వైసీపీ ప్రభుత్వానికి ఘోరీ కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

  • రానున్నది జనసేన ప్రభుత్వమే
  • పవన్ కళ్యాణ్ నిజాయితీపై ప్రజల్లో విశ్వాసం
  • పారిశుద్ధ్య కార్మికుల సమస్యలకై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక
  • వర్కర్స్ కాలనీ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరచిపోము
  • గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: అభివృద్ధిని అటకెక్కించి అరాచకాలతో, దాష్టీకాలతో నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్ ని ప్రశ్నార్థకం చేసిన వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, వైసీపీ ప్రభుత్వానికి ఘోరీ కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. సమస్యలపై సమరభేరి కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ అధ్యక్షుడు జటావత్ పవన్ నాయక్ ఆధ్వర్యంలో వర్కర్స్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమం ముసుగులో చేస్తున్న అక్రమాలపై ప్రజల్లో అవగాహన పెరగటం శుభపరిణామమన్నారు. వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగటంపై సామాన్య ప్రజల్లో సైతం ఆగ్రహం నెలకొందన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నిజాయితీ పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. తమకు ఘనస్వాగతం పలికిన వర్కర్స్ కాలనీ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరచిపోలేమని నేరేళ్ళ సురేష్ అన్నారు. రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా పారిశుద్ధ్య కార్మికుల జీవితాలతో అన్ని రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల జీవితాలపై పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ అవగాహన ఉందని, సమస్యల పరిష్కారానికై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు మాట్లాడుతూ కార్మికుల, కర్షకుల శ్రమ దోపిడీని అరికట్టాలి అంటే పేదల కష్టాలు తెలిసిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు మద్దతు ఇవ్వాలని ప్రజల్ని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను వైసీపీ నేతలు నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అగమ్యగోచరంగా మారిన రాష్ట్ర భవిష్యత్ ను కాపాడే నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని సోమి శంకరరావు అన్నారు. కార్యక్రమంలో రెల్లి యువత రాష్ట్ర నాయకుడు సోమి ఉదయ్ కుమార్, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రకుంట మల్లిక నగర కమిటీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.