షాదీ తోఫా తీరుతో ముస్లిం యువత పరేషాన్!

* మూడున్నరేళ్లు మౌనం….తరువాత తప్పదన్నట్లు తతంగం
* నిబంధనల పేరిట భారీగా లబ్దిదారుల కుదింపు

పైన పంచదార పూత, లోన కత్తెర కోత….! దీనికి మరో ప్రధాన ఉదాహరణ – ఏపీలో ‘షాదీ తోఫా’ అమలు తీరు. అంటే, ముస్లింలకు పెళ్లికానుక / కల్యాణమస్తు పథకం. దీనికి సంబంధించి నాడు ప్రతిపక్షనేతగా, నేటి ముఖ్యమంత్రిగా జగన్‌ మాటలు, చేతలు ఇన్నీ అన్నీ కావు. ఎక్కడా ఏ దశలోనూ పొంతన అన్నదే కనిపించదు. పథకం గత ప్రభుత్వ హయాంలోనిది. అప్పట్లో విపక్షంలో ఉన్న ఆయన నానారకాలుగా మాట్లాడారు. ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికల ప్రయోజనాలే ఆ కార్యక్రమం వెనక దాగి ఉన్నాయన్నారు. నామ మాత్ర ఆచరణే తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో సందేహాలను లేవనెత్తారు. పేద ముస్లిం యువత జీవితాల్లో వెలుగు నింపే విధానం అదేనా అంటూ ఏకంగా పాలన సూత్రాల్ని ఏకరువు పెట్టారు. అన్ని మాటలు చెప్పిన ఆయన తీరా ముఖ్యమంత్రి అయ్యాక చేసిందేమిటి? నయవంచన. ఇప్పటికీ కొనసాగిస్తోంది ఇంకేమిటి? తీపి మాటలూ…. చేదు చేతలూ.
*తప్పనిసరై మొక్కుబడి తంతు
అధికారానికి వచ్చీరాగానే, జగన్‌ అసలు రంగు బయటపడింది. మొదట గత 2019 సెప్టెంబరులో ఆరంభశూరత్వం ప్రదర్శించారు. రాష్ట్రంలో పెళ్లికానుక పథకానికి మార్పు చేర్పులు తెచ్చి, 2020 ఏప్రిల్‌ నుంచి పక్కాగా అమలు చేస్తామన్నారు. ఆ మేర అదేశాలైతే ఇచ్చారు కానీ, ఉలుకూ పలుకూ లేదు. ఒకటి, రెండు కాదు – వరసగా మూడున్నర ఏళ్లపాటు అదే తంతు! ఆ లోగా ముస్లిం సంఘాలు న్యాయస్థానం తలుపు తట్టడంతో, ఇక తప్పనిసరై పథకాన్ని సరికొత్తగా రూపొందించి ఆచరణకు తెస్తామన్నారు. అసలు ఏ పథకాన్ని అయినా మెరుగుదిద్దడం అంటే ఏమిటి? నూతనత్వాన్ని జతచేయడం వెనక ఉండాల్సిందేమిటి? లబ్ధిదారుల సంఖ్య పెరగడం. జగన్‌ పాలన పుణ్యమా అని అదే జరగలేదు. మరి జరిగిందేమిటి? పథకం పేరు మార్చడం ఒక్కటే! దుల్హన్‌ పేరును షాదీ తోఫాగా మార్చారు. అంతవరకే! పునరుద్ధరణ … పేరు మార్పులో తప్ప ఆచరణలో కాదు.
*లబ్దిదారుల భారీ కోత
గత ప్రభుత్వ పాలనలోని లబ్ధిదారుల సంఖ్యను, వారు పొందిన సాయం వివరాలను చూస్తే…. 2015-16లో సంఖ్య 2,584 మంది. సాయం (కోట్ల రూపాయల్లో) 12.92. తర్వాత 2016-17లో లబ్ధిదారుల సంఖ్య 9,822కు పెరిగింది. అందిన సాయం రూ. 49.11 కోట్లకు హెచ్చింది. ఇక 2017-18 లో సంఖ్య ఒక్కసారిగా 11,920 కి పెరిగింది. సాయం రూ. 59.60 కోట్లకు హెచ్చింది. అనంతరం 2018-19లో లబ్ధిదారుల సంఖ్య 15,976 కాగా వారికి అందిన సాయం రూ. 79.88 కోట్లు, అంటే 2015 మొదలు 2019 వరకు నాలుగేళ్ల కాలంలో వరసగా అందిన సాయమంతా కలుపుకొని రూ.201.51 కోట్లు. నాడు నాలుగేళ్లలోనూ లబ్ధిదారుల సంఖ్యను కలుపుకొంటే 40,302 మంది. అంటే మునుపటి ప్రభుత్వ పాలనాకాలంలో నలభై వేల మందికి పైగా రూ.201.51 కోట్ల మేరకు సాయం పొందారన్న మాట. జగన్‌ నిర్వాకంవల్ల గడచిన నాలుగేళ్లలో ముస్లిం యువతుల వివాహాలకు అందిన ప్రభుత్వ సాయం కేవలం రూ. 38.62 కోట్లు! అదీ ఈ సంవత్సరంలో మూడు విడతల్లో! గత ఫిబ్రవరిలో తొలి విడతగా 912, మే నెలలో రెండో విడతగా 1,007, తాజా విడత కింద 2,033 మంది లబ్ధిదారులు. అంటే అంతా కలిపి కనీసం నాలుగు వేలమంది అయినా లేరు! ఎక్కడి నలభై వేలు, ఎక్కడి నాలుగు వేలు? ఎక్కడి రూ.201 కోట్లు, ఎక్కడ రూ.38 కోట్లు? ఇదీ సంగతి. షాదీ తోఫా పథకం కింద ముస్లిం యువతకు ఆర్ధిక సాయం గతంలో రూ.50 వేల వంతున ఉండేది. ఆ మొత్తాన్ని జగన్ ప్రభుత్వం రూ.లక్ష చేసినా, లబ్ధిదారుల సంఖ్య మాత్రం చాలా చాలా తక్కువ.
