సావిత్రిభాయి పూలే జీవితం ఆదర్శనీయం: నేరేళ్ళ సురేష్

గుంటూరు: కులమతాలకతీతంగా సమాజాన్ని ప్రేమించిన మహనీయురాలు, విద్య ద్వారా మాత్రమే స్త్రీకి విముక్తి లభిస్తుందని ప్రత్యేకంగా మహిళలకు విద్యాలయాన్ని స్థాపించిన ఉపాధ్యాయుని, రచయిత సావిత్రభాయి పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. మంగళవారం సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా పార్టీ నగర కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ సావిత్రిభాయి నిమ్న వర్గాల ప్రజల అభ్యున్నతికై జీవితాంతం పోరాడారని కొనియాడారు. మహిళలు ఎదురుకుంటున్న అన్ని వివక్షలకు చదువు ఒక్కటే పరిష్కారం అని నమ్మి మహిళలకు ప్రత్యేక విద్యాలయాలు స్థాపించిన మహోన్నతురాలు సావిత్రభాయి పూలే అన్నారు. భారతదేశ తొలి ఉపాధ్యాయునిగా ఆమె అందించిన సేవల్ని దేశం ఎప్పటికీ మరువదని నేరేళ్ళ సురేష్ అన్నారు. కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి మాట్లాడుతూ సావిత్రభాయి పూలే ఆధిపత్యవర్గాల వారిని ధిక్కరించి ఎన్నో అవమానాలకు గురైనా ఎక్కడా వెనకడుగు వేయకుండా స్త్రీ అభ్యున్నతికై తన జీవితాన్ని ఫణంగా పెట్టిన సావిత్రభాయి పూలేకి యావత్ మహిళాలోకం ఎప్పటికీ ఋణపడి ఉంటుందని పద్మావతి అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు కొండూరి కిషోర్, ప్రధాన కార్యదర్శిలు విజయలక్ష్మి, యడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉదయ్, ఆనంద్ సాగర్, నాగేంద్ర సింగ్, కొత్తకోట ప్రసాద్, గడదాసు అరుణ, పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.