జగన్ రెడ్డి… పాలన చేతగాని వ్యక్తి

• రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. ముఖ్యమంత్రి గాఢ నిద్రలో ఉన్నారు
• నాడు వ్యవసాయ మంత్రి ఆత్మహత్యలే లేవన్నారు
• నేడు శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటన అనగానే ప్రలోభాలకు ప్రయత్నిస్తున్నారు
• వైసీపీ ప్రభుత్వం చేసిన చట్ట ప్రకారం రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలి
• తూతూ మంత్రంగా రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు
• కౌలు రైతుల కుటుంబాల్లో భరోసా నింపేందుకే జనసేన యాత్ర
• ఈ నెల 23న పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటన
• తెనాలిలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ఈ నెల 23వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలి విడతగా ఆ జిల్లాలో బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల్లో 40 మంది కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందిస్తారన్నారు. త్వరలో గుంటూరు జిల్లాలో కూడా కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంత మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవయ్యిందన్నారు. ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకుంటే జనసేన పార్టీ ఇస్తుందన్నారు. గురువారం ఉదయం తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రవ్యాప్తంగా ఏళ్ల తరబడి కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని వారిలో భరోసా నింపేందుకు జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడుతోంది. ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలు తప్ప రైతుని ఆదుకునే నాధుడు ఈ ప్రభుత్వంలో లేడు. ఎన్నికల ముందు పాదయాత్రలు చేసి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం కానివ్వమని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జీవో 102, 43ల ద్వారా కౌలు రైతులకు భరోసా కల్పించేస్తున్నట్టు ప్రకటనలు చేశారు. మొదట త్రిసభ్య కమిటీ పర్యటించి వివరాలు సేకరించాలి. ఆ కుటుంబానికి తక్షణం రూ.7 లక్షల ఆర్ధిక సాయం అందించాలి. అప్పులు ఇఛ్చిన వ్యక్తుల్ని పిలిపించి వన్ టైమ్ సెటిల్మెంట్ చేయాలి. చివరిగా ఆ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాస్తవంలో అవేవీ జరగటం లేదు. ఈ ప్రభుత్వ విధానాల కారణంగా ప్రతి జిల్లాలో రైతులు అవస్థలు పడుతున్నారు. రూ.6 వేల కోట్లు ప్రజాధనం వృధా చేసి రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. భరోసా కేంద్రాల్లో రైతులకు భరోసా దొరకడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు లేదు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం లేదు. రైతు భరోసా కేంద్రాలు దళారీలకు కేంద్రాలుగా మారాయి.
• పంట నష్టం అడిగితే కులం అడుగుతున్నారు
రైతులు పంట నష్టం కోసం ఎదురు చూస్తుంటే కులం అడుగుతున్నారు. ఓసీలకు రైతు భరోసా వర్తించదని చెబుతున్నారు. సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తుంటే ఓసీ రైతులకు వర్తించదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో కౌలు రైతుల సమస్యల మీద లోతుగా జనసేన పార్టీ అధ్యయనం చేసింది. శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరంలో 1019 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రెండో ఏడాది 889 మంది ఉసురు తీసుకున్నారు. ఈ సంవత్సరం లెక్కలను ప్రభుత్వం దాచిపెట్టింది. అయినా సమాచార హక్కు ద్వారా సేకరించారు. ఆ లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో 370 మంది, అనంతపురంలో 170 మంది, అన్నపూర్ణ లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో 87 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
• మానవతా దృక్పథంతో పవన్ కళ్యాణ్ స్పందించారు
గుంటూరు జిల్లాలో గత ఆరు రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పెదరావూరుకి చెందిన ఓ రైతు కుటుంబం నిన్న కలిసింది. ఆ రైతు 2020లో ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు వరకు ఒక్కరు కూడా స్పందించలేదు. ప్రభుత్వం నుంచి పలుకరించిన దిక్కు లేదు. చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో అతను ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్పష్టంగా నమోదైంది. ఆ రైతు నాలుగు ఎకరాలు కౌలు చేసి ఆర్ధికంగా నష్టపోయాడు. అంతేకాదు ఆత్మహత్యకు పాల్పడిన రైతుల్లో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు వారే. వారికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం నుంచి కనీసం స్పందించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించే ఉద్దేశ్యంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా రూ. 5 కోట్లు అందించారు. ప్రతి రైతు కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పారు.
• గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నలుగురు ఆత్మహత్య
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో చూస్తే వారం రోజుల వ్యవధిలో నలుగురు కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళగిరి, రెంటచింతల, బాపట్ల, గురజాలల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరం. అందులో ఓ రైతు రెవన్యూ శాఖ ఇబ్బంది పెడుతోందని ప్రాణాలు తీసుకున్నాడు. ఇంత జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. జగన్ రెడ్డి పాలన చేతగాని వ్యక్తిగా మిగిలిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికీ 70 శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. అలాంటి బలమైన వర్గాన్ని, రైతాంగాన్ని నష్టపరిచే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కుటుంబాలను తలచుకుని రైతులు అధైర్యపడుతున్నారు. దయచేసి ఎవ్వరూ అధైర్యపడవద్దు. మీలో భరోసా నింపేందుకే జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర. జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికే రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం రూ. 7 లక్షల పరిహారం ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం కౌలు రైతుల విషయంలో విచిత్రంగా స్పందిస్తోంది. ఆత్మహత్యకు పాల్పడి రెండు, మూడేళ్లు గడచినా నిద్రపోతోంది. కనీసం సమాచారం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.
• మీ పాలన సరిగాలేకే మేము బాధ్యత తీసుకున్నాం
గత నవంబర్ నెలలో నాటి వ్యవసాయ మంత్రి ఏకంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలే లేవని బుకాయించారు. ఇప్పుడు చూస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనగానే తక్షణ సాయం అంటూ రూ.లక్ష అకౌంట్లలో వేస్తున్నారు. మీలో నిజాయతీ, నిబద్దత ఉంటే మీరు ఇస్తామన్న రూ.7 లక్షల పరిహారం ఇవ్వండి. ఎందుకు రూ.లక్ష వేసి చేతులు దులుపుకొంటున్నారు. రెండు రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనగానే స్థానిక అధికార యంత్రాంగం రైతుల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారు. వైఎస్సార్ బీమా పథకం కింద రూ. 2 లక్షలు ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల లెక్కలు మీ దగ్గర లేకపోతే జిల్లాలవారీగా లెక్కలు తీస్తాం. ప్రభుత్వానికి మేము ఆ లెక్క ఇస్తాం. ప్రతి కుటుంబాన్ని ఆదుకోండి. తూతూ మంత్రంగా రాత్రికి రాత్రి రూ. లక్ష వేసి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు వెళ్లొద్దంటూ ప్రలోభాలు పెట్టడం అన్యాయం. మీరు పరిపాలన సరిగా చేయలేకపోతున్నారు కాబట్టే మేము బాధ్యత తీసుకున్నాం.
• మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు
ఈ రాష్ట్రంలో సమస్యల సృష్టికర్త శ్రీ జగన్ రెడ్డి. తెనాలిలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 2 గంటల వరకు కరెంటు తీసేశారు. ఈ పాలకులకి అదేం ఆనందమో అర్ధం కావడం లేదు. ప్రజలు సబ్ స్టేషన్ వరకు వెళ్లి ఆందోళన చేపడుతున్న పరిస్థితి. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని ఈ దుస్థితికి దిగజార్చారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేతకాని వ్యక్తి. ఒకరిని సంప్రదించలేని వ్యక్తి. ఆలోచనా విధానం లేని పరిపాలన సాగిస్తున్నారు. నిజంగా ప్రజా సంక్షేమం కోరే వారే అయితే రాష్ట్రంలో పాలన ఈ విధంగా ఉంటుందా? మంత్రి పదవులు, పార్టీ పదవుల కోసం అడ్డంగా జిల్లాలు విభజించారు. తెనాలి నియోజకవర్గంలో నాయకులు చూస్తే ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకోవడం మినహా చేస్తుంది లేదు. జిల్లాల విభజనతో అధికారులు వచ్చేస్తారు అద్భుతం జరుగుతుంది అని చెబుతున్నారు. రాష్ట్రంలో సామాన్యుడికి పరిపాలన చేరని దుస్థితి నెలకొంది. కరెంటు కోతలతో వ్యవసాయ రంగానికి అపార నష్టం కలిగించార”న్నారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు నయూబ్ కమాల్, బేతపూడి విజయ్ శేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు మహ్మద్ ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
• మార్కండేయబాబు కుటుంబానికి పరామర్శ
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణామ్ మార్కండేయ బాబు తండ్రి నాగేశ్వర రావు బుధవారం కన్నుమూశారు. తెనాలి పర్యటనలో ఉన్న నాదెండ్ల మనోహర్ గురువారం ఉదయం పొన్నూరు వెళ్ళి మార్కండేయబాబుని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఉపాధ్యాయుడిగా, గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా నాగేశ్వరరావు అందించిన సేవలను ఈ సందర్భంగా మనోహర్ కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.