనీయం. అత్యాచారాలకు తల్లుల పెంపకంలోనే లోపం ఉందని హోమ్ శాఖ మంత్రి చెప్పడాన్ని ఈ విస్తృత స్థాయి సమావేశం ఖండిస్తోంది. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు రాష్ట్రం హబ్ గా మారింది. రాజకీయ హత్యలు, దాడులు పెరుగుతున్నాయి. శాంతిభద్రతలు క్షీణించడానికి పాలక పక్షమే కారణమని, రాజకీయ హత్యలు, దాడులు, అక్రమ కేసులకు వారి అనుచిత వ్యవహార శైలే కారణమని ఈ విస్తృత స్థాయి సమావేశం తీర్మానిస్తోంది.