ఎవరి ఒత్తిడితో పోలీసులు పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకున్నారో చెప్పాలి

* ఓర్వలేనితనంతో వైసీపీ సర్కారు ర్యాలీ ఆపించింది
* విశాఖ గర్జన వైఫల్యంతో అక్కసు వెళ్లగక్కారు
* పోలీసులు విచిత్రంగా ప్రవర్తించారు
* పవన్ కళ్యాణ్ ప్రజలకు కనబడడానికి వీల్లేదన్నారు
* ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి
* పోలీసుల తీరుని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం
* మీడియాతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

వైసీపీ తలపెట్టిన విశాఖ గర్జన విఫలమయ్యిందన్న అక్కసుతోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ర్యాలీని ప్రభుత్వం పోలీసుల సాయంతో బలవంతంగా ఆపేసిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కు ఉందని.., పోలీసుల తీరుని జనసేన పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తోందన్నారు. ఎవరి ఒత్తిడితో పోలీసులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనను అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతులు ఇవ్వడానికి ప్రజలు రోడ్డు మీద నిల్చుంటే ఆయన్ని కనబడనీయకుండా బలవంతంగా కారులో కూర్చోవాలని హుకుం జారీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం విశాఖలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర నిలిచిపోయింది. అనంతరం నోవాటెల్ హోటల్ లో పార్టీ నాయకులతో కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ గారు మాట్లాడుతూ..
• పవన్ కళ్యాణ్ పర్యటనకు వారం క్రితమే భద్రత అడిగాం
రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు ఊహించని సంఘటన జరిగింది. విశాఖ ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని రోడ్డు మీదకు వచ్చి స్వాగతం పలుకుతుంటే ఒక పోలీసు అధికారి కారెక్కి మీరు ప్రజలకు కనబడ కూడదు. వాహనంలో కూర్చోవాలి అని బలవంతంగా ఆయన్ని ప్రజలతో కలవనీయకుండా చేయడం ఎంతో దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో నిజంగానే ఇలా జరుగుతుందా? ఇది వాస్తవమా? అనిపించింది. సదరు పోలీసు అధికారి మీద ప్రభుత్వ పెద్దలు ప్రతి నిమిషం ఫోన్లు చేసి ఒత్తిళ్లు తెచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు బయటకు తీసుకువచ్చారు అనే అంశం మీద బలవంతం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో వాగ్వాదానికి దిగేలా చేశారు. ప్రజలని మేము కంట్రోల్ చేయాలని చెబుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఎవరి సమస్య. మీరు ఎందుకు భద్రత ఇవ్వలేకపోయారు. వారం రోజుల క్రితమే పోలీసు అధికారులకు ఉత్తరం రాసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు భద్రత అడిగాం. డీజీపీ గారికి స్వయంగా నేను లెటర్ పెట్టాను. విమానాశ్రయంలో ఒక రోప్ పార్టీ ఇచ్చి ఎన్ఏడీ జంక్షన్ దాటే వరకు ఒక్క పోలీసు అధికారి లేరు. ఎవరూ మాతో పాటు వచ్చి ప్రజల్ని నియంత్రించడం గాని, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రయత్నం గాని చేయలేదు. ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు ఇబ్బంది పడతారని ఒక అధికారి చెబితే ఒకే ఒక్క నిమిషంలో నేరుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్లి కారు ఎక్కేశారు. తనతో ప్రయాణించిన ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న మంచి మనసుతో కారు ఎక్కేశారు.
•పోలీసు నియంత్రణ లేకే ఇబ్బందులు తలెత్తాయి
మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతులు పట్టేందుకు రోడ్డు మీదకు వచ్చి నిలబడితే కనీసం వారికి కనబడనీయకుండా బలవంతంగా కారులో కూర్చోబెట్టారు. పోలీసులను రిక్వెస్ట్ చేసినా వాళ్లు విచిత్రంగా ప్రవర్తించారు. ఒక నాయకుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు ఆయన్ని స్వాగతించడానికి రోడ్డు మీద నిలబడితే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు. కార్యక్రమానికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత గాని, ట్రాఫిక్ నియంత్రణ గాని చేపట్టకపోవడం వల్లే ఇన్ని సమస్యలు తలెత్తాయి. ఎంతో ఇబ్బంది ఉన్నా ఉదయం నుంచి నిలబడిన పోలీసులకు తప్పకుండా కృతజ్నతలు చెప్పాలి. కానీ ఇలాంటి చర్యలు సరికాదు అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్, పర్చూరి భాస్కరరావు, సందీప్ పంచకర్ల తదితరులు పాల్గొన్నారు.