జనసేన పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది భవిష్యత్ మనదే: పవన్ కళ్యాణ్

విపరీతమైన దౌర్జన్యాలు, దాష్టీకాల మధ్య ఒక ఆశయాన్ని నమ్మి దాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి చాలా గుండె ధైర్యం కావాలని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మంది నిలబడ్డాం అన్న దాని కంటే ఏ స్థాయిలో పోరాటం చేశామన్నది ముఖ్యమన్నారు.

గుండె ధైర్యం ఉన్న మహిళలు, యువకులు బలంగా నిలబడి విజయం సాధించారని తెలిపారు. జనసేన పార్టీ తరఫున కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పోరేటర్లు, కౌన్సిలర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన, పోటీ చేసిన అభ్యర్ధులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలను అభ్యర్ధుల ద్వారా తెలుసుకున్నారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఏడాది క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ మీద ఎంతో ఒత్తిడుల మధ్య, దౌర్జన్యపూరిత వాతావరణంలో పోరాటం చేయడం, నిలబడడం చాలా గొప్ప విషయం. గుండె ధైర్యం ఉన్న ఆడపడుచులు, యువకులతో కూడిన బలమైన సమూహం నిలబడి సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు కంటే పోరాటం ముఖ్యం.

పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లిన మీరంతా చాలా మందిలో స్ఫూర్తిని నింపారు:

మైదుకూరు లాంటి ప్రాంతాల్లో ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయో… అక్కడ నిలబడి ఒక వార్డు విజయం సాధించడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూశాను. ఈ తరహా విపత్కర పరిస్థితులు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. ఇంతటి కష్టసాధ్యమైన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రతి ఒక్కరికీ, పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులు. పార్టీ నుంచి మీకు అన్ని రకాలుగా సహాయసహకారాలు ఉంటాయి. ప్రతి సమాచారం మీకు అందుతుంది.

సామాన్యుడు రాజకీయాలు చేయాలన్నదే జనసేన లక్ష్యం:

పార్టీ నిర్మాణం అన్నది ఓ సాహసోపేతమైన చర్య. ఒక సగటు మనిషి… అన్ని కులాలు బాగుండాలి.. అన్ని వర్గాలు బాగుండాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్లడం ఎంతో కష్టం. దీనికి తోడు అధికారంలో ఉన్న వారు డబ్బులిచ్చి సమాజాన్ని పాడు చేస్తుంటే నిజాయతీపరులు నలిగిపోతున్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలతోపాటు మధ్యతరగతి కూడా నలిగిపోతుండడాన్ని చూసి మీకు అండగా ఉండాలన్న లక్ష్యంతో ముందు వచ్చాను.

డబ్బు, పలుకుబడి ఉన్న వారు మాత్రమే రాజకీయం చేయాలా? సామాన్యులు, అణగారిన వర్గాల వారు సైతం రాజకీయాలు చేయాలన్న ఆలోచన నన్ను పార్టీ స్థాపించేలా చేసింది. ఇప్పుడు మీరు చూపిన స్ఫూర్తితో పదింతల విశ్వాసంతో నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తా.

రాజకీయ పార్టీ నడపడం ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అంతా సమిష్టిగా కృషి చేయాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఉంటాయి. తట్టుకుని ముందుకు వెళ్లకపోతే మార్పు సాధ్యపడదు. కొన్నిసార్లు పరిస్థితులు ఆశాజనకంగా కనబడకపోవచ్చు.

నిరాశానిస్పృహలు ఆవహించినప్పుడే ఎదురొడ్డి నిలబడాలి. ఓపిక, సహనంతో ముందుకు వెళ్తే ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొని గెలుపొందగలం. అయితే దానికి సమయం పడుతుంది. అలాంటి సహనం మనలో ప్రతి ఒక్కరికీ అవసరం. మీరు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొన్న ఇబ్బందులు నాకు తెలుసు. ఆ కష్టాలన్ని పడుతూ కూడా ఓ సిద్దాంతాన్ని బలంగా నమ్మి పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నందుకు అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ ప్రయాణం ఒక్క రోజుతో ఆగేది కాదు. నిరంతరంగా సాగేది.

30 శాతంపైగా ఎన్నికల్లో పాల్గొనలేదు:

స్థానిక ఎన్నికల్లో సహజంగా ప్రజలు అధికారంలో ఉన్న ప్రభుత్వ పక్షం వైపు మొగ్గు చూపుతారు. అవసరాల దృష్ట్యా అధికారంలో ఉన్నవారికే మద్దతు పలుకుతారు. ఈ గెలుపుని చూసి మొత్తం ప్రభుత్వం వైపు ఉంది అనుకోవద్దు. 30 శాతం మందికి పైగా అసలు ఎన్నికల్లో పాల్గొనలేదు. విపక్షాల మధ్య ఓటు చీలిపోయింది. తటస్థ ఓటరు కూడా ఉన్న ప్రభుత్వానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గెలిచింది అన్న అంశం గురించి ఆలోచించ వద్దు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక తుపానుకు, సుడిగాలికీ ఎదురెళ్లి నిలబడి మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. నేను కోరుకున్న మార్పు వస్తుందా అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి విజయాలే ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఇది చిన్న విజయం కాదు అతి పెద్ద విజయం. సుధీర్ఘ ప్రయాణం కూడా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. పెడన, మచిలీపట్నం లాంటి చోట్ల ఒక్కో వార్డులో సాధించిన విజయం రాబోయే పెద్ద మార్పుకు సంకేతం. ఈ విజయం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. మున్సిపల్ కార్పోరేషన్లలో మనం పోటీ చేసిన వార్డుల్లో 14 శాతం ఓట్లు సాధించాం. మున్సిపాలిటీల్లో 13.4 శాతం ఓట్లు సాధించాం. ఓ పొలిటికల్ పార్టీగా చాలా బలంగా, స్థిరంగా ముందుకు వెళ్తున్నాం. ఈ గెలుపు రాబోయే విజయానికి సంకేతం. భవిష్యత్ మనదే’ అన్నారు.