ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గణేశ్‌ ఉత్సవాలు

కరోనా నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధులతో తలసాని పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసింది.  ఈ సమావేశం లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా గణేశ్‌ ఉత్సవాలను ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్సవాలు నిర్వహించుకోవాలని, ప్రభుత్వానికి నిర్వాహకులు సహకరించాలని కోరారు. విగ్రహాల ఎత్తు విషయంలో ఆంక్షలు పెట్టాలని ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని, అందరి ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తోందని తెలిపారు. నిమజ్జనానికి ఎప్పటిలా కాకపోయినా చిన్న క్రేన్లను ఏర్పాటు చేయాలని కాగా, మండపాల వద్ద నలుగురైదుగురి కంటే ఎక్కువ ఉండకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వ స్థాయిలో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని, నాలుగు రోజుల్లో మరోసారి సమావేశమై ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకుందామని అన్నారు.