గ‌డ‌ప గ‌డ‌ప‌కూ….గడిబిడే!

* వైకాపా నేత‌ల‌కు స‌మ‌స్య‌ల స్వాగతం
* ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీస్తున్న జ‌నం
* ర‌సాభాస‌గా మారుతున్న ‘గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్రభుత్వం’
* ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి వెనుకాడుతున్న నేత‌లు
* జ‌నం ప్ర‌శ్న‌ల‌ను దాట‌వేస్తున్న వైనం
* చాలా చోట్ల ప్రారంభం కాని కార్య‌క్ర‌మం
* సొంత పార్టీలోనూ నిర‌స‌న గ‌ళం

“ఈ మూడేళ్లుగా ఏం ఊడ‌బొడిచారు?”
“తాగునీటి గురించి ప‌ట్టించుకోరా?”
“క‌రెంటు ఛార్జీలు ఇష్టం వ‌చ్చిన‌ట్టు పెంచేస్తే ఎలా?”
“రోడ్ల దుస్థితి మీకు ప‌ట్ట‌దా?”
“ధ‌ర‌లు ఇలా పెరిగిపోతే ఎలా?”
“అర్హులైన వారికి పింఛ‌న్లు ఇవ్వ‌రేం?”
“అస‌లైన పేద‌ల‌కు ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని తెలియ‌దా?”
“మ‌హిళ‌ల ప‌ట్ల దారుణాలు ఆప‌లేరా?”
– ఇవ‌న్నీ సామాన్యులు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు!
మ‌హిళ‌లు ఎక్కుబెడుతున్న‌స‌మ‌స్య‌ల‌ శ‌రాలు!
ఈ ప్ర‌శ్న‌ల‌కు, స‌మ‌స్య‌ల‌కు స‌రైన స‌మాధానాలు చెప్ప‌లేక, నిల‌దీస్తున్న‌ప్ర‌జ‌ల‌ను స‌మాధాన ప‌ర‌చ‌లేక అధికార వైకాపా నేత‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఏం చెప్పాలో, ఎలా న‌చ్చ‌చెప్పాలో తెలియ‌క బిత్త‌ర పోతున్నారు.
ఇదీ… ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ల‌పెట్టిన “గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం” కార్య‌క్ర‌మం జ‌రుగుతున్నతీరు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వ‌ర‌కు ఎక్క‌డ చూసినా జ‌రుగుతున్న ప్ర‌హ‌స‌నం.
*అధినేత ఆదేశాల‌తో అత‌లాకుత‌లం
“ప్ర‌తి ఎమ్మెల్యే, ప్ర‌తి మంత్రి అంద‌రూ ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుసుకోవాల‌సిందే. ఇందులో ఎవ‌రికీ మిన‌హాయింపులు లేవు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. ఈ కార్య‌క్ర‌మం అమ‌లు తీరును నేను స‌మీక్షిస్తాను…” అంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాజాగా జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశంలో కూడా స్ప‌ష్టం చేయ‌డంతో వైకాపా నేత‌ల‌కు ప‌చ్చి వెల‌క్కాయ గొంతులో ప‌డిన‌ట్టు అవుతోంది. ఎందుకంటే కొన్ని రోజులుగా ఇంటింటికీ వెళుతున్న నేత‌ల‌కు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఏక‌రవు పెడుతూ నిల‌దీస్తున్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రించడానికి నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ, జ‌నం మాత్రం తాము ఎదుర్కొంటున్న బాధ‌ల‌ను ఆవేశంతో, ఆవేద‌న‌తో చెప్ప‌డానికి ఇదొక అవ‌కాశంగా భావిస్తున్నారు. “గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం” పేరుతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం ప్ర‌కారం ప్ర‌తి నేత‌, నెల‌కు క‌నీసం ప‌ది గ్రామ స‌చివాల‌యాల ప‌రిధిలో ప‌ర్య‌టిస్తూ ఇంటింటికీ తిర‌గాలి. ఇలా ప్ర‌తి జిల్లాలో, ప్ర‌తి నియోజ‌కవ‌ర్గంలో దాదాపు అన్ని కాల‌నీల‌ను ప‌ర్య‌టించాల‌నేది ముఖ్య‌మంత్రి ఉద్యేశం కాగా, వాస్త‌వంలో వైకాపా నేత‌ల‌కు ఎదుర‌వుతున్న అనుభ‌వాలు భిన్నంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ త‌మ స‌మ‌స్య‌ల‌ను, బాధ‌ల‌ను, త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌ను ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క‌… స్థానిక నేత‌ల‌కు చెప్పుకున్నా ఫ‌లితం క‌నబ‌డ‌క విసిగి వేసారి పోయిన సామాన్య జ‌నం… ఇప్పుడు అధికార పార్టీకి చెందిన పెద్ద నాయ‌కులు ఇంటికి రాగానే త‌మ ఆక్రోశాన్ని మూకుమ్మ‌డిగా వెలిగ‌క్కుతున్న దాఖ‌లాలు దాదాపు అన్ని చోట్లా క‌నిపిస్తున్నాయి. ఇందువ‌ల్ల అనేక చోట్ల వైకాపా నేత‌ల‌కు చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. అటు అధినేత‌కు చెప్ప‌లేక‌, ఇటు సామాన్యుల్లో పెల్లుబుకుతున్న వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోలేక ఎమ్యెల్యేలు, మంత్రులు అత‌లాకుత‌లం అయిపోతున్నార‌న‌డానికి అడుగ‌డుగునా ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తున్నాయి.
*దాట‌వేస్తూ… జారుకుంటున్న నేత‌లు
కొన్ని రోజులుగా ఇంటింటికీ వెళుతున్న నేత‌లకు ఎదురవుతున్న అనుభ‌వాల‌ను గ‌మ‌నిస్తున్న చాలా మంది వైకాపా నాయ‌కులు అస‌లు ఈ కార్య‌క్ర‌మానికే దూరంగా ఉండ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌న‌డానికి కూడా నిద‌ర్శ‌నాలు ఉన్నాయి. ఇంత‌వర‌కు బ‌య‌ట‌కు రాని నేత‌లు చాలా మంది ఉన్నారు. కొంద‌రు త‌మ‌కు అనారోగ్యంగా ఉంద‌నో, కొంద‌రు వ‌ర్షాల‌నో, కొంద‌రు క‌ర‌ప‌త్రాలు ఇంకా రాలేద‌నో, మ‌రి కొంద‌రు స‌మ‌గ్ర స‌మాచారం లేద‌నో… ఇలా ఏదో వంక పెడుతున్నారు. మ‌రి కొంద‌రు నేత‌లైతే తాము స్వ‌యంగా కాకుండా త‌మ ముఖ్య అనుచ‌రుల‌ను పంపుతున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ విష‌యం తెలిసిన ముఖ్య‌మంత్రి మాత్రం నేత‌లే స్వ‌యంగా వెళ్లాల‌ని హుకుం జారీ చేస్తున్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌ల‌ను పట్టించుకోకుండా తాము చెప్ప‌ద‌లుచుకున్న‌దేదో జ‌నం విన్నా విన‌క‌పోయినా చెప్పేసి అక్క‌డి నుంచి చ‌క‌చ‌కా ముందుకు సాగిపోతున్న తీరు క‌నిపిస్తోంది. కొంద‌రైతే నిల‌దీస్తున్న మ‌హిళ‌ల‌తో వాదించ‌లేక జారుకుంటున్నారు కూడా. లేదా అక్క‌డే ఉన్న వైకాపా స్థానిక నేత‌ల‌కు ఈ స‌మ‌స్య‌ల గురించి ఏవేవో ఆదేశాలిస్తూ వెళ్లిపోతున్నారు. మ‌రికొన్నిచోట్ల నేత‌లు ఓపిక‌గా ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ… ప్ర‌జ‌లు వినిపించుకోవ‌డం లేదు. పైగా ప‌థ‌కాల క‌న్నా ముఖ్యంగా త‌మ‌కు తాగునీరు కావాల‌ని, రోడ్లు బాగు చేయాల‌ని డిమాండు