నమ్మించి గొంతు కోసిన పాలకుడు

* ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు తెలిపి… ఇప్పుడు ప్రాంతీయవాదాలతో మూడు రాజధానుల పాట
* రాష్ట్రానికి ఒకటే రాజధాని జనసేన విధానం
* అమరావతి రైతులకు కౌలు సహాయం, పింఛను సకాలంలో అందాలి
* గతంలోనూ అమరావతి రైతులకు మద్దతుగా ఉద్యమం
* రైతులు చేపట్టబోయే రెండో విడత మహా పాదయాత్రకు జనసేన పార్టీ మద్దతు
* అమరావతి జేఏసీ సభ్యులతో భేటీలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధాని అనేది జనసేన విధానమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల వేళ రాజధాని రైతులకు మేలు జరిగే నిర్ణయాలు జనసేన పార్టీ నుంచి ఉంటాయని ఆయన చెప్పారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అమరావతి రైతులు కలిశారు. అమరావతి పరిరక్షణ పోరాటం వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా రెండో విడతగా అమరావతి రైతులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి తలపెట్టిన మహా పాదయాత్రకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మద్దతును కోరారు. ఆ రోజున వెంకటాయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వరకు మహా పాదయాత్ర సాగుతుందని, ఈ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు జెండా ఊపి ప్రారంభించాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా రైతులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయ నాయకులే విలన్లు. వారు తీసుకునే నిర్ణయాలే ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. గతంలో అమరావతిలో పర్యటించినప్పుడు కూడా ఇక్కడ రైతులను నేను స్పష్టంగా అడిగాను. మీరంతా ఇష్టపడే భూములు ఇస్తున్నారా అని నేను అడగగా చాలామంది అవునని చెప్పారు… అయితే కాస్త ఎక్కువ పరిహారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా తయారైన ఆంధ్రప్రదేశ్ ను రకరకాల సమస్యలు వేధిస్తున్నాయి. ఒక ప్రాంతీయ భావంతో రాష్ట్రం విడిపోతే, మళ్ళీ మూడు రాజధానులు పేరు చెప్పి మళ్లీ ప్రాంతీయవాదాలను తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నం పాలకులు చేస్తున్నారు. అప్పట్లో జస్టిస్ శ్రీ గోపాల గౌడ గారితో రాజధాని విషయంలో సమావేశం జరిపినప్పుడు సైతం మా పార్టీపరంగా మేం ఒక విధానం తీసుకున్నాం. తక్కువ మొత్తంలో మొదట భూమిని తీసుకొని దానిని అభివృద్ధి చేసిన తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి విస్తరించుకుంటూ పోవాలి అని భావించాం. ఆ పద్ధతి మంచిదని పెద్దలు కూడా సూచించారు. అయితే తర్వాత అప్పటి ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు… నా దృష్టికి రావడంతో నేరుగా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను.
* రకరకాల మాయమాటలతో నమ్మించిన పాలకుడు
అమరావతి రైతులు సైతం 2019లో వైసీపీకి ఎలా ఓటు వేశారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. గతంలో వైసీపీ నాయకులు అసెంబ్లీ సాక్షిగా, పాదయాత్రలోనూ ఒకటే రాజధాని అని, అక్కడ అభివృద్ధికి కట్టుబడతామని నమ్మించి వంచించారు. గతంలోనూ అమరావతి రైతులు కౌలు డబ్బులు పడలేదని నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వారి కోసం ముళ్ల కంచెలు దాటి మరీ పోరాటం చేసాం. వారికి అండగా నిలిచాం. రైతుల కోసం ఏం జరిగినా ఫర్వా లేదు అనే కోణంలో పోరాడాం. దీని తర్వాత అమరావతి రైతులకు కౌలు అందడం ఆనందమిచ్చింది. అమరావతి రైతులకు కచ్చితంగా మా మద్దతు ఉంటుంది. మహా పాదయాత్రలో మా పార్టీ నాయకులు భాగస్వాములు అవుతాం.
* రాష్ట్రంలో దళితుల విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది
రాష్ట్రంలో దళితుల విషయంలో విచిత్రమైన పరిస్థితి తయారైంది. వైసీపీ ప్రభుత్వం వస్తే తమ బతుకులు బాగుపడతాయి అని నమ్మిన వారి పైన ఈ ప్రభుత్వం కేసులు పెడుతుంది. గోపాలపురంలో పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ముఖచిత్రం వేసి, ఆ ప్లేట్లను చెత్త బుట్టలో వేసి దళితుల మనోభావాలు దెబ్బ తీస్తే… దీనిపై ప్రశ్నించిన ఎస్సీ యువకులపైనే కుట్ర కేసు నమోదు చేశారు. ఏకంగా 19 మంది ఎస్సీ యువకులపై కేసులుపెట్టారు. దళితులను అణగదొక్కేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. దీనిని దళిత మేధావులు గుర్తించాలి.
* అమరావతి రైతులకు న్యాయం జరగాలి
కచ్చితంగా అమరావతి రైతులకు పూర్తి మద్దతు ఉంటుంది. వారికి అందాల్సిన కౌలు సొమ్ము విషయంలో ప్రతి నెలా కోర్టుకు వెళ్లడం విచారకరం. కోర్టులు చెబితే కానీ ప్రభుత్వం కౌలు డబ్బులు రైతులకు ఇవ్వకపోవడం శోచనీయం. సొంత భూములు ఇచ్చి ప్రతిసారి ప్రభుత్వాన్ని ఇలా అడగాల్సి రావడం నిజంగా బాధాకరం. వారికి కచ్చితంగా ప్రభుత్వం కౌలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎలాంటి పెండింగులు లేకుండా అమరావతి రైతు కూలీలకు ఇస్తున్న వ్యవసాయ పింఛను కూడా ఇవ్వాలి అని కోరుతున్నాం. త్వరలోనే టిడ్కో ఇళ్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. గతంలో అమరావతి రైతులు మండలం రోజులకుపైగా చేసిన పాదయాత్ర అందరినీ కదిలించింది. ప్రస్తుతం రైతులు చేపడుతున్న అరసవెల్లి యాత్ర కూడా పూర్తిస్థాయిలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. చరిత్రలో నిలిచిపోయే ఒక నిర్మాణం జరుగుతున్నప్పుడు కొందరు కష్టాలు ఎదుర్కోక తప్పదు. అమరావతి రైతుల విషయంలోనూ ఇదే జరుగుతుందని భావిస్తున్నాను. కచ్చితంగా అమరావతి రైతులకు మా పార్టీ అండగా ఉంటుంది. భవిష్యత్తులో అమరావతి రైతుల పక్షాన పార్టీ నిర్ణయాలు ఉంటాయని తెలియజేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , అమరావతి జేఏసీ ప్రతినిధులు శివారెడ్డి, గద్దె తిరుపతి రావు, లూథర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *