జగనన్న పాలన రాష్ట్రంలో ఎవరికి సురక్షితం?

• స్పందనలో స్పందన కరవయ్యింది
• జగనన్నకు చెబుదామన్నారు.. చెబితే వినేవారు లేరు
• ఇప్పుడు జగనన్న సురక్ష అంటున్నారు
• వాలంటీర్ వ్యవస్థ ఎందుకు? సచివాలయాలు, ఆర్బీకేలు ఎందుకు?
• మీ పాలన అద్భుతంగా ఉంటే ఇన్ని లక్షల అర్జీలు ఎందుకొస్తాయి
• అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందడం లేదని ప్రభుత్వమే ఒప్పుకొంటోంది
• రసీదు ఇస్తే పని పూర్తయినట్టేనా?
• ఒక్క రోజులో 3 లక్షలపైగా సమస్యల పరిష్కారం ఎలా సాధ్యం?
• జగనన్న సురక్షపై శ్వేతపత్రం విడుదల చేయాలి
• వారాహి విజయ యాత్ర రాష్ట్ర చరిత్రలో అద్భుత ఘట్టం
• త్వరలో మలివిడత వారాహి యాత్ర షెడ్యూల్
• మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రంలో ఏ వర్గం సురక్షితంగా ఉందో చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. స్పందనలో స్పందన లేకుండా పోయింది.. జగనన్నకు చెబుదామన్నారు అదీ అయిపోయింది.. ఇప్పుడు జగనన్న సురక్ష మొదలు పెట్టారు.. పాలకుల్లో స్పందించే గుణం లేనప్పుడు ఏ కార్యక్రమ మయితే ఎందుకని ప్రశ్నించారు. అర్హత ఉన్న లబ్దిదారులకు పథకాలు అందడం లేదని ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకోవడం దేనికి సంకేతమో చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లుగా అద్భుతంగా పాలిస్తే జగనన్న సురక్ష కార్యక్రమం ఎందుకు పెట్టారో తెలియచేస్తూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వారాహి యాత్రను రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. నాలుగు రోజుల్లో మలివిడత వారాహి యాత్ర షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెనాలిలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “జగనన్న సురక్ష కింద 9 లక్షల 40 వేల మందికి టోకెన్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. తెనాలి నియోజకవర్గంలోనూ 24 సెంటర్లు పెట్టారు. సామాన్య ప్రజలు తనకి ఇబ్బందిగా ఉందని, సమస్యలు ఉన్నాయని అర్జీలు ఇస్తే వెంటనే రసీదు పంపి పని పూర్తయ్యిందని చెబుతున్నారు. సమస్య మాత్రం అలాగే ఉంటోంది. మీరు పెట్టుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఏమైంది? సచివాలయం వ్యవస్థ ఎక్కడ ఉంది? మీ పరిపాలన అద్భుతంగా ఉంటే ఇంత మందికి ఎందుకు టోకెన్లు ఇచ్చారు. మీరు వీరందరి సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తారు. రేషన్ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడానికే ఈ కార్యక్రమం అని చెబుతున్నారు. మొదటి రోజే 3 లక్షల 69 వేల అర్జీలు పరిష్కరించేశామని అంటున్నారు. ఎలా నమ్మాలి? ఇంత అద్భుతంగా పాలన సాగుతుంటే జనం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునేందుకు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు బయటకు వస్తున్నారు.
• బటన్ నొక్కారు.. అమ్మ ఒడి జమ కాలేదు
జగనన్న సురక్ష ద్వారా ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఏం చేయబోతున్నారు. సామాన్యుల సమస్యల పరిష్కారానికి ఎందుకు నాలుగున్నరేళ్లు పట్టింది. అర్హత ఉన్న వారికి లబ్ది కలుగలేదని ప్రభుత్వమే చెప్పుకుంటోంది. ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే ఇంత మంది ఖాతాల్లో డబ్బు జమ అయిపోయిందని వెనక స్క్రొలింగ్ వస్తుంది. ఈ రోజుకీ అమ్మ ఒడి డబ్బు ఖాతాల్లో జమ కాలేదు. అమ్మ ఒడి వచ్చిందని చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు ఉందా? ఒక్కో సభకు రూ. 6-7 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. హెలీకాప్టర్లలో చక్కర్లు కొట్టడం మినహా క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోరు. ఉభయ గోదావరి జిల్లాల్లో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. కనీస మౌలిక వసతులు కల్పించలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు? మీ సంక్షేమం ప్రజలకు చేరితే సురక్షకు ఇన్ని అర్జీలు ఎందుకు వచ్చాయి. మీ వ్యవస్థలు ఏమైపోయాయి. రూ.2 లక్షల 69 వేల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా వేసేశామని చెబుతున్నారు. కాకినాడలో లాయర్ల సమస్య మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడిగితే గాని డబ్బు పడలేదు. మలికిపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి హెచ్చరికలతోనే రాజోలులో రోడ్డు పనులు ప్రారంభించారు. 151 మంది ఎమ్మెల్యేలు, ఇంత యంత్రాంగాన్ని పెట్టుకుని ఎందుకు సరైన పాలన అందించలేకపోతున్నారు?