చేస్తున్నారు. మ‌రి కొన్ని చోట్ల నేత‌లు ఏ ప‌థ‌కం గురించి చెప్ప‌బోయినా, స్థానిక జ‌నం ఆయా ప‌థ‌కాలు అర్హుల‌కు అంద‌లేద‌నో, అస‌లైన పేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌నో చెబుతూ ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇలా ప‌థ‌కాల ద్యారా జ‌రుగుతున్న ల‌బ్ది గురించి నేత‌లు చెప్ప‌బోతుంటే… సామాన్య జ‌నం ఆయా ప‌థ‌కాల్లో ఉన్న లొసుగుల గురించి బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నారు. చాలా చోట్ల మ‌హిళ‌లు నేత‌లను పెరిగిపోతున్న ధ‌ర‌ల గురించి, క‌రెంటు ఛార్జీల గురించి, ప‌న్నుల గురించి ప్ర‌స్తావిస్తూ వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. దాంతో వైకాపా నేత‌లు ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌లు విన‌కుండానే, వారు ప్ర‌స్తావించిన స‌మ‌స్య‌ల‌కు అప్ప‌టిక‌ప్పుడు స‌మాధానం చెప్ప‌కుండానే ఆయా ప్ర‌దేశాల నుంచి జారుకుంటున్నారు. కొంద‌రు నేత‌లైతే త‌మ‌ను ప్ర‌శ్నించిన వారిని ప్ర‌తిప‌క్షానికి చెందిన వారిగా ముద్ర వేసి వెళ్లిపోతున్నారు. లేదా… ‘గ‌తంలో ఇలా జ‌ర‌గ‌లేదా, ఎవ‌రున్నా ఇలాగే జ‌రుగుతుందం’టూ ఏదో ఒక స‌మాధానం చెబుతూ అడుగుతున్న జ‌నాన్ని ఖాత‌రు చేయ‌కుండా ముందుకు సాగిపోతున్నారు. తొలి రెండు మూడు రోజులు ఈ వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన కొంద‌రు నేత‌లైతే వైకాపా పార్టీకి ప‌ట్టున్న ప్రాంతాల్లోనే ఇకపై ప‌ర్య‌టించాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రైతే తాము వెళ్ల‌నున్న ప్రాంతానికి చెందిన స్థానిక వైకాపా ప్ర‌తినిధుల‌ను ముందుగానే అప్ర‌మ‌త్తం చేస్తూ ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న రాకుండా చూసుకోవాల‌ని చెబుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో నేత‌లు వ‌చ్చినప్పుడు జ‌నం ప్ర‌శ్న‌లు అడ‌గ‌కుండా స్థానిక ప్ర‌తినిధులు అడ్డం ప‌డ‌డం, వారితో జ‌నం వాగ్వివాదానికి దిగ‌డం చాలా చోట్ల క‌నిపిస్తోంది. అనేక చోట్ల సామాన్యులు త‌మ‌కు అందుబాటులో ఉన్న స్థానిక నాయ‌కుల మీద‌నే ఎమ్మెల్యేలు,మంత్రుల‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తం మీద గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌ను, వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నార‌నేది మాత్రం అనేక వార్త‌లు, వీడియోలు, సామాజిక మాధ్య‌మాల స‌మాచారం సాక్షిగా నిజం.
*ఇవిగివిగో సాక్ష్యాలు…
* ఆలూరు నియోజ‌క వ‌ర్గంలోని హ‌త్తిబెళ‌గ‌ల్‌లో మంత్రి గుమ్మునూరు జ‌య‌రాం ప‌ర్య‌ట‌న‌లో వారానికోసారి నీరిస్తే ఎలాగంటూ జ‌నం నిల‌దీశారు. బోర్ల‌కు రిపేర్లు లేవ‌ని, ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. మంత్రి వారికి స‌మాధానం చెప్ప‌కుండానే… ‘పింఛ‌న్ చేయూత భ‌రోసా వ‌స్తున్నాయా’ అంటూ ముందుకు సాగిపోయారు.
* మంత్రి రోజాకు చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం టీసీ అగ్ర‌హారం, క‌ల్లూరు గ్రామ స‌చివాల‌యాల ప‌రిధిలో ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర ఎదురైంది. దాంతో ఏం చెప్ప‌లేక ఆమె కొద్ది సేపు మౌనం వ‌హించారు. అమ్మ ఒడి ఇచ్చి అన్ని ఛార్జీలు పెంచేస్తే ఎలా అని నిల‌దీశారు. ఇదంతా ప్ర‌తిప‌క్ష నేత‌ల అనుచ‌రులు చేయిస్తున్నారంటూ వ్యాఖ్య‌లు చేస్తూ ప్ర‌శ్న‌ల‌ను దాట‌వేసి ముందుకు సాగిపోయారు.
* ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి బేతంచెర్ల ప‌రిధిలోని హెచ్‌.కొట్టాల‌లో రెండు ఇళ్ల‌ను సంద‌ర్శించి వెనుదిరిగారు. మంత్రి వ‌స్తున్న‌ట్లు తెలిసి మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చి త‌మ స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టారు.
* ఆదోని ఎమ్మెల్యే సాయి ప్ర‌సాద్ రెడ్డికి చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో వీర‌మ్మ అనే ఓ మ‌హిళ “మాకెవ‌రూ సాయం చేయ‌డంలేదు. ఇప్పుడెందుకు వ‌స్తున్నారు? అవ‌స‌రం లేదు” అని దండం పెట్టి ఇంట్లోకి వెళ్లిపోయారు.
* మంత్రాలయం ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడు ప్ర‌దీప్‌రెడ్డిని పెద్ద‌క‌డుబూరులోని తారాపురం పంప‌గా, త‌మ‌కు జ‌గ‌న‌న్న కాల‌నీలో ఇళ్ల పట్టాలు ఇవ్వ‌లేదంటూ ఎస్సీ కాల‌నీలోని కొంద‌రు నిల‌దీశారు.
* ప‌త్తి కొండలోని మ‌ద్దికెర‌లో ఎమ్మెల్యే శ్రీదేవికి రేషన్ బియ్యం స‌ర‌ఫ‌రాలో అవ‌క‌త‌వ‌క‌ల గురించి జ‌నం నిర‌స‌న తెలిపారు. రోడ్ల అధ్వాన స్థితిని స్వ‌యంగా చూడాలంటూ నిల‌దీశారు.
* శ్రీ స‌త్య‌సాయి జిల్లా హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, ఎమ్మెల్సీ ఇక్బాల్ న‌ర్య‌ట‌న‌లో బీసీ కాల‌నీలో జ‌నం గుమిగూడి స‌మ‌స్య‌లు చెప్ప‌బోగా వాళ్లు ప‌ట్టించుకోకుండానే ముందుకు సాగిపోయారు.
* చిత్తూరు జిల్లా పుంగ‌నూరు మండలం బోడేవారిప‌ల్లెలో విద్యుత్తు, అట‌వీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌ర్య‌ట‌న‌లో ప‌థ‌కాలు అంద‌ని జ‌నం ముందుకు రాబోగా స్థానిక నేత‌లు అడ్డుకోవ‌ల‌సి వ‌చ్చింది.
* కోడుమూరు నియోజ‌కవ‌ర్గం దేవ‌మ‌డ‌లో ఎమ్మెల్యే సుధాక‌ర్‌ని స్థానిక మ‌హిళ‌లు “మీరు గెలిచి మూడేళ్ల‌యింది. మా గ్రామానికి ఏం చేశారు? రోడ్లు, మురుగు కాల్వ‌లు అధ్యానంగా ఉన్నాయి” అంటూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.
* అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని అర్జాపురంలో ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీని నిత్యావ‌ర‌స‌రాల ధ‌ర‌లు, క‌రెంటు ఛార్జీలు పెర‌గ‌డంపై మ‌హిళ‌లు నిల‌దీశారు. వాళ్లు ప్ర‌తి ప‌క్షం పార్టీ వాళ్లు లెండి అంటూ ఉప స‌ర్పంచి చెప్ప‌డంతో ఆయ‌న ముందుకు సాగిపోయారు.
* మాజీ మంత్రి అనిల్ కుమార్ ప‌ర్య‌ట‌న‌లో మూడేళ్ల‌లో ఏం చేశారో చెప్పండంటూ ప్ర‌జ‌లు గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డంతో ఆయ‌న మ‌ధ్య‌లోనే వెనుదిరిగారు.
* ఎమ్మెల్యేలు సిద్ధారెడ్డి, సంజీవ‌య్య‌, మ‌ధుసూద‌న్‌, కోనేటి ఆదిమూలం, ఎంపీ మాగుంట శ్రీనివాస‌రెడ్డి, ఛీప్ విప్ ముదునూరి ప్రసాద రాజు… ఇలా అనేక మంది వైకాపా నేత‌ల‌కు జ‌నం నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌, నిర‌స‌న ఎదుర‌య్యాయి.
*సొంత పార్టీలోనూ స‌ణుగుళ్లు
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సొంత నిర్ణ‌యాలు తీసుకుంటూ, మంత్రుల‌కు కూడా నిర్ణ‌యాధికారాలు లేకుండా చేస్తూ, వివాదాస్ప‌ద చ‌ర్య‌ల‌తో జ‌నంలో వ్య‌తిరేక‌త పెంచి… ఇప్పుడు త‌మ‌ను ప్ర‌జ‌ల్లోకి వెళ్లమంటే ఎలా అని సొంత పార్టీ నేత‌లు అనధికారికంగా వ్యాఖ్యానిస్తున్న‌ట్టు తెలుస్తోంది. బొబ్బిలి వైసీపీ కౌన్సిల‌ర్ రామారావు నాయుడు బ‌హిరంగంగానే ఈ కార్య‌క్రమం ప‌ట్ల నిర‌స‌న తెలిపారు. “ఇంత‌కాలం ఏమీ చేయ‌కుండా ఉంటే ఎలా? త‌మ బాధ ఎవ‌రితో చెప్పుకోవాలి?” అంటూ ఆయ‌న వ్యాఖ్యానాలు చేశారు. అసెంబ్లీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను ఇంత‌వ‌ర‌కు నెర‌వేర్చ‌లేద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఎలా వెళ్ల‌గ‌ల‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలా పైకి అన‌క‌పోయినా చాలా మంది నేత‌లు త‌మ ఆంత‌రంగికులతో ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తున్నార‌నే విష‌యాలు బ‌య‌ట‌కు పొక్కుతున్నాయి. మొత్తం మీద “గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం” కార్య‌క్ర‌మంలో “గ‌డ‌ప గ‌డ‌ప‌కి నిర‌స‌న‌లు” ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లూ ప్ర‌జ‌ల్లో గూడుక‌ట్టుకున్న అసంతృప్తి, వ్య‌తిరేక‌త ఇప్పుడు అగ్నిప‌ర్వ‌తం నుంచి లావా పెల్లుబికిన‌ట్లు బ‌య‌ట ప‌డుతోంద‌నే అంశం, ఈ కార్య‌క్ర‌మాన్ని నిశితంగా గ‌మ‌నిస్తున్న ప‌రిశీల‌కుల‌కే కాదు, సామాన్యులకు కూడా అర్థం అవుతోంది. ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ‌డానికి కార‌ణం ఏమిట‌నే ప్ర‌శ్న‌కు మాత్రం ఒక‌టే స‌మాధానం. అది స్వ‌యంకృతాప‌రాధం!