పవన్ కళ్యాణ్ యువత కోసం వ్యవస్థలతో యుద్ధం చేస్తున్నారు

*రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉంది
* కుప్పం, నంద్యాల జన సైనికులతో పి.ఎ.సి. సభ్యులు కొణిదెల నాగబాబు

పాలకులు చేస్తోన్న దుర్మార్గాలను ప్రశ్నిస్తోన్న యువతపై కేసులు పెట్టి హింసిస్తున్న నాయకులను గద్దె దించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థలతో యుద్ధం చేస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేశారు. యువ నాయకులను రాష్ట్ర పరిపాలనలో భాగస్వామ్యం చెయ్యాలనే కృత నిశ్చయంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన జీవితాన్ని పణంగా పెడుతున్నారని తెలిపారు. మంగళవారం హైదరాబాదులోని జనసేన కేంద్ర కార్యాలయంలో కుప్పం, నంద్యాల నియోజక వర్గాలకు చెందిన జన సైనికులతో శ్రీ నాగబాబు గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ యువతను ప్రజా ప్రతినిధులుగా తయారు చేసినప్పుడే పల్లెల నుంచి పట్టణాల వరకు వ్యవస్థలన్నీ చక్కదిద్దగలమని చెప్పారు. జన సైనికులు కేసులకు భయపడకుండా పూర్తి ఆత్మ విశ్వాసంతో పోరాటం చెయ్యాలని, జనసేన విజయం కోసం, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ధర్మబద్ధమైన పరిపాలన చూడడం కోసం మీలో ఒకడిగా.. మీతోపాటు ఒక సైనికుడిగా పని చేస్తానని అన్నారు. కుప్పం, నంద్యాల నియోజకవర్గాలలో జన సైనికులు పని చేస్తున్న విధానం ఇతర నియోజకవర్గాల వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో జనసేన పార్టీ పూర్తి బలోపేతం అయ్యిందని, జనసేన శ్రేణులు అంతా ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవ్వాలని సూచించారు. త్వరలో కుప్పం, నంద్యాల నియోజకవర్గాలు పర్యటిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా నాయకులు కె.రామమూర్తి, వేణు, మునెప్ప, హరీశ్, అమీర్, సుధాకర్, నంద్యాల ప్రాంత నాయకులు చందూ, సుందర్, ఫరూఖ్, ఫక్రుద్దీన్, ఫ్రాన్సిస్, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.