మచిలీపట్నం హిందూ కళాశాలకు నిధులు విడుదల చేయాలి

ఎంతో ఉదారత… మరెంతో సదాశయంతో ఆవిర్భవించిన మచిలీపట్నం హిందూ కళాశాల దైన్య స్థితిని చూశాక తీవ్రమైన ఆవేదన కలుగుతోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటిష్ విద్యతో భారతీయత కనుమరుగైపోతుందన్న ఆందోళనతో దేశ భక్తులు కొందరు కలిసి 1856లో స్థాపించిన ఈ విద్యా పీఠం నేడు వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి మసకబారిపోతోంది. చివరకు అధ్యాపకులు, సిబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఎయిడెడ్ కళాశాలగా రూపాంతరం చెందిన ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. అయితే నిధులు రావడం ఆగిపోగా, రూ.2 కోట్లకు బకాయిలు చేరుకున్నాయి. జీతాలు లేక అల్లాడిపోతున్న సిబ్బంది చివరకు చేసేది లేక కోర్టు మెట్లు ఎక్కారని తెలిసింది. గత్యంతరం లేని పరిస్థితిలో భవిష్యత్తు అవసరాలకు పనికి వస్తాయని ఏర్పాటు చేసుకున్న భూములను తెగనమ్ముకోవడానికి యాజమాన్యం సిద్ధపడాల్సి వచ్చింది. కళాశాల పేరు మీద 14 ఎకరాల భూమి ఉంది. భవిష్యత్తులో మరెన్నో విద్యాసంస్థల ఏర్పాటుకు ఈ స్థలాన్ని రిజర్వు చేసి.. కళాశాల కమిటీ యాజమాన్యం ఉంచింది. అయితే సిబ్బంది జీతాలు చెల్లించడానికి ఈ భూములను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసి చాలా బాధ కలిగింది. జగనన్న విద్యా కానుక పేరిట నాసిరకం బ్యాగులు, బూట్లు విద్యార్థులకు ఇచ్చి కోట్లు కొల్లగొట్టడానికి దారులు వెతికిన ప్రభుత్వ పెద్దలకు… ఉన్నతాశయంతో ఏర్పాటైన ఈ కళాశాలకు రూ.2 కోట్లు ఇచ్చేందుకు దారులు కనపడలేదంటే ఆశ్చర్యమే. ఈ ప్రభుత్వ విద్యా విధానం చూస్తుంటే “ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట!” అన్న సామెత గుర్తుకు వస్తోంది. ఉగ్గు పాలతోనే పిల్లలందరికి ఇంగ్లీష్ నేర్పుతామంటున్న ఈ సర్కారు , ఉన్నతమైన ఆశయంతో ఏర్పాటైన మచిలీపట్నం కళాశాలను ఎందుకు రక్షించడం లేదో అర్థం కావడం లేదు. ఈ కళాశాలకు నిధులు ఇస్తే తమకు వచ్చేది ఏమీ ఉండదన్న భావనా? లేదా భారతీయ మూలాలతో ఏర్పాటైన ఈ విద్యాసంస్థ మనకెందుకులే అన్న నిర్లక్ష్యమా? తెలియడం లేదు. ఎంతో చరిత్ర కలిగిన ఈ కళాశాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వైసీపీ సర్కారు… ఈ కళాశాల పునర్ వైభవానికి కృషి చేయకపోతే ఎన్నికల అనంతరం జనసేన పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని జనసేనాని స్పష్టం చేశారు.