నవోదయ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర విద్యా శాఖకు ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తిగల నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా స్కూళ్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా నవోదయ పాఠశాలలు ఉన్నాయి. ఈ స్కూళ్లలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE సిలబస్ ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాసం ఉంటుంది. నవోదయ విద్యాలయ సమితిలో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు తీవ్ర స్థాయిలో పోటీపడుతుంటారు. ప్రస్తుతం 6వ తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 15 చివరి తేదీ. నవోదయ స్కూళ్లలో అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://navodaya.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 15

పరీక్ష తేదీ- 2021 ఏప్రిల్ 10

ఫలితాల విడుదల- 2021 ఏప్రిల్ చివరి వారం

విద్యార్హతలు- 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం విద్యార్థులు 5వ తరగతి పాస్ కావాలి. విద్యార్థుల వయస్సు 9 నుంచి 13 ఏళ్ల లోపు ఉండాలి. గతంలో పరీక్ష రాసిన విద్యార్థి మళ్లీ ఎగ్జామ్ రాయడానికి అనుమతి లేదు. ఇక 9వ తరగతిలో అడ్మిషన్ కోసం 8వ తరగతి పాస్ కావాలి. విద్యార్థుల వయస్సు 13 నుంచి 16 ఏళ్ల లోపు ఉండాలి.

కోటా: 3వ, 4వ, 5వ తరగతి గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు రూరల్ కోటా వర్తిస్తుంది. 75 శాతం రూరల్ కోటా, 25 శాతం అర్బన్ కోటా ఉంటుంది. ఇక 57 శాతం బాలురు, 33 శాతం బాలికలకు సీట్లు కేటాయిస్తారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 638 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. మరో 23 నవోదయ విద్యాలయాలను ప్రకటించారు. దీంతో మొత్తం నవోదయ విద్యాలయాల సంఖ్య 661 కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 స్కూళ్లు ఉండగా మరో 2 స్కూళ్లు కేటాయించారు. ఇక తెలంగాణలో 9 నవోదయ స్కూళ్లు ఉన్నాయి. ప్రతీ జిల్లాకు ఓ నవోదయ విద్యాలయ ఉండటం విశేషం. తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్‌లో నవోదయ స్కూల్స్ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రెండు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, కర్నూలు, నల్గొండ, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలో నవోదయ స్కూళ్లు ఉన్నాయి.