రాష్ట్రంలో విజయవంతంగా జగనన్న సంక్షేమ పధకాల రద్దు పధకం

  • ప్రజలు వైసీపీ నేతల చొక్కాలు పట్టుకొని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారు
  • దుల్హన్ పధకం రద్దుతో రగిలిపోతున్న ముస్లిం మైనారిటీ వర్గ ప్రజలు.
  • సంక్షేమం పేరుతో చేసిన లక్షల కోట్లు ఎవరి జేబుల్లో దాక్కున్నాయో వైసీపీ నేతలు ప్రజలకి చెప్పాలి
  • అరాచక, అవినీతి పాలన చేస్తున్న వైసీపీ నేతలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు.
    *వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, మాది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఏమో కానీ ప్రజల జీవితాలలో సంక్షోభం మాత్రం ఏర్పడిందని, రాష్ట్రంలో జగనన్న సంక్షేమ పథకాల రద్దు పధకం విజయవంతంగా అమలవుతుందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఒకేఒక లక్ష్యంతో ఎన్నికలకు ముందు అలవికానీ హామీలతో అన్ని వర్గాల ప్రజల్ని జగన్ రెడ్డి మోసం చేసారని మండిపడ్డారు. ఇంటికి పెద్ద కొడుకుగా అండగా ఉంటానని, పిల్లలకు మేనమామనవుతానని నాడు చెప్పిన మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. తన అసమర్ధ అవినీతి పరిపాలనతో ఒక్కో సంక్షేమ పథకాన్ని జగన్ రెడ్డి అటకెక్కిస్తున్నాడని విమర్శించారు. ముస్లిం అడబిడ్డల పెళ్లికి గత ప్రభుత్వం ఇచ్చే యాభైవేలు కాకుండా వైయస్సార్ దుల్హన్ పధకం పేరుతో లక్ష రూపాయలు ఇస్తానని ముస్లిం మైనారిటీలకు మాట ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. మూడేళ్ళుగా ఆ పథకాన్ని అమలు చేయకపోగా ఇప్పుడు అసలు ఆ పథకాన్ని ఏకంగా రద్దు చేస్తున్నామని చెప్పటం ముస్లిం, మైనారిటీలను మోసం చేయటమేనని దుయ్యబట్టారు. అమ్మఒడి, చేయూత, ఆసరా లాంటి పథకాల్లో రోజుకో నిభందన పేరుతో పేదవారికి, అర్హులైన వారికి పధకాలను దూరం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అమలుపరచలేం అంటూ చేతులెత్తేసిన ప్రభుత్వం మరి మూడేళ్ళుగా సంక్షేమం పేరుతో చేసిన లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరారు. ప్రజలు ఏమరుపాటుగా ఉంటే మరలా మరిన్ని మాయ మాటలతో, సానుభూతి వచనాలతో మరలా మోసం చేసే అవకాశం ఉందని గాదె వెంకటేశ్వరరావు అన్నారు.

జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ…
ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివాని , వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అనే కంటిని పూర్తిగా గుడ్డిదాన్నిగా మార్చారని విమర్శించారు. సంక్షేమం అనే మరో కంటిని సైతం వివిధ నిబంధనలు విధించి లక్షలాదిమంది పేదలకు సంక్షేమాన్ని దూరం చేస్తూ ఆ కంటిని కూడా మసకబారేలా చేశారన్నారు. రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోని పవిత్రమైన ఖురాన్ , బైబిల్ , భగవద్గీతలా భావించాలని నీతులు చెప్పిన వైసీపీ నేతలు మ్యానిఫెస్టోలోని ఒక్కో పథకానికి తిలోదకాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా, చెప్పిన మాట మీద నిలబడకపోయినా ప్రజలు ఆ రాజకీయ నాయకుడి చొక్కా పట్టుకునే రోజులు రావాలని నాడు ప్రతిపక్ష నేతగా జగన్ రెడ్డి సెలవిచ్చారని, మరి ఇప్పుడు ప్రజలు ఎవరి చొక్కాలు పట్టుకొని నిలదియ్యాలని వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటిముందుకి వస్తున్న వైసీపీ నేతల్ని ముస్లిం, మైనారిటీ ప్రజలు ఎన్నికల సమయంలో మాకిచ్చిన హామీలను ఈ మూడేళ్ళుగా ఎందుకు అమలుపచలేదని గట్టిగా నిలదియ్యాలని కోరారు. గత ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితులను సైతం వైసీపీ ప్రభుత్వం దగా చేసిందన్నారు. యస్సి ఎస్టీ ప్రజల అభ్యున్నతికి, పేద విద్యార్థుల ఉన్నతమైన విద్యకి, యువత ఉపాధికి గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచిన సుమారు 26 పధకాలను ఈ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలి అంటే గత చరిత్ర చూస్తారని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దిగమింగిన వ్యక్తిని, 36 ఆర్ధిక నేరాల్లో అభియోగాలు ఎదురుకుంటున్న వ్యక్తిని, 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే పరిపాలన ఇలా దుర్మార్గంగా కాకుండా సుభిక్షంగా ఎలా ఉంటుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, జనసేన పార్టీ సిద్దాంతాలనూ ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు జనసేనను ఆశీర్వధించనున్నారని ఆళ్ళ హరి అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, నగర కార్యదర్శి షేక్ ఆసియా, మైనారీటీ నాయకులు మధులాల్, షర్ఫుద్దీన్, శిఖా బాలు తదితరులు పాల్గొన్నారు.