జనసేన మేనిఫెస్టోలో ఉచిత ఇసుక విధానం

ప్రతి అడుగులో ప్రజలను ఇబ్బంది పెడుతోంది
• జనసేన మేనిఫెస్టోలో ఉచిత ఇసుక విధానం… శ్రీ పవన్ కల్యాణ్ ఆలోచన ఇది
• ఇళ్ల నిర్మాణానికి, అభివృద్ధి పనులకు ఉచితం
• ముఖ్యమంత్రి పాలనలో స్పష్టత లేదు.. పరిపాలనా దక్షత లేదు
• ఎక్కడా అభివృద్ధి లేదు.. యువతకు ఉపాధి లేదు
• పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఏం సాధించారు?
• సొంత ఊరికి రోడ్డు వేయలేదు గానీ ఇంకో ఇల్లు కట్టుకున్నారు
• ఎన్నికల ముందు వచ్చిపోయే నాయకుల్ని పట్టించుకోవద్దు
• రేపటి రోజున జనసేన గెలవాలి.. శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి
• రాజోలు నియోజకవర్గ క్రియాశీలక సభ్యుల సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

పేదలు, ఇళ్లు నిర్మించుకునే వారికి ఉచిత ఇసుక అందచేసే విధానాన్ని జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెడతామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడడం కోసం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావాలన్నది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అని తెలిపారు. ఇళ్లు కట్టుకునేందుకు, అభివృద్ధి కార్యక్రమాలు కోసం జనసేన పార్టీ ఉచిత ఇసుక తీసుకువస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి పోతోందనీ, రెండున్నరేళ్ల పరిపాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే అది రోడ్లకు రెండున్నర అడుగుల లోతు గోతులు పెట్టడమేనన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పుకొంటూ పార్టీని వీడిన జనసేన ఎమ్మెల్యే సాధించిన అభివృద్ధి కూడా రెండున్నర అడుగుల గోతులే అన్నారు. మంగళవారం రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంది. ప్రజల తీర్పుకు సగం రోజులు పూర్తయ్యాయి. ప్రతి అడుగులో ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందిపెట్టి అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తోంది. ప్రజలకు ఏ మాత్రం అండగా లేని పరిపాలన ఇది. రహదారులు పూర్తిగా పాడయ్యాయి. జనసేన పార్టీ తరఫున ప్రజల ఇబ్బందులు తెలియచేసేందుకు రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. రాజోలు నియోజకవర్గంలో కూడా మహిళలు రోడ్ల మీద పడవలు ఉంచి క్యాంపెయిన్ నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సొంత ఊరి గురించి ఏం చెప్పాలి? అక్కడ ఎమ్మెల్యే గారు రోడ్లు వేయలేదుగానీ ఇంకో ఇల్లు అయితే కట్టుకున్నారు.

• ఇసుక కొరత సృష్టించి జేబు సంస్థలకు లాభం చేకూర్చారు

జనసేన పార్టీ శ్రమదానోద్యమంలో భాగంగా ఈ రోజు రాజోలు ప్రధాన రహదారికి స్థానిక జనసేన నాయకుల సహకారంతో మరమ్మతులు చేపట్టాం. రహదారులు
ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ రహదారుల వెంట రావడానికి ప్రజలు భయపడడంతో స్థానికంగా నిర్వహిస్తున్న వ్యాపారాలన్నీ పూర్తిగా దెబ్బతినిపోయాయి. భారీ
వాహనాలు ఆ రోడ్ల వెంట వెళ్తుంటే తిరగపడిపోతాయని వ్యాపారులు భయపడుతున్న దుస్థితి. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలన్న శ్రీ పవన్ కళ్యాణ్
గారి ఆదేశాల మేరకు ఇక్కడ శ్రమదానం నిర్వహించాం. రాష్ట్రంలో ఇసుక కొరత విపరీతంగా పెరిగిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5
సార్లు ఇసుక విధానాన్ని మార్చింది. ముఖ్యమంత్రి గారి పాలనలో స్పష్టత లేదు.. పరిపాలనా దక్షత లేదు. మంచి పరిపాలన అందిస్తారని నమ్మి శ్రీ జగన్ రెడ్డి గారికి
ప్రజలు బ్రహ్మరధం పట్టారు. 151 మందిని గెలిపించారు. వాళ్లు ఏం చేస్తున్నారు అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాలు, ఇసుక, వనరుల
దోపిడి పనిలో బిజీగా ఉన్నారు. ఇసుక లారీ రూ.70 వేలు పలుకుతుంటే సామాన్యుడు ఇళ్లు ఎక్కడి నుంచి కట్టుకోగలరు. వైసీపీ ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి,
తన జేబు సంస్థలకు ఉపయోగపడేలా, లాభం చేకూరేలా తీసుకున్న నిర్ణయమే అందుకు కారణం. రాష్ట్ర ప్రజలను అసలు ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది.

• చెంప పగిలేలా ప్రజలు సమాధానమిస్తున్నా బుద్ధి రావట్లేదు

ఆరు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఎక్కడా అభివృద్ధి లేదు. యువతకు ఉపాధి లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ఏమయ్యిందో తెలియదు. కరోనా పరిస్థితులు, వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే వన్ టైమ్ సెటిల్మెంట్లు అంటూ ప్రజలను వేదిస్తున్నారు. వాలంటీర్లను ఇంటింటికీ పంపి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లకు తక్షణం చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. పంచాయితీల డబ్బు తీసేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవాలి. పంచాయితీలకు దక్కాల్సిన 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు దారి మళ్లించేశారు. పంచాయితీల్లో సర్పంచులు ఎన్నికై ఆరు నెలలు దాటి పోయింది. ఇప్పటి వరకు ఒక్క చిన్న లైటు కూడా వేసుకోలేకపోతున్నారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే రూ. 230 కోట్లు నిధులు మళ్లించారు. ప్రజలు చెంప పగిలేలా సమాధానం చెబుతున్నా బుద్ది రావడం లేదు. రైతులు పంట నష్టపోతే వారి గోడు వినే నాధుడు లేడు. ఒక్క రూపాయి పరిహారం అందలేదు. అధికారులు కనీసం పంట నష్టం అంచనాలు కూడా రూపొందించిన పాపాన పోలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే.. అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సొంత డబ్బు ఖర్చు చేసి ఆయన్ని గెలిపిస్తే రాపాక వరప్రసాద్ గారు జనసైనికుల్ని వదిలి వెళ్లిపోవడం బాధించింది. ఎమ్మెల్యే వెళ్లిపోయినా పంచాయితీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో జనసైనికులు అద్భుతంగా కష్టపడి విజయం సాధించారు. ఎమ్మెల్యే గారికి ఒక్కటే చెబుతున్నాం. జనసైనికుల మీద కేసులు పెట్టించడం, కాంట్రాక్టర్లను బెదిరించడం మానుకోవాలి. జనసేన ఎంపీటీసీలు, సర్పంచుల్ని నిధులు రాకుండా వేధించడం మానుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధి కోసం వేరే పార్టీలోకి వెళ్తున్నానని చెప్పారు. ఈ రెండున్నరేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటో తెలియదుగానీ జనసేన పార్టీ నుంచి గెలిచినందుకు మిగిలిన రెండున్నరేళ్లలో నియోజకవర్గాన్ని కొంత వరకైనా అభివృద్ధి చేయండి. ఎన్నికల్లో విజయం సాధించేశాం కదా అని ఆ వాపు చూసుకుని బలుపు అనుకుంటే రాజోలు ఎమ్మెల్యేకి ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ శాసనసభ్యత్వంజనసైనికులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి జనసైనికులు ఇక్కడ గెలిపించుకున్న నాయకుడి అండలేకున్నా కష్టపడి విజయం సాధించారు. రాష్ట్రం మొత్తం రాజోలు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నిజాయతీగా అందరం కలసి కట్టుగా పని చేస్తే పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. జనసేన పార్టీ గురించి చాలా మంది ఉద్దేశపూర్వకంగా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా ముందుకు వచ్చిందే జనసేన పార్టీ. కొంత మంది సరదాగా ఎన్నికల ముందు వచ్చిపోతూ ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేపటి రోజున జనసేన పార్టీ గెలవాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి. జనసేన పార్టీ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు. 16 ఎంపీటీసీ స్థానాలు ఒక్క నియోజకవర్గంలో గెలవడం ఎంత గొప్ప విషయం. ఈ సభ మిమ్మల్ని గౌరవించడం కోసం ఏర్పాటు చేసిందే. అది జనసైనికుల కృషితో సాధ్యపడింది. టీమ్ స్పిరిట్ ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాం. యువకులకు గౌరవం ఇచ్చి పోటీ చేసే అవకాశం ఇచ్చి ముందుకు నెడితే పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేస్తే మీకు నాయకులు అండగా నిలబడతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అంతా పెద్దన్న పాత్ర పోషించాలి. రాబోయే ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్ధులు శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలి. అదే అంకితభావంతో పని చేయాలి” అన్నారు.

• రాజోలు మెయిన్ సెంటర్ లో శ్రమదానం

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక రహదారికి శ్రమదానం ద్వారా మరమ్మతు చేపడుతున్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. మంగళవారం ఉదయం దాదాపు రెండున్నర అడుగుల లోతు గోతులు పడిన రాజోలు ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టారు. స్థానిక ఎల్ఐసీ సమీపంలో రోడ్డు పూర్తిగా దెబ్బ తిన్న చోట పారపట్టి శ్రమదానం నిర్వహించారు. అనంతరం దాదాపు కిలోమీటరు దూరం అదే రహదారిపై పాదయాత్ర చేసి గోతులను పరిశీలించారు. రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపారులను పలుకరించి రోడ్డు దెబ్బతినడం కారణంగా వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు తాటిపాక వద్ద శ్రీ మనోహర్ గారికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా పూలమాలలు, హారతులతో ఆహ్వానం పలికారు. తాటిపాక సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికీ, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శివకోడు వద్ద ప్రఖ్యాత ముసలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. అనంతరం పార్టీ నుంచి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీటీసీ అభ్యర్ధులు, సర్పంచులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పంతం నానాజీ, పార్టీ కార్యక్రమాల విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నేతలు శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, శ్రీమతి పోలాసపల్లి సరోజ, శ్రీ చోడిశెట్టి చంద్రశేఖర్, శ్రీ వాసిరెడ్డి శివ, శ్రీ తాడి మోహన్, శ్రీ డీఎంఆర్ శేఖర్, శ్రీ గుండుబోగుల పెదకాపు, శ్రీ లింగోలు చిన్నబ్బులు, శ్రీ ఆకుల నాయుడు, శ్రీ పినిశెట్టి బుజ్జి, శ్రీ గెడ్డం మహాలక్ష్మీప్రసాద్, రాజోలు వైస్ ఎంపీపీ శ్రీ ఇంటిపల్లి ఆనందరాజు, శ్రీమతి మేడిచర్ల సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.