రైతు కన్నీరు తుడవని బటన్లు ఎన్ని నొక్కితే ఏం లాభం?

* రూ. 9 లక్షల 60 వేల కోట్ల అప్పులు చేసి కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చలేదు
* జనసేన- టీడీపీ కలిస్తే ఏ శక్తీ దాన్ని ఆపలేదు
* వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ది పదేళ్లు వెనక్కి వెళ్లింది
* సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
* తెనాలి నియోజకవర్గం కొలకలూరులో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

అన్నం పెట్టే అన్నదాతల కన్నీరు తుడవకపోతే ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా, ఎన్ని బటన్లు నొక్కినా ఏం ఉపయోగమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రశ్నించారు. రూ. 9.6 లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేకపోయిందని అన్నారు. జనసేన – తెలుగుదేశం కలిసి పని చేస్తే ఏ శక్తి దాన్ని ఎదుర్కొలేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో మనందరం ముందుకు వెళ్దామని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నుంచే పోటీ చేస్తానని, ప్రజలు పడుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం తెనాలి నియోజకవర్గం కొలకలూరులో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు కన్నీరుపెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెనాలి మండలం కొలకలూరులో కూడా రైతులు సాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఖాజీపేట గ్రామ రైతులు నా దగ్గరకు వచ్చారు. కాలువలు పూడికలు తీయడం కోసం అధికారులు చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. సొంత నిధులతో మేమే బాగు చేసుకుంటామని చెప్పారు. కాలువలను బాగు చేయడం ప్రభుత్వం విధి అని చెప్పి డి.ఇ.కి ఫోన్ చేశాను. మీరు కాలువల పూడికలు తీయకపోతే నేనే స్వయంగా వచ్చి శ్రమదానం చేసి కాలువ పూడికలు తీయిస్తామని చెప్పాను. వెంటనే స్పందించిన డి.ఇ. వినాయక చవితిలోపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దసరా వచ్చినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఇటీవల గడప గడప కార్యక్రమం కోసం వచ్చిన ఎమ్మెల్యేను రైతులు నిలదీస్తే వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తానని చెప్పారు. 12 రోజులైనా ఇప్పటికీ పనులు మాత్రం జరగలేదు. రేపు ఒకసారి అధికారులతో మాట్లాడతాను. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే మనం చేయాల్సిన కార్యక్రమం మనం చేద్దాం.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
పురుగుల మందుల నుంచి విత్తనాల వరకు అధికారులే రైతుల వద్దకు వచ్చి అందిస్తారని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం చెప్పింది. ప్రతి ధాన్యం గింజా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు తేమశాతం అని చెప్పి 40 కిలోమీటర్ల దూరం ఉన్న మిల్లులు వద్దకు రైతులను పంపిస్తున్నారు. నివర్ తుపాన్ సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో పర్యటించారు. నష్టపోయిన ప్రతీ రైతు కుటుంబానికి రూ. 25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కు అర్జీ కూడా ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నపూర్ణలాంటి ఉభయగోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం చివరకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సొంత నియోజకవర్గంలో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ స్థాయిలో భరోసా ఇవ్వాలి. దాన్ని వదిలేసి హెలికాప్టర్ లో తిరుగుతూ బటన్లు నొక్కుకుంటూ కాలయాపన చేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల నుంచి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చి కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డారు.
