పెడన మున్సిపాలిటీలో అవినీతి కంపు: ఎస్ వి బాబు

పెడన, 1985 లో నగర పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించారు. మూడు దశాబ్దాలకు పైబడి పెడన ప్రజలకు ఈ మున్సిపాలిటీ సేవలందిస్తుంది. అనేకమంది మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు చేపట్టి తమ పదవికి వన్నె తెచ్చారు. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ పై నమ్మకంతో ఒక్క వార్డుమినహా అన్ని వార్డులను వైసిపి కౌన్సిలర్లను గెలిపించారు. అధికార పార్టీ వ్యక్తులు కౌన్సిలర్లుగా ఎంపికైతే పెడనపట్నాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశతో ఓటు వేశారు. కానీ వాస్తవానికి వైసీపీ పెడన మున్సిపాలిటీలో అధికారం చేపట్టిన తర్వాత పెడన మున్సిపాలిటీ పాలన గాడి తప్పింది. అవినీతిమయమైంది. పెడన మున్సిపాలిటీని వైసీపీ కార్యాలయంలా వాడుకుంటున్నారు. అందుకు నిదర్శనం ప్రభుత్వ కార్యాలయానికి పార్టీ బ్యానర్లు కట్టడం. ఈ సంవత్సరం ఆసీల పాట విషయంలో హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చిందంటే మున్సిపాలిటీ కౌన్సిల్ ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. గత సంవత్సరం ఆసీల పాట 22 లక్షల పైచిలుక ఉంటే, ఈ సంవత్సరం ఆసీల పాట 14 లక్షలకే పరిమితమైంది. అది కూడా ఏకపక్షంగా మంత్రి తమ అనుచరులకు కట్టబెట్టడం మున్సిపల్ కౌన్సిల్ ను తీవ్రంగా అవమానించడమే. పెడన పట్టణ ప్రజలు ఎవరైనా ఆసీలు పాటకు సంబంధించిన టెండర్ లో పాల్గొనుటకు సాల్విన్సీ సర్టిఫికెట్లు సకాలంలో మున్సిపల్ అధికారులు జారీ చేయడం లేదనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా ఎటువంటి టెండర్ పిలవకుండా మున్సిపల్ భవనానికి రంగులు వేయించి సుమారు 7 లక్షల రూపాయల బిల్లులు కౌన్సిల్లో పెట్టితే, జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యంతరం తెలపడం జరిగింది.

  • జనసేన పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ పావనికి అభినందనలు

ఒకే ఒక జనసేన పార్టీ కౌన్సిలర్ అయిన ఆమె ధైర్యం 100 మందికి సమానం. అధికార పార్టీ చేస్తున్న ప్రతి అవినీతిని ఆమె ధైర్యంగా ప్రతికటిస్తుంది. మొన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఆమె చూపించిన తెగువ ఆమె మాట్లాడిన విధానం పెడన పట్టణ ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ స్ఫూర్తి, నిజాయితీలొ ఉండే ధైర్యం ఆమెలో కనిపించింది. పావని మీరు అలాగే ముందుకు పోవాలి మీకు అండగా జనసేన పార్టీ, మేమందరం ఉంటామని తెలియజేస్తున్నాం. తాజాగా అధికారం చేపట్టిన మున్సిపల్ కౌన్సిల్ పెడన పట్టణానికి ఒరగపెట్టింది శూన్యం. ఎలాంటి అభివృద్ధికి శ్రీకారం చుట్టలేదు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణలో మాస్టర్ ప్లాన్ ను అమలు చేయలేదు. పూర్తిస్థాయి మంచినీటి సమస్యను తీర్చలేదు. మున్సిపాలిటీ పరిధిలోని రామలక్ష్మీ వీవర్స్ కాలనీ, తోట మూలల్లోని మరికొన్ని కాలనీలు వర్షం వస్తే జలమయం కావలసిందే. వారాలకొద్దీ నీటిలో ఉండవలసిందే. ఈ కాలనీకి సంబంధించి ఎటువంటి దిద్దుబాటు చర్య చేపట్టలేదు. ముఖ్యంగా పాత పైడమ కాలనీకి సంబంధించి విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. జనసేన పార్టీ ఈ సమస్యపై స్పందించగా తూతూ మంత్రంగా కౌన్సిల్ తీర్మానం చేసినట్లు చెప్పారే గాని ఆ కాలనీకి కరెంట్ లైన్లు ఇప్పటివరకు వేయలేదు. తీసికట్టు నాగం బొట్టు అన్నట్లు తయారైంది పెడన మున్సిపాలిటీ పరిస్థితి. పన్నులు జాస్తి, పనులు నాస్తి. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించాలి. ఒక అధికారిగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. మున్సిపల్ కార్యాలయానికి కట్టిన పార్టీ బ్యానర్లను తొలగించాలి. గౌరవ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలి. ఆసీల పాటకు సంబంధించిన టెండర్ను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. లేని పక్షాన జనసేన పార్టీ ప్రజాపక్షమై పెడన మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలను, అవినీతిని ప్రజలకు తెలియజేస్తామని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.