కడప గడపలో జనసేన బలం చూపిద్దాం

* ఉన్నత లక్ష్యంతో కౌలు రైతు భరోసా యాత్ర
* గత మూడేళ్లలో కడపలో 132 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు
* అక్టోబరు నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ యాత్రతో మార్పు మొదలు కాబోతోంది
* నాయకుడి బాటలో అంతా ముందుకు వెళ్దాం
* ఉమ్మడి కడప జిల్లా నాయకులతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘నీతి, నిజాయతీలనే నమ్ముకున్న పార్టీ జనసేన. వ్యవసాయం కోసం చేసిన అప్పుల భారంతో బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడమే కాకుండా భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని భరోసా కల్పిస్తున్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో గత మూడేళ్ల కాలంలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ, వారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందనీ తెలిపారు. బెదిరింపులు వచ్చినా, కేసులు పెట్టినా కౌలు రైతు భరోసా యాత్ర ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతుంది అన్నారు. దీనికి జనసేన శ్రేణులన్నీ ఒక్కటై రైతులకు మేమున్నామని అభయం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి కడప జిల్లా నుంచి వచ్చిన జనసేన నాయకులు, జన సైనికులతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీకి కడప జిల్లాలో బలంగా పనిచేసే జన సైనికులున్నారు. ఎన్నో ఒత్తిళ్లు ఉండే ప్రాంతంలో ఓ గొప్ప ఆశయం కోసం మనం పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. జనసైనికులకు ఏ కష్టమొచ్చినా పార్టీ కచ్చితంగా అండగా నిలుస్తుంది. గత మూడేళ్లలో సీఎం సొంత జిల్లాలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడటం సాధారణ విషయం కాదు. సొంత నియోజకవర్గం పులివెందులలోనూ గత మూడేళ్లలో అనేక మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వారికి తగిన సాయం అందించాల్సిన అవసరం ఉంది. కేవలం పార్టీ నుంచి సాయం చేయడమే కాదు.. ప్రభుత్వం నుంచి సదరు కౌలు రైతులకు న్యాయంగా రావల్సిన రూ.7 లక్షలు వచ్చే వరకు జన సైనికులు పోరాడాల్సిన అవసరం ఉంది. రైతు కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామని భరోసా నింపాలి.
* రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ అద్భత యాత్ర మొదలు కాబోతోంది
దసరా నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కనివినీ ఎరుగని మార్పులు ఉంటాయి. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే యాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతోంది. ఈ యాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు మరింత దగ్గరవుదాం. 2014 నుంచి రాజకీయాల్లో వెనకడుగు లేకుండా, గొప్ప పట్టుదలను చూపుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనే ఓ గొప్ప వేదికను అందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దీనిని మరింత బలపర్చాల్సిన అవసరం ప్రతి జన సైనికుడిపై ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న శ్రీ జగన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కంకణం కట్టుకొని పని చేయాలి. ఈ పోరాటంలో అరెస్టులు, కేసులు, బెదింరింపులు, దాడులు ఉంటాయి. వాటన్నింటినీ దాటుకొని పోరాటం చేయాలి. కడప జిల్లాలో జనసేన ఎంత బలంగా ఉందో కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా చాటి చెబుదాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కచ్చితంగా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది అయితేనే ఆయన దాన్ని ఆమోదిస్తారు. నాయకుణ్ణి ప్రతి జన సైనికుడు అనుసరించాలి. మన నాయకుడు చూపిన దారిలో నడవాలి’’ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతంశెట్టి నాగేంద్ర ఈ సమావేశంలో పాల్గొన్నారు.