గ్రామ వాతావరణాన్ని చెడగొట్టారు
విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఎన్నికల్లో గెలవడం కోసం ముందొక మాట గెలిచాక మరో మాట మార్చకూడదు. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతానికి ఏం చేయాలి, ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి అనే ముందు చూపుతో ఆలోచించాలి. కాఫీ ఫ్యాక్టరీ వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. నేను ఇలాంటి సమస్యలు వస్తుందనే ముందుగానే ఊహించి గ్రామానికి రక్షితమంచి నీటి పథకం తీసుకొచ్చాను. వల్లభాపురం నుంచి నీరు తీసుకొచ్చాము. ఖాజీపేట వరకు ట్యాంకులు నిర్మించాము. ఇక్కడి ప్రజలు వైద్య అవసరాల కోసం గుంటూరు వరకు వెళ్లాల్సి వస్తుందని తెనాలిలోనే ఆస్పత్రి నిర్మించాం. ఆడబిడ్డలు సుఖంగా ప్రసవం జరగాలని తల్లిపిల్లల ఆస్పత్రి నిర్మిస్తే … ఇప్పుడు ఆస్పత్రిలో వైద్య పరికరాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం ఆ డబ్బును ఏం చేస్తోందో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. ఈ 20 కిలోమీటర్ల రావడానికి కూడా ఆయన హెలికాప్టర్ నే ఉపయోగిస్తారు. రోడ్డు మీద నుంచి వస్తే ప్రజలు ఎక్కడ రోడ్ల గురించి నిలదీస్తారో అని ఆయనకు భయం. అలాగే రోడ్డు మీద రావాలంటే చెట్లు కొట్టాలి. పరదాలు కట్టాలి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు. దాదాపు 300 కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయి.
మందు డోర్ డెలివరీ చేస్తున్నారు
శాసనసభాపతిగా ఉన్న సమయంలో బాల పంచాయతీ వ్యవస్థ తీసుకొద్దామని ప్రయత్నం చేశాను. చిన్న వయసులోనే పిల్లలకు పారిశుద్ధ్యం, గ్రామ సమస్యలపై అవగాహన పెంచాలని చూశాం. ఆ రోజుల్లో పాఠశాలల వద్ద ఉన్న బెల్ట్ షాపులను తొలగిస్తే… ఇప్పుడు వాలంటీర్లే మందును డోర్ డెలవరీ చేస్తున్నారు. దేశమంతా డిజిటల్ పేమెంట్స్ ఉండాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒకవైపు చెబుతుంటే మన రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపుల వద్ద ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. ఒక్క మద్యం అమ్మకాల్లోనే ప్రభుత్వ పెద్దలు వేల కోట్లు దోచుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కావాలనే ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొడితే జనసేన పార్టీ వారికి అండగా నిలబడింది. అప్పుడు బయటకు వచ్చిన జనసేన పార్టీ ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. లక్షలాది మంది యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. ప్రతీ ఏటా జనవరి 1న జ్యాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. మెగా డీఎస్సీ అని కట్టు కథలు చెప్పింది. విద్యుత్ ఛార్జీలను భయంకరంగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర మారిపోయింది. కొలకలూరులో భూముల రేట్లు పడిపోయాయి. ఒకప్పుడు కోటి రూపాయలు ధర పలికిన భూమి ఇప్పడు రూ. 40 లక్షలు కూడా పలకడం లేదు. వికలాంగులకు సదరం సర్టిఫికేట్ ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదు. వచ్చే నెల ఇస్తాం.. వచ్చే నెల ఇస్తాం అని తిప్పతున్నారు. మరో 5 నెలలు అయితే వైసీపీ ప్రభుత్వమే పోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీకి పోటీ ఎవరూ ఉండకూడదు. అన్ని స్థానాలు ఏకగ్రీవం కావాలని ముఖ్యమంత్రే చెబితే ప్రజాస్వామ్యం ఎక్కడుంది? రాజకీయాల్లో విలువలు ఏమైపోయాయి? రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం కూటమిని ఆశీర్వదించండి. వైసీపీ చేసిన నష్టం నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే మరో పదేళ్లు పడుతుంది. మనందరం కలిసికట్టుగా పని చేస్తేనే వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయగలం” అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ ఇస్మాయిల్ బేగ్, పార్టీ నేతలు శ్రీ తోటకూర వెంకట రమణారావు, శ్రీ హరిదాసు గౌరీశంకర్, శ్రీ పసుపులేటి మురళీకృష్ణ, శ్రీ దివ్వెల మధుబాబు, శ్రీ గద్దె గోపాలరావు, శ్రీ వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు.