ఇవేం నియామకాలు గోవిందా?!

* తితిదే బోర్డులో నేరచరితులు
* రాజకీయ పునరావాసంగా మారిన నియామకాలు
* ఒకే వర్గం వారికి అధిక పదవులు
* ప్రలోభాలు, అవసరాలే గీటురాళ్లు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అతి సంప‌న్న‌మైన హిందూ ఆల‌యాల్లో ఒక‌టి…
ఏటా వేల కోట్ల ఆదాయాన్ని పొందుతున్న అతి పెద్ద దేవ‌స్థానం…
ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి కోట్లాది మంది భ‌క్తుల‌ను ఆక‌ర్షిస్తున్న ప‌విత్ర స్థ‌లం…
ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న తిరుమ‌ల తిరుప‌తి దివ్య క్షేత్రం గురించిన ఏ చిన్న అంశ‌మైనా అది భ‌క్తుల‌ను ఎంతో ప్రభావితం చేస్తుంది.
ఇంత‌టి ప్రాధాన్య‌త ఉన్న తిరుమ‌ల‌కు సంబంధించిన కొన్ని అనాలోచిత నిర్ణ‌యాలు, అసంబ‌ద్ధ‌మైన ప్ర‌క‌ట‌న‌లు త‌ర‌చు వివాదాస్ప‌దమ‌వుతుండడం, చ‌ర్చ‌నీయాంశ‌మ‌వ‌డం, విమ‌ర్శ‌ల‌కు గురి కావ‌డం భ‌క్తుల మ‌నోభావాల‌ను తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆందోళ‌న‌కు సైతం గురి చేస్తున్నాయి.
తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా తాజాగా 24 మంది నియామకాలతో ఈ విషయం మరోసారి ప్రస్ఫుటమైంది. ఈ సభ్యుల్లో కొందరు నేర చరితులు కూడా ఉండడం ఇప్పుడు సంచలనం సృష్టించడంతో పాటు భక్తుల ఆవేదనకు కారణమవుతోంది. అలాగే మంత్రి పదవులు ఇవ్వలేని వారికి, ఎమ్మెల్యే టికెట్లు కేటాయించలేని వారికి, తమ వారనుకున్నవారికి రాజకీయ పునరావాసం కల్పించడానికి తితిదే పాలక మండలి నియామకాలను ఉపయోగించుకున్నారని జాబితాను పరిశీలిస్తే అర్థం అవుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చి జగన్‌ ముఖ్యమంత్రిగా మారిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ మసకబారేలా అనేక అనాలోచిత నిర్ణయాలు ఎన్నో వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. తిరుమలకు వెళ్లే మెట్ల దారిలో చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారానికి సంబంధించిన విషయాల్లో ఉదాసీనత, మెట్లు ఎక్కే భక్తులకు ఊత కర్రలు ఇవ్వాలనుకోవడం, ఆ ఊత కర్రలపై ప్రచారానికి జగన్‌ బొమ్మ అతికించడం, తిరుమల ఆలయంపై విమానాలు, డ్రోన్లు ఎగరడం పట్ల గట్టి చర్యలు తీసుకోలేకపోవడం, తిరుమల మాడ వీధుల్లో ప్రైవేటు వాహనాల సంచారం, తిరుమలలో కొన్ని గదుల అద్దెను భారీగా పెంచడం, లడ్డూ ధరల పెంపు, ఉచిత లడ్డూల సంఖ్య తగ్గింపు, కొండ మీదకు తీసుకెళ్లే బస్సు ఛార్జీల పెంపు, వీఐపీల దర్శనాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చే విధానాలు, ప్రత్యేక ఆహ్వానితుల ఇబ్బడిముబ్బడి నియామకాలలాంటి అంశాలతో పాటు, తితిదే ఆస్తుల విక్రయం, వేలం, దేశ‌వ్యాప్తంగా ఉన్న క‌ళ్యాణ మండ‌పాల లీజు వ్య‌వ‌హారం, పాల‌క వ‌ర్గ సభ్యుల్లో కొందరిపై అస‌భ్య‌మైన ఆరోప‌ణ‌లు కూడా ఎదురు కావ‌డం, దేవ‌స్థానానికి సంబంధించిన కార్య‌క‌లాపాల‌పై సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా వ్య‌క్తం చేసిన వ్య‌క్తుల‌పై బెదిరింపులు, కేసుల న‌మోదుకు కూడా తెగ‌బ‌డ‌డం…. ఇలా ఎన్నో అంశాలు త‌ర‌చు చ‌ర్చ‌నీయాంశం కావ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఇలాంటి అంశాలను పరిశీలిస్తే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దేవస్థానం విషయంలో ప్రభుత్వం నిర్ణక్ష్యం అడుగడుగునా ప్రస్ఫుటమవుతుంది.
