వైసీపీ వల్ల కోనసీమ ప్రాంతంలో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు

• ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి
• పాలన బాగుంటే రైతుల కంట నీరెందుకు వస్తుంది?
• కోనసీమ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయానికి దూరమవుతోంది
• పంట నష్టం జరిగితే యంత్రాంగం పొలాల్లో కనబడడం లేదు
• ప్రభుత్వం నుంచి రైతులకు భరోసా లేదు
• సర్పంచుల నిధులు లాగేసుకున్నారు
• ప్రజలు కష్టాల్లో ఉంటే వన్ టైమ్ సెటిల్మెంట్ అంటూ వేధిస్తున్నారు
• ప్రజలకు జనసైనికులు అండగా నిలుస్తున్నారు
• అమలాపురం కార్యకర్తల సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మె చేసే పరిస్థితులను ఈ పాలకులు తీసుకువచ్చారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఉద్యోగుల సమస్యలనే ప్రభుత్వం పట్టించుకొనే స్థితిలో లేదని… వారి సమస్యల మీద ప్రభుత్వ స్పందన లేదు కాబట్టే పోరాటానికి సిద్ధమవుతున్నారు అన్నారు. జనసేన పార్టీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు ఎప్పుడూ అండగా ఉంటాయని స్పష్టం చేశారు. పరిపాలన సరిగా ఉంటే పచ్చటి కోనసీమ ప్రాంత రైతుల కంట కన్నీరు ఎందుకు వచ్చిందో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పాలని ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతాంగం సాగుకి దూరం కావల్సిన కర్మ ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ వైఫల్యాలే అన్ని వర్గాల ప్రజల కష్టాలకు కారణమన్నారు. సోమవారం మధ్యాహ్నం అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పంట నష్టపోయిన రైతులను పొలాల్లోకి వెళ్లి పలకరిస్తే- తామెంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామో వివరించారు. ఈ ప్రభుత్వం కనీసం క్రాప్ ఇన్సురెన్స్ కూడా చేయించలేదన్న బాధ రైతుల్లో ఉంది. పంట నష్టం జరిగితే అధికార యంత్రాంగం ఎక్కడా కనబడడం లేదు. ప్రజా ప్రతినిధులెవరూ రైతులకు భరోసా ఇవ్వడంలేదు. వారిని పలుకరించడానికి మేము వెళ్తే అంత కష్టంలోనూ రైతులు జనసేనకు జై కొడుతున్నారంటే ఈ ప్రభుత్వ పని తీరు ఎలా ఉందో అర్ధం అవుతుంది. ప్రజలు జనసేన కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో తెలుస్తోంది.

• ఇల్లు కదలని సీఎం ఏం మేలు చేస్తాడు

శ్రీ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తారని నమ్మి ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు. వారు ఎంత నమ్మకంతో ఓటు వేసి ఉంటారు. యువకుడు మార్పు తీసుకువస్తాడని అవకాశం ఇస్తే ఆయనగారు ఇంటి నుంచే బయటకు రావడం లేదు. సొంత జిల్లాకు వరదలు వస్తేనే హెలీకాప్టర్ లో తిరిగి వెళ్లిపోయాడని ఆ ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయగలుగుతాడు. ఈ ప్రభుత్వం చివరాఖరికి సర్పంచుల నిధులు కూడా లాగేసుకుంది. 15వ ఆర్ధిక సంఘం నిధులు మళ్లించేశారు. ఇవి ఎటు పోయాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే రూ.230 కోట్లులాగేసుకున్నారు. ఫించన్లు లేవు. రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలో నెట్టింది. ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో రాష్ట్రం అంధకారంలోకి పోయింది. చీకటి రాజ్యం వస్తోంది. కష్టాల్లో ఉన్న ప్రజలను పలుకరించలేని ముఖ్యమంత్రికి పరిపాలించే అర్హత లేదు. ఆదే విషయాన్ని మనమంతా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.

• ప్రజలు బాధల్లో ఉంటే వన్ టైమ్ సెటిల్మెంట్ అంటారా?

