తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు

కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి ప్రాంతీయ, భాష, కుల, మత బేధాలు ఉండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కి నిండు హృదయంతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు జరిగే బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో బిల్ గేట్స్ తో కీలకమైన వర్చువల్ మీట్ కు సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నా సమయం వెసులుబాటు చేసుకొని భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. ప్రస్తుత హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని పక్షాలవారు ఆత్మీయంగా ఉండటాన్ని చూస్తాం. అటువంటి ఆత్మీయత కె.టి.ఆర్ లో ప్రస్పుటంగా కనిపిస్తుంది. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రంగం అభివృద్ధికి ఆలోచనలను కె.టి.ఆర్ చిత్తశుద్ధితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.