నియంత పోకడలకు పోతే సహించేది లేదు

  • జనసేన పార్టీ నాయకులకు పోలీసు వేధింపులు సరికాదు
  • చట్టం, పోలీసులపై ఉన్న గౌరవాన్ని పోలీసులు పోగొట్టుకోకూడదు
  • అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి జనసైనికులను ఇబ్బంది పెట్టడం న్యాయమైన చర్య కాదు
  • పోలీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన పార్టీ నాయకులు

ప్రభుత్వం, పోలీసులు నియంత పోకడలకు పోతే సహించేది లేదని జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు. సోమవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు రెడ్డి కరుణ, బంటు శిరీష్, వంగల దాలి నాయుడు, సిరిపరపు గౌరీ శంకర్, రాగోలు రాంబాబు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించే పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ సమీక్షా సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమైన జనసేన పార్టీ నాయకులను, జనసైనికులను పోలీసులు ఇళ్లకు వెళ్లి వేధించడం సరికాదన్నారు. అర్ధరాత్రి, వేకుజామున ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల వద్ద ఆరా తీయటం సరికాదన్నారు. తామేమి సంఘ విద్రోహక శక్తులం కాదని, అలాగని ఇసుక దోపిడీ, భూకబ్జాలకు పాల్పడలేదన్నారు. ఇసుక దోపిడీ, భూకబ్జాలు, నాటు సారా వ్యాపారాలు చేస్తున్న వారిని విడిచిపెట్టి పోలీసులు తమ పార్టీ అధినేత పిలుపుమేరకు సమీక్షకు వెళ్లే నాయకులు జనసైనికులను అరెస్టు చేయడం సరికాదన్నారు.