తెలుగు భాషను వారసత్వ సంపదగా అందిద్దాం

కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా – తెలుగు వాళ్ళం అని చెప్పుకోవడంలో భావోద్వేగం… సోదర భావం వెల్లడవుతాయి. ఇందుకు ఆలంబన మన భాషే. అటువంటి అమ్మ భాషను అనునిత్యం మనం గౌరవించుకోవాలి అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కోరారు. భావి తరాలకు వారసత్వ సంపదగా తెలుగు భాషను అందిస్తామని మనందరం సంకల్పించుకొని తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత చేకూరుద్దాం. గ్రాంథికంలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల బాట పట్టించి వ్యావహారిక భాషకు పట్టం కట్టిన మహనీయులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకొంటున్నాం. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. వ్యావహారిక తెలుగు భాష సొబగునీ, విలువనీ గుర్తెరిగి ఆ భాషను రచనల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీ గిడుగు వారు ఉద్యమ స్ఫూర్తితో చేసిన కృషి వల్లే మన భాష విరాజిల్లుతోంది. ఆ స్ఫూర్తితోనే తెలుగు భాష పరిరక్షణకు పూనుకోవాలి. విద్యార్థి దశ నుంచే మన భాషను బాలలకు నేర్పించాలి. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో సాగాలనే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని విస్మరించకూడదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషను దూరం చేసే ప్రణాళికలపై భాషాభిమానులు, విద్యావేత్తలు అప్రమత్తం కావల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు తెలుగు నేర్పించడమే కాదు పాలన వ్యవహారాల్లో సైతం తెలుగు వాడుక పెంచాలి. అన్ని వర్గాలవారూ తెలుగు భాష పరిరక్షణకు సన్నద్ధమైతేనే శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారికి నిజమైన నివాళి ఇవ్వగలం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *