రోడ్లు అధ్వానం- ప్రయాణం నరకం: జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: మండలంలోని పలు గ్రామాల మధ్య ఉన్న అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయని జనసేన నేత గురాన అయ్యలు ఆరోపించారు. రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా ఆదివారం సుంకరిపేట, దుప్పాడ చిల్లపేట రోడ్ల దుస్థితిని పరిశీలించారు. గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది పేరుతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ ప్రజలు గోతులు పడ్డ రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించి అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతున్నామన్నారు. పాడపోతున్న రోడ్లపై మరమ్మత్తులు చేయరా అంటూ పాలకులు, అధికారుల వైఖరిని తప్పుపట్టారు. ప్రమాదాలు జరిగితే కానీ స్పందించరా అంటూ ప్రశ్నించారు. వైకాపా పాలకులు కళ్ళకు గంతలు కట్టుకున్నారని, వాళ్లకు రోడ్లపై పడిన గుంతలు కనిపించడం లేదని విమర్శించారు. వైసీపీ పాలకుల కళ్లు తెరిపించేందుకే ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. జిల్లాలో పేరుకుపోయిన సమస్యలపై టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడి పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు. ప్రజావంచక ప్రభుత్వాన్ని సాగనంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కాటం అశ్విని, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, టి.రామకృష్ణ, ఏంటి రాజేష్, ఎల్. రవితేజ, అడబాల వేంకటేష్, దుప్పాడ నరేష్, ఎమ్. పవన్ కుమార్, అభిలాష్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.