మూడు నెలల్లో రాష్ట్రానికి మంచిరోజులు

  • వైసీపీ దాష్టీకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?
  • వైసీపీ ఊసే లేని ఆంధ్రప్రదేశే లక్ష్యం
  • ప్రమాదంలో ప్రజాస్వామ్యం గోడప్రతుల ఆవిష్కరించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

గుంటూరు: ప్రజలిచ్చిన అధికారాన్ని అడుగడుగునా దుర్వినియోగం చేయటమే కాకుండా తన అసమర్ధ పాలనతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్రజలెవరూ అధైర్యపడవద్దని రానున్న మూడునెలల్లో రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి రూపొందించిన ప్రమాదంలో ప్రజాస్వామ్యం గోడప్రతులను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం ఒక నియంత చేతిలో చిక్కి అల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంభేడ్కర్ రాజ్యాంగం బదులు జగన్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛని రాష్ట్ర ప్రజలు కోల్పోయారన్నారు. నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంగా సాగుతున్న వైసీపీ దాష్టీకాలను ప్రశ్నిస్తే ఎంతటివారినైనా నిర్బంధిస్తున్నారని, అరెస్ట్ లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకి ఏదన్నా కష్టమొచ్చినా, ఎలాంటి ఆపద కలిగినా ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటారన్నారు. అలాంటిది కంటికి రెప్పలా కాపాడాల్సిన నేతలే సమస్యగా మారితే ప్రజలు ఇంకెవ్వరికీ చెప్పుకోవాలన్నారు. పంచభూతాలను దోచుకుంటున్న వైసీపీ నేతలు చివరికి ప్రజలు ప్రయాణించే రహదారులను సైతం కబ్జా చేస్తున్నారంటే పరిస్థితులు ఎంతటి ప్రమాద స్థాయికి చేరుకున్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. వైసీపీ దుర్మార్గాలను, అరాచకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. ప్రజలతో మమేకం అవుతూ మేమున్నాం అన్న భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలిచ్చిన గొప్ప పాలనా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోనున్నారన్నారు. వైసీపీ ఊసే లేని ఆంద్రప్రదేశే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ప్రజల ఆశీస్సులతో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావటం తధ్యమన్నారు. కార్యక్రమంలో గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజిని, పార్టీ నేతలు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, మిద్దె నాగరాజు, వడ్డె సుబ్బారావు, జడ సురేష్, శీలం మోహన్ తదితరులు పాల్గొన్నారు.