కాపులకు జోగి రమేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎస్ వి బాబు డిమాండ్

*కాపు జాతిని సంకరజాతి అంటున్న మంత్రి జోగి రమేష్ అనుచరుడు

పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్ వి బాబు మాట్లాడుతూ.. జోగి రమేష్ ఎలాంటి నీచ రాజకీయాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో వర్గాలుగా విభజించి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. జోగి రమేష్ గురువారం తన అనుచరులతో తన ఆఫీసులో ఒక ప్రస్టేషన్ మీట్ (అది ఎంతమాత్రం ప్రెస్ మీట్ కాదు) పెట్టి కాపు జాతి సంకరజాతి అని.. కాపు జాతిని దూషించటం జరిగింది.

రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉండి కులాలకు, మతాలకు అతీతంగా.. ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చు తానని ప్రమాణం చేసి.. తన అనుచరులతో ఒక సామాజిక వర్గం పై దాడి చేయడం ముమ్మాటికి కులాలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు ఖండించాలి.

వైసీపీలో ఉన్న కాపులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. లేనియెడల కాపు జాతి మిమ్మల్ని అసహ్యించుకుంటుంది. మీరు జాతి ద్రోహులుగా ముద్ర వేయబడతారు.

జనసేన పార్టీ తరఫున పెడనలో మేము ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ ని సూటిగా అడిగిన ప్రశ్న ఒక్కటే. పెడన నియోజకవర్గంలో అవినీతి – అభివృద్ధి మీద బహిరంగ చర్చకు రావాలని పిలుపునివ్వడం జరిగింది. నిజానికి నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరగకపోతే.. నిత్యం వేలకొద్దీ లారీల మట్టి తరలించడం నిజం కాకపోతే.. ఇంతేరు మడ భూములు ఆక్రమణ నిజం కాకపోతే.. మీరు బహిరంగ చర్చకు ఎందుకు భయపడుతున్నారని..? ప్రశ్నిస్తే, నోటికొచ్చినట్టు తిట్టడం వైసీపీ పార్టీ నైజం అని నిరూపించారు.

అయినా ప్రశ్నించింది నేను.. మీరు ఏమన్నా అంటే నన్ను అనాలి. అంతేగాని ఒక జాతిని, ఒక కులాన్ని మీ అనుచరుల చేత దూషించటం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులకు తగదు.

ఇప్పటికైనా విద్వేషపూరిత రాజకీయాలు మానుకుని, కాపు జాతికి క్షమాపణ చెప్పవలసిందిగా జోగి రమేష్ ని డిమాండ్ చేస్తున్నాం.

జనసేన పార్టీకి కులం లేదు.. మేము ఏ కులానికి అనుకూలం కాదు.. ఏ కులానికి వ్యతిరేకం కాదు. మాకు అందరూ సమానమే. జనసేన సిద్ధాంతంలో ముఖ్యమైన మూల సిద్ధాంతం కులాలను కలుపుతూ రాజకీయ వ్యవస్థను నిర్మించడం.

కాపులకు జోగి రమేష్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్ వి బాబు బలంగా డిమాండ్ చేశారు.