పరిపాలనా దక్షత లేదు. సమస్యలపై స్పందించే గుణం లేదు. కరోనా వల్ల ప్రజలు గత 20 నెలల ఇబ్బందిపడితే… ముఖ్యమంత్రి వాళ్ళను ఇబ్బందిపెట్టి ఆనందం పొందుతున్నారు. వాలంటీర్లను ఇంటింటికీ పంపి వన్ టైమ్ సెటిల్మెంట్ అని ప్రజలను ఏడిపిస్తున్నారు. ఎప్పుడో ఇళ్లు కట్టుకున్న వారిని ప్రభుత్వం ఇప్పుడు బెదిరిస్తోంది. పాలకులే అలా ప్రవర్తిస్తుంటే పోలీసులు ఏం చేస్తారు. యువకుల మీద ఊహించని విధంగా కేసులు పెట్టి వేదిస్తున్నారు. అలాంటి సమయంలో జనసైనికులకు భరోసా ఇవ్వడం కోసం ప్రతి జిల్లాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ప్రజల్లో మార్పు కనబడుతోంది. ప్రజల నుంచి వచ్చే స్పందనలో స్పష్టత కనబడుతోంది. ఏ వర్గాన్ని కదిలించినా సమస్యలు చెబుతున్నారు. లబ్దిదారులకు సరిగా ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రజలంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి మార్పు సమాజంలో కనబడుతోంది. నాయకత్వం అనేది ఒక బాధ్యత.. దాన్ని మనం చిత్తశుద్ధితో స్వీకరించాలి. నాయకత్వం ప్రజల్లోనుంచి రావాలి. గ్రామాల నుంచి రావాలి. సమస్య గురించి సమాచారం వచ్చినప్పుడు నిలబడాలి. సమస్యలపై మన నాయకుడు ఏ విధంగా నిలబడతారో వివరించాలి. సమాచారం ఇచ్చినప్పుడు వెంటనే స్పందించే గుణం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. జనసేన పార్టీ ఒక ఎన్నిక కోసం వచ్చింది కాదు. జనసేన పార్టీ భావితరాల భవిష్యత్తు కోసం వచ్చిన పార్టీ. మనతో 25 సంవత్సరాల ప్రయాణం చేయాలన్న నినాదంతో ముందుకు వచ్చిన పార్టీ. భావితరాల భవిష్యత్తు కోసం వచ్చిన పార్టీ.

• శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెద్దన్న పాత్ర పోషించాలి

స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అంతా ఓ పెద్దన్న పాత్ర పోషించారు. ఇళ్లలో ఆడపడుచుల్ని నిలబెట్టి కష్టపడి గెలిపించారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా ప్రజల కోసం నిలబడుతోంది జనసైనికులే. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నవంబరు 23వ తేదీన కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాం. వరదలు ఎందుకు వచ్చాయి, ఇళ్లు కొట్టుకుపోవడానికి కారణాలు తె లుసుకోమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపారు. ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు అందరికంటే ముందు జనసైనికులే స్పందించారు. జనసైనికులే కలెక్టర్ కు ఫోన్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. బోట్లు తెచ్చి ప్రజలను ఆదుకున్నారు. ఆ విషయాన్ని పార్టీ తరఫున ఘనంగా చెప్పుకోగలుగుతున్నాం. జనసైనికుల చిత్తశుద్దే మన ఎదుగుదలకు కారణం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నాం. రహదారుల దుస్థితిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనం డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తే.. రాష్ట్ర ప్రజల కష్టాలు చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయో అర్ధం కావడం లేదు. రహదారులకు కనీసం మెయింటినెన్స్ కూడా లేదు. నిన్న కాకినాడ ఏడీబీ రోడ్డు మీద శ్రమదానం చేపట్టాం. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెబుతారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేసినా అది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని. తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది ఎంసీటీసీలు, సర్పంచులు గెలిచారు. జిల్లానుంచి 19 మంది శాసనసభ్యులు వచ్చేలా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి” అన్నారు.

• అమలాపురంలో భారీ ర్యాలీతో స్వాగతం

అంతకు ముందు అమలాపురం పర్యటనకు వచ్చిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ముమ్మడివరం నియోజకవర్గం కొండాలమ్మచింత దగ్గర జనసైనికులు భారీ పూల మాలలతో ఆహ్వానించారు. అక్కడి నుంచి వందల సంఖ్యలో బైకులు, కార్లతో అనాతవరం, భీమనపల్లి, భట్టుపాలెం, సమనస మీదుగా అమలాపురం వరకు దాదాపు 20 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు.

• జనసేనలోకి మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీ యాళ్ళ నాగ సతీష్

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సోమవారం అమలాపురంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీ యాళ్ల నాగ సతీష్ అనుచరులతో కలసి జనసేనలో చేరారు. శ్రీ మనోహర్ గారు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో మాజీ కౌన్సిలర్లు, ఉప సర్పంచ్ లు, పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందుపల్లి గ్రామ ఉప సర్పంచ్ శ్రీ ఉర్రింక హనుమాన్ బుజ్జి తన గ్రామానికి చెందిన కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. అమలాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణ, పార్టీ కార్యక్రమాల విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నేతలు శ్రీమతి గంటా స్వరూప, శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ బండారు శ్రీనివాస్, శ్రీ తుమ్మల బాబు, శ్రీ చోడిశెట్టి చంద్రశేఖర్, శ్రీ డి.ఎం.ఆర్.శేఖర్, శ్రీ ఇసుకపట్ల రఘుబాబు, శ్రీమతి నాగమానస, శ్రీ లింగోలు పండు తదితరులు పాల్గొన్నారు.