లద్ధాక్ దుర్ఘటన మాటలకు అందని విషాదం

* అమరులైన జవాన్లకు వందనాలు
హిమ పర్వతాలు, అత్యంత సంక్లిష్ట వాతావరణంతో నిండివుండే లద్ధాక్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సైనికులు మృతి చెందిన దుస్సంఘటన నా మనసును తీవ్రంగా కలచి వేసిందంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరో 19 మంది సైనికులు తీవ్రంగా గాయపడడం మన దురదృష్టంగా భావిస్తున్నాను. మానవ ప్రాణాలు ఎంతో విలువయినవి. అందులోను సైనికుల ప్రాణాలు మరెంతో అపురూపమైనవి. దేశం కోసం తమ సర్వసౌఖ్యాలు విడనాడి, అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల త్యాగాలకు ఏమి తిరిగిచ్చి రుణం తీర్చుకోగలం?. అటువంటి జవాన్లు దేశ రక్షణ కర్తవ్యంలో భాగంగా తమ శిబిరం నుంచి వాహనంలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో వాహనం నదిలోకి జారిపడి ప్రాణాలు కోల్పోవడం మాటలకు అందని విషాదం. అమరులైన వీరులకు గౌరవ వందనం అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అమరుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వంతోపాటు, వారి స్వరాష్ట్ర ప్రభుత్వాలు కూడా లెక్కలు వేయకుండా ఉదారంగా ఆర్ధిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అమరుల కుటుంబాలకు ఏ లోటు రాకుండా చూసుకోవలసిన బాద్యత ప్రభుత్వాలతోపాటు భారతీయులందరిపై ఉందని పవన్ కళ్యాణ్ మనవి చేశారు.