* ఇలాంటి వారా సభ్యులు?
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌పంచంలోనే అత్యంత కీల‌క‌మైన వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టి. దాదాపు ల‌క్ష కోట్ల విలువైన ఆస్తులు తిరుమ‌ల బాలాజీ పేరిట ఉన్నాయి. బాలాజీ ద‌ర్శ‌నానికి వ‌చ్చే కోట్లాది మంది భ‌క్తుల ద్వారా ఏటా 12 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆదాయం పొందుతున్న ఈ దేవ‌స్థానం అధికార వ్య‌వ‌స్థ కూడా చాలా విస్తృతంగా, ప‌క‌డ్బందీ విధానాల‌తో కూడి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న తితిదే పాలక మండలి సభ్యుల నియామకాల విషయంలో ఎంత పారదర్శకంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కానీ ఆ స్పృహే జగన్‌ ప్రభుత్వానికి లేదని తాజా నియామకాలు నిరూపిస్తున్నాయి. బోర్డు స‌భ్యుల పూర్వాప‌రాలు ప‌రిశీలించిన‌ప్పుడు వీరిలో కొందరికి శ్రీవారి సేవ‌తో కానీ, ఆధ్యాత్మిక నేప‌థ్యంతో కానీ సంబంధం లేక‌పోవ‌డ‌మే కాదు, వారికి ఎలాంటి ప్ర‌త్యేక అర్హ‌త‌లు కూడా లేవ‌నే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, వీరిలో కొంద‌రు కొన్ని కేసుల్లో నిందితులు కూడా. దిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయి, అప్రూవర్‌గా మారిన అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ పెనక శరత్‌ చంద్రారెడ్డికి పాలక మండలిలో చోటు దక్కడం భక్తులకు ఆవేదన కలిగిస్తోంది. ఈయన వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి అల్లుడి అన్న కావడం గమనార్హం. వైకాపా అధికారంలోకి రాగానే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ పూర్తిగా శరత్‌ చంద్రారెడ్డి చేతుల్లోకి వచ్చిన సంగతిని ఎవరూ మర్చిపోలేరు. ఈయన వ్యాపార సంస్థ అరబిందోకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు దక్కాయి. అంతేకాకుండా తితిదే పాలక మండలిని పరిశీలిస్తే చైర్మన్‌, ఈవో సహా కీలక పదవులు ఒకే ప్రధాన సామాజిక వర్గానికి దక్కడం కూడా భక్తుల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా తితిదే పాలక మండలిలో చోటు సంపాదించుకున్న 24 మందిలో అయిదుగురు ఆ సామాజిక వర్గం వారే కావడం నియామకాల్లో కుల కోణాన్ని ఎత్తి చూపిస్తోంది.
* రాజకీయ బుజ్జగింపులే కారణం…
కుల, రాజకీయ అవసరాలు, ప్రాధాన్యతలే తితిదే పాలక మండలి సభ్యుల నియామకాల్లో ప్రస్ఫుటమవుతున్నాయని జాబితాలోని పేర్లను పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతోంది. మంత్రి మండలిలోకి తీసుకోలేకపోయిన ఎమ్యెల్యేలు పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌, సామినేని ఉదయభాను, ఎం. తిప్పేస్వామి ఇప్పుడు తితిదే బోర్డు సభ్యులుగా కొలువుదీరారు. అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న వారిలో మేకా శేషుబాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు, శిద్ధా వీర వెంకట సుధీర్‌ కుమార్‌లకు పదవులు దక్కాయి. అలాగే కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అనుచరుడైన ఆర్‌. వెంకట సుబ్బారెడ్డి, వైఎస్‌ కుటుంబానికి విధేయుడైన సురేష్‌, కమలాపురం ఎమ్మెల్యే అనుచరుడు సిద్ధవటం యానాదయ్య తితిదే బోర్డు సభ్యులుగా మారారు. ఇక గత పాలకమండలిలో సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌కి కొనసాగింపు ఇచ్చారు. ఈయన ఎంసీఐ చైర్మన్‌గా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్టు చేయడం గమనార్హం. అలాగే చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి భార్య గడ్డం సీతారెడ్డికి, సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాముల రాంరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక బెంగళూరులో జగన్‌ ఇల్లు ఉన్న ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేకు కూడా కొనసాగింపు లభించడాన్ని చూస్తే రాజకీయ ప్రలోభాలకు సైతం తితిదే సభ్యుల నియామకాలనే ఉపయోగించుకున్నారని తేటతెల్లమవుతోంది.