• వారాహి యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన
జనసేన పార్టీ వారాహి విజయ యాత్ర మొదటి దశ అద్భుతంగా నిర్వహించాం. ఉభయ గోదావరి జిల్లాల్లో 10 నియోజకవర్గాల మీదుగా సాగిన యాత్రలో అడుగడుగునా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా మహిళలు, యువతలో ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన కనబడింది. ప్రతి ఒక్కరు జనసేన పార్టీతో ప్రయాణం చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. 10 నియోజకవర్గాల్లో మొత్తం 8 బహిరంగ సభలు, క్షేత్ర స్తాయి పర్యటనలు నిర్వహించాం. వీటితో పాటు న్యాయవాదులు, వైద్యులు, సామాజికవేత్తలు, కార్మిక కర్షక వర్గాలతో గంటల తరబడి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చించి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన అంశాలు, సమస్యల సమాచారంపై అధ్యయనం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. రాష్ట్రానికి, జిల్లాకి, ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశం మీద స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తాం. ఏ ప్రాంతంలో చూసినా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మల్బరీ రైతులు, చేనేత కార్మికులు, మహిళలు, చివరికి దివ్యాంగులకు సైతం ఈ ప్రభుత్వం భరోసా కల్పించలేని పరిస్థితి. ప్రజలు సమస్యలు చెప్పుకుంటే భయభ్రాంతులకు గురి చేస్తుండడం బాధాకరం. మత్స్యకారుల సమస్యలపైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేవు. కనీసం రక్షిత మంచినీరు లేదు. స్మార్ట్ సిటీ పేరు పెట్టడం మినహా ఆ ద్రాక్ష ప్రజలకు అందడం లేదు.
• ప్రశ్నిస్తే ప్రజలపై కేసులు పెట్టారు
జనవాణి కార్యక్రమంలో ఎక్కువగా ఫించన్లు, రహదారుల సమస్యల గురించి వచ్చాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో రూ. 75 ఫించన్ తీసుకున్న దివ్యాంగుడికి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందని ఫించన్ రద్దు చేశారు. పదుల సంఖ్యలో దివ్యాంగులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారి బాధలు విన్నవించుకున్నారు. మీలో స్పందించే గుణం లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు? తహసీల్దార్ కార్యాలయం నుంచి, జిల్లా కార్యాలయాల వరకు స్పందన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్ని సమస్యలపై స్పందించారు. వైసీపీ మ్యానిఫెస్టోలో 99 శాతం పూర్తి చేశామని చెబుతున్నారు. మరి స్పందన సరిపోదని జగనన్నకు చెబుదామన్నారు. ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. జగనన్నా వినడు.. ఎమ్మెల్యేలు వినరు.. అదికారులు అంతకంటే వినరు.. మరి ప్రజలకు తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. గడప గడపలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రశ్నించినందుకు ప్రజల మీద వందల సంఖ్యలో కేసులు పెట్టారు. మైనింగ్, చెరువులు, కాంట్రాక్టుల పేరిట దోచుకుంటున్నారు. రాష్ట్రంలో చాలా ఇబ్బంది కరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. 9 నెలల తర్వాత ఇచ్చే ఫించన్ కి కూడా లంచాలు అడుగుతున్నారు. రైతుల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ఆన్ లైన్ విధానంలో జరిగేది ఒకటి తెరవెనుక జరిగేది మరోకటి. అన్యాయంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో ఎవరూ సురక్షితంగా లేరు.
• వారాహి యాత్ర విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు
వ్యవస్థలో ఉన్న లోపాల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేస్తే వ్యక్తగతంగా దాడులు చేస్తారు. వారాహి యాత్ర అద్భుతంగా సాగింది. 10 కిలోమీటర్ల పరిధిలోనే ఇంత పెద్ద బహిరంగ సభలు రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ పెట్టలేదు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వదిస్తుంటే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. విమర్శించే ఎవరూ ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడరు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల గురించి ఆయా శాఖల మంత్రులు వివరణ ఇవ్వలేరు. ముగ్గురు నలుగుర్ని కూర్చోబెట్టి తిట్టిస్తుంటారు. జగన్ పాలనలో నిజాయతీ లేదు.. పరిపాలనా దక్షత లేదు కాబట్టే ప్రజలు మీకిచ్చిన సమయాన్ని వృథా చేశారు. వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి అద్భుత పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
• వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అందరి బాధ్యత
రాబోయే రోజుల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బాధ్యతను ప్రజలకు గుర్తు చేస్తారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది. జనసేన తిరిగి వెలుగులు నింపే విధంగా, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేస్తుంది. వారాహి విజయ యాత్ర రెండో విడత పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రారంభిస్తాం. ఆ జిల్లా నాయకులతో సంప్రదించి నాలుగైదు రోజుల లోపే తదుపరి షెడ్యూల్ ప్రకటిస్తాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలంతా కలసికట్టుగా ముందుకు వచ్చి నిలబడాలి. అదే సమయంలో చక్కటి వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం రాజకీయ పార్టీలపైనా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ అడుగు వేసినా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వేస్తార”ని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ నాయకులు ఇస్మాయిల్ బేగ్, తోటకూర వెంకటరమణ రావు, పసుపులేటి మురళీకృష్ణ, జకీర్ హుస్సేన్, హరిదాసు గౌరీ శంకర్, దివ్వెల మధుబాబు, యర్రు వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.