*కొర్రీల మహమ్మారి
పథకం అమలులో ఏళ్లతరబడి కాలయాపన చేయడం జగన్‌ మార్కు పాలన. మూడున్నర సంవత్సరాలూ ఆ పెళ్లికానుక పథకం ఊసే లేకుండా చేశారు. ముస్లిం సంఘాలు కోర్టుకెక్కడంతో, తప్పనిసరై మునుపటి ప్రభుత్వ పథకాన్ని పేరు మార్చి తెచ్చారు. అమలుతీరు సరేసరి! షాదీ తోఫాకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరగకుండా కొర్రీలు వేశారు. లబ్ధిదారులను ఏదోవిధంగా కుదించడమే ధ్యేయమన్నట్లు వ్యవహరించారు. మూడు విడతల్లో నాలుగు వేల మందికే పరిమితం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి మరో రెండు విడతల్లో ఆర్థికసాయం అందించినా, ఆ సంఖ్య మూడు వేల వంతున ఆరువేలు అయినా, లబ్ధిదారుల సంఖ్య మొత్తం పది వేలకు మించదు. అడ్డగోలు నిబంధనల విధింపులో జగన్‌ ప్రభుత్వం దానికి అదే సాటి! సాయం పొందాలంటే వధూవరులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాల్సిందే అంటూ పట్టుపడుతోంది. నిజానికి మునుపటి ప్రభుత్వ హయాంలోను అదే నిబంధన ఉన్నా, రెండేళ్లపాటు (2018 నుంచి 2020 వరకు) ఆయా పెళ్లిళ్లకు సడలింపునిచ్చారు. దీనివల్ల, అప్పటికి కొన్నేళ్లక్రితమే పలు కారణాలతో పదో తరగతి పూర్తి చేయలేనివారికి పథక ప్రయోజనం వర్తించింది. ఆ రెండు సంవత్సరాల్లో మరికొంతమంది దూరవిద్య ద్వారా పది పూర్తిచేసి పథకం లబ్ధిని పొందే వెసులుబాటు వచ్చిందన్న మాట. అయితే జగన్‌ ప్రభుత్వం మాత్రం పదో తరగతి అంశం 2024 తర్వాత అమల్లోకి వచ్చేలా సడలింపునిస్తూ, ఉత్తర్వు ఇచ్చేసింది. అది నిరుడు (2022) సెప్టెంబరునాటి జీవో సారాంశం. కానీ కొద్ది రోజులైనా గడవకుండానే, ‘పది ఉత్తీర్ణత తప్పనిసరి’ అంటూ సవరణ చేసేసింది. ఎందుకలా అంటే, లబ్ధిదారుల సంఖ్య పెరగకుండా ‘ముందు జాగ్రత్త’ కాబోలు!
*నిబంధనలే ప్రతిబంధకాలు
పదోతరగతి నిబంధన ఒక్కటే కాదు … మరికొన్ని ‘దశలవారీ నిబంధనల’ విధింపునకూ జగన్‌ ప్రభుత్వం పాల్పడింది. అవి ఆదాయ పరిమితి, వ్యవసాయ భూమికి సంబంధించినవి. అలాగే పట్టణాల్లో ఇంటి విస్తీర్ణం, ఏడాదికి సగటు విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు, మరికొన్ని నిబంధనల పరంపర. ఇలా వరసబెట్టి విధించడంతో పథకం లబ్ధిదారుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. అనేకమంది ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థికసాయం అందకుండా పోయింది! షాదీ తోఫా ప్రయోజనం బహుకొద్దిమందికే పరిమితమైన పరిస్థితి నేటికీ కొనసాగుతూ వస్తోంది. జగన్‌ ప్రభుత్వ విధానాలే పేదలకు ప్రధాన ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. అందుకే ముస్లిం సంఘాలు ఇప్పటికీ తీవ్ర అందోళన చెందుతూనే ఉన్నాయి. జగన్ గత ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సాక్షాత్తు ఆయన ప్రభుత్వానికే పూర్తిగా వర్తిస్తాయి. ఇప్పటి ఏపీ పాలకులకు చిత్తశుద్ధి బొత్తిగా లేదు. పేదలను ఆదుకోవాలన్న ఉద్దేశం ఎంతమాత్రం కనిపించదు. షాదీ తోఫాతో లబ్ధి పొందేవారి సంఖ్యను ఏదో విధంగా కుదించేయాలన్నదే అసలు లక్ష్యం! పథకం అమలుకు విధించే నిబంధనలు పేదల బతుకుల్లో వెలుగులు నింపాలే తప్ప, మరింత చీకటిమయం చేయకూడదు. ఇదంతా జగన్‌ మార్కు చీకటి పాలన! సామాన్యులకు అన్ని రకాలుగా హైరానా!