గడప గడపకు రాజకీయమే….!

  • ప్రభుత్వ కార్యక్రమమా…? లేక పార్టీ కార్యక్రమమా…?
  • పార్టీ జెండాలు, కండువాలు ధరించి అధికారులతో కలిసి గడప గడపకు తిరగడం సిగ్గుచేటు
  • ఒంగోలు జనసేన నగర అధ్యక్షులు, 38వ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్

ఒంగోలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమా….? లేక పార్టీ కార్యక్రమమా…? అని జనసేన ఒంగోలు నగర అధ్యక్షులు, 38వ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్ ప్రశ్నించారు. ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై విరుచుపడ్డారు. గడప గపడకు వైసీపీ నేతలు నవ్వులు పాలౌతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తమ డివిజన్ 38లో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుతో కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ యంత్రాంగం పర్యటిస్తుంది. వారితో పార్టీ నేతలు కూడా పార్టీ జెండాలను ధరించి గడప గడపకు వెళ్లడం తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడ చూసినా ప్రజల చేతిలో ప్రజాప్రతినిధులు భంగపాటుకు గురౌతున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో వైసిపీ పార్టీ నేతలకు పనేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులను వెంట పెట్టుకొని మేళతాళాలతో గ్రామాల్లో, కాలనీల్లో పర్యటిస్తూ వారి అంగ బలాన్ని ప్రదర్శించుకోవడమే తప్ప, ప్రజలకు ఉపయోగపడేలా గడప గపడకు మన ప్రభుత్వం సాగడం లేదన్నారు. పార్టీ జెండాలు, కండువాలు ధరించి ప్రభుత్వ అధికారులతో కలిసి గడప గడపకు తిరగడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి, పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చి నిర్వహించడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మలగా రమేష్ హెచ్చరించారు.