* సామాన్యులకు మాత్రం అన్నీ వెతలే…
తిరుమ‌ల అన‌గానే ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు, బ్రేక్ ద‌ర్శ‌నాలు త‌ప్ప‌వు. కొంద‌రు ప్ర‌ముఖుల‌కు ఇలాంటి ద‌ర్శ‌నాలు ఏర్పాటు చేయ‌డంలో ఎవ‌రికీ అభ్యంత‌రాలు కూడా పెద్ద‌గా ఉండ‌వు. గ‌తంలో బ్రేక్ ద‌ర్శ‌నాల సంఖ్య 2500కి మించేది కాదు. ప్ర‌త్యేక సందర్భాల‌లో కూడా ఈ సంఖ్య‌ను మూడు వేల లోపే ఉండేలా చూసేవారు. వీరి కోసం ప్ర‌త్యేక స‌మ‌యాన్ని కేటాయించి సామాన్య భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌లుగ‌కుండా చ‌క‌చ‌కా ద‌ర్శ‌నం జ‌రిగేలా చూసేవారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఈ సంఖ్య 4000 దాటి పోయింది. వీరి ద‌ర్శ‌నానికే 4 గంట‌ల స‌మ‌యం ప‌ట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక మామూలుగానే బోర్డు స‌భ్యులు ఒకొక్క‌రు 20 మందికి బ్రేక్ దర్శ‌నాల‌కు సిఫార్సు చేసే అవ‌కాశం ఉంటుంది. అలాగే సుప‌థం ద్వారా కూడా 20 మందికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు క‌ల్పించే వీలు ఉంది. ఈ నేపథ్యంలో అటు బోర్డు సభ్యులు, ఇటు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖుల ద్వారా వచ్చే సిఫార్సుల‌ను కూడా లెక్క‌లోకి తీసుకుంటే వీరంద‌రి ద‌ర్శ‌నాల‌కు ప‌ట్టే స‌మ‌యం మ‌రిన్ని గంట‌లు ప‌ట్ట‌క త‌ప్ప‌డం లేదు. అంటే… అంత‌సేపూ సామాన్య భ‌క్తులు క్యూలైన్ల‌లో పిల్లా పాప‌ల‌తో నిరీక్షించి చూస్తూ ఆప‌సోపాలు ప‌డక తప్పడం లేదు.
* అడుగ‌డుగునా వివాదాలే…
అత్యంత ప‌విత్ర క్షేత్రంగా ప్ర‌పంచవ్యాప్తంగా భ‌క్తుల‌ను ఆకర్షించే తిరుమ‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం మొద‌టి నుంచీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న‌డానికి ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్లులుగా ఉన్నాయ‌ని సామాన్యుల నుంచి విశ్లేష‌కుల వ‌ర‌కు అనేక ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు. దేవ‌స్థానం ఆస్తుల వేలానికి తెగ‌బ‌డ‌డం, తిరుమ‌ల బ‌స్ టికెట్ల వెనుక అన్య‌మ‌త ప్ర‌చారం సాగ‌డం, తిరుమ‌ల అధికారిక వెబ్‌సైట్లో అన్య మ‌త గేయాలు క‌నిపించ‌డం, ఎస్వీబీసీ చైర్మన్ గా నియామ‌కుడైన వ్యక్తి రాస‌లీల‌లు వెల్ల‌డి కావ‌డం, త‌ల‌నీలాలను స్మ‌గ్లింగ్ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు, దేవ‌స్థానం మాస ప‌త్రిక‌లో రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రించే వ్యాసాలు రావ‌డం, శ్రీవారి ప్ర‌సాదాన్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పంపిణీ చేయ‌డం, తిరుమ‌ల‌లో రోడ్డు డివైడ‌ర్ల‌కు వైకాపా రంగులు వేయ‌డం, తిరుమ‌ల‌లో అన్య‌మ‌తస్థుల నియామ‌కాలు జ‌ర‌గ‌డం లాంటి ఎన్నో వివాదాల గురించి స‌ర్వ‌త్రా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఉండే బాలాజీ భక్తుల మనోభావాలను గాయపరిచేవే.