నేను అభిమానించే రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్….ఎందుకంటే?

*హృదయం నుంచి ప్రవహించే నమ్మకం పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ మాటలన్నీ మనకి తెలిసినవే అనిపిస్తుంది. అయినా విసుగు రాదు. మన వేదనని మనమే వింటున్నట్టు వుంటుంది. మన ఆవేశాన్ని మనమే చూస్తున్నట్టు వుంటుంది. మన చుట్టూ వున్న దుర్నీతిపై మనమే విరుచుకుపడుతున్నట్టు వుంటుంది. అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టు వుంటుంది.
పవన్ కల్యాణ్ దారుణంగా ఓడిపోయిన పార్టీ నాయకుడే! అయినా, ఆయన ప్రజానాయకుడే! ఎందుకంటే ఆయన బుద్ధి వికాసాలతో గాక హృదయ స్పందన నుంచే మాట్లాడతారు కనుక.
జనంలో ఆక్రోశాలు, ఆవేదనలు, ఉద్వేగాలు, సమాధానంలేని ప్రశ్నల్ని పవన్ హృదయం నుంచి ప్రతిబింబించారు. రాజకీయ సాంప్రదాయాలను, లాంఛనాలను విచ్ఛినం చేస్తూ అన్ని దుర్నీతుల మీద నిప్పులు చెరుగుతున్న పవన్ నిజ జీవితంలోనూ హీరో అయ్యారు.
ఇతను తెలుగుదేశానికి ఉపయోగపడతాడా, బిజెపికి ఉపయోగ పడుతాడా అన్న అనుమానానాల్ని ఇపుడు పవన్ ఎదుర్కొంటున్నారు. రాజకీయ సాంప్రదాయాలకు పద్ధతులకు మర్యాదలకు భిన్నంగా ప్రజాజీవితంలోకి వచ్చే వారి మీద విమర్శలు అతితీవ్రంగా వుంటాయి.
రాజశేఖరరెడ్డి చనిపోయింది మొదలు రాష్ట్ర విభజన జరిగాక, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాల్లో ప్రజలమైన మనకి ఉన్నది ఉన్నట్టు చూసే శక్తి నశించింది.
మనం రాజకీయ పార్టీల ఓట్లకు వేటలమైపోయాం. మనకితెలిసో తెలియకో కులం, మతం, ప్రాంతం కళ్ళజోళ్ళు తొడిగేసుకున్నాం. ఎవరేమిచెప్పినా వినకముందే అనుమానాల్ని పెంచేసుకుని ఆ దిశగానే ప్రచారాలు కూడా చేసేస్తున్నాం.
24 గంటల న్యూస్ టివిల వల్ల, సోషల్ మీడియావల్లా ప్రజలకు ఇపుడు రెండు పాత్రలు సంక్రమించాయి. ఒకటి ఎవరికి వారు జీవించే సొంత పాత్ర. రెండు ఎవరికితోచిన అహగాహనను ఇతరులకు చెప్పే మీడియా పాత్ర. ఇందులో ప్రతివారూ శ్రోతలే. ప్రతివారూ ఉపన్యాసకులే.
ఈ గందరగోళంలో పవన్ నే కాదు ఎవరినీ నమ్మలేని స్ధితి … నమ్ముకున్న నాయకుల్నీ అనుమానించే స్ధితి తప్పడం లేదు. అసంఖ్యాకమైన సినీ అభిమానులు వున్న అమితాబ్ బచ్చన్, చిరంజీవి మొదలైన వారు సఫలమైన లేదా విఫలమైన రాజకీయ నాయకులుగానే వుండిపోయారు. చివరిలో రాజకీయ నాయకుడిగా ఎన్ టి ఆర్ విఫలమైనప్పటికీ ఆయన ఎప్పటికీ గొప్ప ప్రజా నాయకుడే! ప్రజల సుఖదుఃఖాలని కష్టనష్టాలనీ అనుభూతి చెంది ఆవేశాలు ఉద్వేగాలు ఉద్రేకాలతో వాటిని నోటిమాటలతోగాక హృదయపూర్వకంగా ప్రతిబిబింపచేయడం వల్లే ఆయన నాయకులందరిలో ఉన్నతుడయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా అంతటి నాయకుడే అనిపిస్తున్నారు.
నరసాపురంలో జరిగిన మత్స్యకారుల సభలో వారి ప్రయోజనాలను దెబ్బతీసే 217 జి ఒ ను పవన్ ఖండిస్తూ మనకే 10 మంది ఎమ్మెల్యేలు వుంటే ఈ జిఒ వచ్చి వుండేది కాదనడంలో బేలతనం కాక, తన వైఫల్యాన్ని ప్రజల ముందు ఓపెన్ గా ఒప్పుకున్న నిజాయితీ వుంది.
సినిమా పెద్దలను తన వద్దకు రప్పించుకునే జగన్ ఎత్తుగడ వల్లే సినిమా టికెట్ల ధర పెంచడం మొదలు తగ్గించే వరకూ జరిగిన పరిణామాల డ్రామా బహిరంగ రహస్యమే!
పవన్ మాటల ప్రభావం ఆయన కెరీర్ మీద వుంటుందని, విడుదలకు సిద్ధంగా వున్న “భీమ్లానాయక్” మీద పడుతుందని తెలిసి కూడా “లేని సమస్యను సృష్టించి ఎదుటి వాళ్ళను సాగిలపడేలా చేసుకునే” జగన్ కు లొంగే సమస్యే లేదని, ఎంతవరకైనా పోరాడగలమనీ ఆయన స్పస్టం చేయడంలో ధైర్యం కనబడుతోంది. తన వ్యాఖ్యానాలు అన్న చిరంజీవిని ఇబ్బంది పెడతాయని తెలిసి కూడా నిర్మొహమాటంగా మాట్లాడడంలో నిజాయితీ, నిబద్ధతలు వున్నయి. నిలకడలేని వాడని, మాయమైపోయి ఆకస్మికంగా ప్రత్యక్షమౌతూ వుంటాడని, స్వయంగా ఓడిపోయిన వాడు పార్టీని ముందుకి ఎలా తీసుకు వెళ్తాడని పవన్ మీద విమర్శలు వున్నాయి. ఇవన్నీ నిజమే! ఇన్ని వైఫల్యాలు వున్నా కూడా ఆయన ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేదు. నిజాయితీ నిబద్ధతలకు ఇంతకుమించి ఇంకేమి సాక్ష్యాలు కావాలి?
ఇతనిది ప్రశ్నించడంలో నిజాయితీకి వున్న శక్తి !
భ్రమలేని నమ్మకం ఇచ్చిన వారిని ప్రజలు ప్రేమాస్పదంగా గౌరవించుకుంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోకాని పవన్ కల్యాణ్ కలవరింతంతా హృదయపూర్వకమేనని నమ్మకం కలుగుతోంది.