వెంకయ్య నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు: జనసేనాని

గౌరవనీయ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విలక్షణమైన వ్యక్తిత్వంతో కూడిన మానవతావాది శ్రీ వెంకయ్య నాయుడు గారు. విద్యార్జన దశలోనే నాయకత్వపు పటిమను ప్రోది చేసుకున్న ఆయన అంచెలంచలుగా రాజకీయ ఆరోహణం గావించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. రాజకీయ పదవులు చేపట్టినా.. రాజ్యాంగ పదవులు చేపట్టినా ఆ పదవుల గౌరవాన్ని ఇనుమడింప చేశారు. ముఖ్యంగా ఆయన ప్రసంగాలు వాడిగా వేడిగా కాస్తంత చమత్కారాలతో ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ఆయన గళం ఎంత గొప్పదో ఆయన కలం కూడా అంతే బలమైనది. ఆయన రాసే వ్యాసాలు విజ్ఞానాన్ని, విలక్షతను పెంపొందింప చేస్తాయి. రాజ్యసభ చైర్మన్ గా సభను నడుపుతున్నప్పుడు ఆయన చూపే నేర్పు, ఓర్పు రాబోయే తరం నాయకులకు ఆదర్శనీయం. నాయుడు గారి నడవడిలో తెలుగుదనం, ఆయన మాటలలో చురుకుదనం, లాలిత్యం ముఖ్యంగా అమ్మ భాషైన తెలుగుపై అవాజ్యమైన అనురాగం నన్నెంతో ఆకట్టుకుంటుంది. పదహారణాల ఈ తెలుగు బిడ్డ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆనందకరమైన సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.