జన సైనికులను బెదిరింపులకు గురి చేస్తే ధీటుగా సమాధానం చెప్తాం

* జనసేనపై అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తే సహించేది లేదు
* ఉత్తరాంధ్రలో పార్టీకి గట్టి పునాదులుగా ఏర్పడ్డ జనసైనికులను కదిలించడం ఎవరి తరం కాదు
* విశాఖపట్నం మీడియాతో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు

వై.సీ.పీ. ప్రభుత్వం అధికార మదంతో జనసేన గురించి అసత్యపు ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్న విధానాన్ని సహించేది లేదని, కార్యకర్తలపై తప్పుడు కేసులు, బెదిరింపులకు పాల్పడుతున్న సందర్భాలు అనేకం తమ దృష్టికి వస్తున్నాయని, పదవులను అడ్డం పెట్టుకొని బరి తెగించి ప్రవర్తిస్తున్న వారికి తగిన రీతిలో గట్టిగా సమాధానం చెప్తామని జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేసారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖపట్నం జిల్లా మీడియా ప్రతినిధులతో నాగబాబు గారు మాట్లాడారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీకి బలమైన పునాదులుగా ఏర్పడ్డ జన సైనికులను కదిలించడం ఎవరి తరం కాదని, వారంతా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి భావజలానికి కట్టుబడి పని చేస్తున్నారని, జన సైనికులను ఆయనకు దూరం చెయ్యలేరని పేర్కొన్నారు. మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో కార్యకర్తలు చాలా సమస్యలు తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. జనసేన న్యాయ విభాగం నుంచి జన సైనికులకు సహాయం అందజేస్తామని అన్నారు. విశాఖపట్నం జిల్లా పరిధిలోని విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం ఈస్ట్, గాజువాక, పెందుర్తి, విశాఖపట్నం వెస్ట్, భీమిలి, అనకాపల్లి, మాడుగుల, పాయకరావుపేట, చోడవరం, ఎలమంచిలి, పాడేరు, అరకు, నర్సీపట్నం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, వీర మహిళలతో మాట్లాడడం జరిగిందని, వారంతా పార్టీ అభివృద్ధి కోసం కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు.

జనసేనలో చేరికలు

జనసేన పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో చేరికలు ఊపందుకున్నాయి. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం అభ్యర్థి శ్రీ పంచకర్ల సందీప్ ఆధ్వర్యంలో నాయకులను నాగబాబు గారు పార్టీ కండువాలతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు.