‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్’… జనసేన లక్ష్యం

* రాజ్యాధికారం దిశగానే శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అడుగులు
* సంక్షేమం, అభివృద్ధి రెండూ జనసేనకు ప్రధానం
* ముఖ్యమంత్రి కాపురం ఎక్కడ పెడితే అక్కడ రాజధాని అని చెప్పుకోవడం సిగ్గుచేటు
* ఉత్తరాంధ్ర అభివృద్ధిపై జనసేన ప్రత్యేక మేనిఫెస్టో
* ఉత్తరాంధ్ర వెనకబాటు నిర్మూలనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్పష్టమైన విజన్
* విశాఖపట్నం భూదందాల కోసమే వైసీపీ తాపత్రయం
* అధికారంలోకి రాగానే విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేసిన భూదందాలు,
అక్రమ నిర్మాణాలపై సమీక్షిస్తాం
* వైసీపీ నాయకులు క్షేత్రస్థాయి ప్రజా వ్యతిరేకతను భరించలేకపోతున్నారు
* రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయి
* విశాఖపట్నంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపరంగా దూరం చేసి, అన్ని రకాలుగా వెనక్కు తీసుకువెళ్లిన వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. దీని కోసం కచ్చితంగా వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్నదే జనసేన అభిమతం. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి భేటీ జరిగింద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం విశాఖపట్నంలో శ్రీ మనోహర్ గారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అత్యుత్తమ ప్రత్యామ్నాయం కోసం జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు మేలు జరిగే పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లలో అందించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉంది. గతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయబోమని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే రాజకీయ భేటీలు ఉంటాయి. ఇవి భవిష్యత్తులోనూ జరుగుతాయి. ఒక ప్రణాళిక, వ్యూహంతో అభివృద్ధి పంథాలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేలా మా అడుగులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షం. కచ్చితంగా రాజకీయంగా దానిని పాటిస్తూ ముందుకు వెళ్తాం.
* ఉత్తరాంధ్ర వనరులు, భూములు కొల్లగొడుతున్నారు
ఉత్తరాంధ్రలో అపారమైన మానవ వనరులు, సహజ వనరులు ఉన్నాయి. ఇప్పటి వరకు పాలకులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది. వలసలు పెరిగిపోయాయి. అద్భుతమైన సహజ వనరులను అడ్డగోలుగా దోపిడీ చేశారు. వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంపై చూపుతున్న ప్రేమ కేవలం కపట నాటకం మాత్రమే. ఇక్కడ భూములపై కన్నేసిన వైసీపీ నాయకులు వాటిని దోచుకోవడం కోసమే కొత్త నాటకాలకు తెర తీశారు. నిషేధిత భూముల్లో అక్రమ కట్టడాలు, కనిపించిన ప్రతి జాగా ఆక్రమించుకోవడం ఇప్పటికే పెరిగిపోయింది. ఈ భూముల దోపిడీని అధికారికం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం తాపత్రయపడుతోంది.
జనసేన పార్టీ పూర్తి స్థాయి ప్రణాళికను, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పష్టమైన అభివృద్ధి విజన్ తో ప్రత్యేక మేనిఫెస్టో అందిస్తాం. కచ్చితంగా ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేలా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీనికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పష్టత ఉంది. ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో జనసేన పార్టీ సంస్థాగతంగా బలం పుంజుకుంటోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మండల, గ్రామ. కమిటీల నియామకం పూర్తి అయ్యింది. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర లో పూర్తిస్థాయిలో రాజకీయంగా సన్నద్ధం అయ్యింది.
వైసీపీ విశాఖలో భూదందాలు సాగిస్తోంది. రుషికొండ నుంచి చర్చి భూముల వరకూ అన్నింటినీ దోచేస్తున్నారు. విశాఖలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల ఆస్తులు కొల్లగొడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఒక వృద్ధురాలుకి చెందిన 80 సెంట్ల భూమిని లాక్కొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే విషయం మా దృష్టికి వచ్చింది. మేం అధికారంలోకి వచ్చాక భూ దందాలు, అక్రమ నిర్మాణాలు.. వాటి అనుమతులపై కచ్చితంగా రివ్యూ చేస్తాం.
* రాజకీయ కోణమే వైసీపీకి ప్రధానం
రాష్ట్రంలో ఏ పని చేసినా దానిలో రాజకీయ కోణం, ఉపయోగాన్ని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. ప్రజలకు ఏ పని ఉపయోగపడుతుంది, వారికి ఏది అవసరం అన్నది మాత్రం వైసీపీకి పట్టడం లేదు. ఓ పని చేస్తే రాజకీయంగా ఎంత మేర లబ్ధి కలుగుతుంది అన్నది బేరీజు వేసుకొని మాత్రమే పనులు చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటు పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పీఎంఈవై పథకంలో భాగంగా గత ఏడాది 95,000 ఇల్లు కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం 55 నిర్మించడం అంటే వైసీపీ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో అర్థం అవుతుంది. పాలనలో ఘోరంగా ఈ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కనిపించిన ఇసుక, కొండలు, గుట్టలు, మట్టి ఇలా ప్రతిదీ దోచుకుపోతున్నారు. ఉత్తరాంధ్రను పూర్తిగా దోచుకోవడం కోసం మాత్రమే వారు వస్తున్నారు తప్పితే.. అభివృద్ధి కోసం కాదు.
* సీఎం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకపోతున్నారు?
విశాఖపట్నం మాకాం మారుస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికీ పలుమార్లు చెప్పారు. జనవరి, మార్చి, అయిపోయింది…. ఇప్పుడు సెప్టెంబర్ లో విశాఖపట్నంలో కాపురం పెడతానని చెబుతున్నారు. అదే విషయాన్ని మీడియా ముఖంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పవచ్చు కదా..? అది ప్రజలకు నేరుగా చేరుతుంది కదా..? ప్రజలను కేవలం మభ్యపెట్టడానికి మాత్రమే ఈ ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కాపురం పెడితే అక్కడ నుంచి పరిపాలన సాగుతుందని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది. అలా చెప్పుకోవడం సిగ్గు చేటు. మీకు ఉత్తరాంధ్ర పై ప్రేమ కాదు.. ఇక్కడ వనరులపై కన్ను మాత్రమే ఉంది. ఇప్పటికే ఇక్కడి కీలక భూములను ఎలా కాజేస్తున్నారో ప్రజలకు అర్ధం అయ్యింది. దీన్ని మరింత కొనసాగించి ఈ ప్రాంతంలో కల్లోలం సృష్టించేందుకే వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.
* మత్స్యకారులకు కావాల్సింది హార్బర్లు
మత్స్యకారులకు జనసేన పార్టీ మొదటి నుంచి అండగా నిలబడింది. గత ఎన్నికల పోరుకు వెళ్లే ముందు కూడా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళ్లారు. వార అన్ని బాధల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్పష్టమైన అవగాహన ఉంది. వారికీ ఎం చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ప్రణాళిక ఉంది. ఎన్నికల కోసం హడావుడిగా పోర్థులకు వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తోంది. మత్స్యకారులకు కావాల్సింది ఫిషింగ్ హార్బర్ లు, జెట్టిలు. దీనిని వైసీపీ పాలకులు తెలుసుకోవాలి. మత్స్యకారులకు గత 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదు. సంక్షేమం, అభివృద్ధి అనేది ఎంతో అవసరం. వాటిని పాలనకు రెండు చక్రాల మాదిరి ముందుకు తీసుకుని వెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
* ఎఫ్ఐఆర్ లో పేర్లు ఎందుకు మారుస్తున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పెద్దలు విశాఖపట్నంలో పోలింగ్ బూతుల వాళ్ల అల్లకల్లోలం సృష్టించారు. బయట ప్రాంతాల నుంచి మనుషులను దించి మరీ పోలింగ్ సమయంలో బెదిరింపులకు దిగారు. సాక్షాత్తు వైసీపీ రాజ్యసభ సభ్యుడు రంగంలోకి దిగి విశాఖ లో చేసిన బెదిరింపులు అందరికీ గుర్తే. అప్పట్లోనే జనసేన పార్టీ ఈ దురాగతాలపై పోరాడింది. దీనిపై జనసేన పార్టీ వీర మహిళ శ్రీమతి అమరారపు దుర్గ గారు చేసిన న్యాయపోరాటం గొప్పది. అప్పట్లో వైసీపీ నేతల తీరు మీద శ్రీమతి దుర్గ ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకుండా పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసినా దానిలో పేర్లు విచిత్రంగా పెట్టారు. ఎంపీ శ్రీ విజయసాయి రెడ్డి పేరును వి.ఎస్.రెడ్డి, శ్రీ కె. కె.రాజు పేరును కేకేఆర్ అని పేర్లు నమోదు చేశారు. ఇలా సగం సగం పేర్లు నమోదు చేయడం వెనుక అంతర్యం ఏమిటో పోలీసులు సమాధానం చెప్పాలి.
* వైసీపీ స్టిక్కర్లు వద్దని జనమే చెబుతున్నారు
క్షేత్ర స్థాయిలో జగనన్న మా నమ్మకం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. శ్రీ జగన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. వైసీపీ వాళ్లు మాత్రం జగన్ బొమ్మతో నువ్వే మా నమ్మకం అని స్టిక్కర్లు వేస్తుంటే జనం నవ్వుతున్నారు. ప్రజల నవ్వుకునే పరిస్థితి వైసీపీ వారికీ కంటగింపుగా మారి దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా యువకుల మీద కక్ష కట్టి దాడులకు తెగబడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అన్నారు.
ఈ సమావేశం లో పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సుందరపు విజయ్ కుమార్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్, పార్టీ నాయకులు సందీప్ పంచకర్ల, పీవీఎస్ఎన్ రాజు, శ్రీమతి పి.ఉషా కిరణ్, గడసాల అప్పారావు, బోడపాటి శివదత్, శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి, వంపూరు గంగులయ్య, శ్రీమతి భీశెట్టి వసంతలక్ష్మి, పి.మూర్తి యాదవ్, దల్లి గోవిందరెడ్డి, కందుల నాగరాజు, శ్రీమతి రేవతి, శ్రీమతి శరణిదేవి, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీమతి కిరణ్ ప్రసాద్, శ్రీమతి త్రివేణి, మూగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.