ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలుగాకుండా కాపాడతాం
• ప్రభుత్వ ఆస్తుల రక్షణకు విశాఖ తరహాలో పోరాటం
విశాఖపట్నంలోని విలువైన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడమే ధ్యేయంగా పాలక పక్షం వ్యవహరిస్తోంది. తప్పుడు దస్తావేజులు సృష్టించో, దౌర్జన్యంగానో వైసీపీ వాళ్ళు కొల్లగొట్టేస్తుంటే బాధ్యతగల ప్రతిపక్షంగా జనసేన నిలువరిస్తుందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దసపల్లా భూములు వ్యవహారం నుంచి సీబీసీఎన్సీ చర్చి భూములు, ఏయూ – అటవీ శాఖ భూముల వరకూ జనసేన చేసిన పోరాటం ఫలితం ఇస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన సీబీసీఎన్సీ చర్చి భూములను, ఏయూ-అటవీ శాఖకు చెందిన భూములను ఆక్రమించుకొనేందుకు సిద్ధమైన పెద్దల వ్యవహారాన్ని బయటకు తీసి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడటం ద్వారా వాటిని రక్షించగలిగాం. రూ.వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు గుర్తు చేయగలిగాం. ఫలితంగా చర్చి భూముల్లో సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు ఏర్పాటు చేసుకోగలిగింది. దసపల్లా భూములతోపాటు, పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ ఋషికొండను నాశనం చేస్తూ నిర్మాణాలు చేయడంపై జనసేన పార్టీ కార్పొరేటర్ శ్రీ పీతల మూర్తి యాదవ్ న్యాయపోరాటం చేస్తున్నారు. చర్చి భూములకు రూ.62 కోట్ల విలువైన టి.డి.ఆర్.లు కేటాయించడంపై ఇప్పటికే విజిలెన్స్, ఏసీబీలకు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ విశాఖపట్నం నాయకులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు బలంగా పోరాడుతున్నారు. వీరందరికీ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి తరఫున అభినందనలు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడటం పాలకుల బాధ్యత. ప్రభుత్వ ఆస్తులకే రక్షణ లేకుండాపోతే ఇక ప్రజల ఆస్తులను ఎవరు కాపాడతారు? సీబీసీఎన్సీ చర్చి భూములకు సంబంధించి టి.డి.ఆర్.లు కేటాయించడంలో జీవీఎంసీ అధికారులు నిబంధనలు పాటించలేదు. అధికారులు సైతం చట్టానికి లోబడి పని చేయకపోతే ఇబ్బందుల పాలవుతారు. విలువైన ప్రభుత్వ స్థలాలను, భవనాలను తప్పుడు దస్తావేజులతోనో, మరో అక్రమ మార్గంలోనో ప్రభుత్వ పెద్దలు హక్కుభుక్తం చేసుకోవాలని ప్రయత్నిస్తే కచ్చితంగా జనసేన పార్టీ నిలువరిస్తుంది. విశాఖ తరహాలోనే న్యాయపోరాటం, ప్రజా పోరాటాలు చేసి ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలుగాకుండా రక్షిస్తాం అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.