రైతులకు రూ.35 వేల పరిహారం అందకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం

భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రూ.35 వేల చొప్పున పరిహారాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ కల్యాణ్  డిమాండ్ చేశారు. సీఎం సాబ్‌కు వకీల్‌ సాబ్‌ చెప్పాడని చెప్పండి. నివర్‌ తుపానుతో నష్టపోయిన ఒక్కో రైతుకు రూ.10వేలు వెంటనే విడుదల చేయాలి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు మేం అడిగినట్లుగా రైతులకు రూ.35వేలు విడుదల చేయాలి. అలా చేయని పక్షంలో మా కార్యకర్తలతో అసెంబ్లీని ముట్టడిస్తాం. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతామో మేమూ చూస్తాం. అమరావతి, విశాఖ, పులివెందుల.. ఎక్కడ సమావేశాలు నిర్వహించినా వస్తాం. అసెంబ్లీ ముట్టడిస్తే ఏదైనా జరగొచ్చు. దానికి మేం బాధ్యులం కాదు  అని పవన్‌ హెచ్చరించారు.

సినిమాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారన్న పవన్. వైసీపీ నాయకులు చేస్తున్నదేంటి?దేశ సేవా? వాళ్లంతా గాంధీ మహాత్ములా? వైసీపీ నేతలు బిజినెస్ లు చేసుకోవచ్చు.. మేం సినిమాలు చేయకూడదా అని ప్రశ్నించారు. మీరు అన్ని వ్యాపారాలు వదిలేసి వస్తే నేనూ సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తా అని అన్నారు పవన్ కల్యాణ్.