విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వైసీపీ ఎంపీలపై మరింత ఎక్కువ

భారత దేశంలో ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదిక మన పార్లమెంటు. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీలు, ముఖ్యంగా వైసీపీ సభ్యులను రాష్ట్ర ప్రజల తరఫున ఒక్కటే కోరుతున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలి.. ప్రయివేటీకరణ కాకుండా నిలువరించాలి అని. ఈ బాధ్యత వైసీపీ ఎంపీలపై మరింత ఎక్కువగా ఉంది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మీరంతా పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంటుని కాపాడుకునేందుకు పోరాటం చేయాలి. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో మంది త్యాగాలు చేసి ఏ విధంగా పోరాడారో ఆదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పార్టీ తరఫున మూడు రోజులపాటు డిజిటల్ క్యాంపెయిన్ శనివారం ప్రారంభించాం. రాష్ట్రం నుంచి రాజ్యసభ, లోక్ సభలకు వెళ్ళిన పార్లమెంటు సభ్యులకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. దాన్ని గుర్తు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మా వీర మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే భావోద్వేగ నినాదాన్ని మరోసారి పలుకుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, మా పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు చేపడుతున్న ఆందోళనను పార్లమెంటులో మీ గళం రూపంలో వ్యక్తపరచాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం అని శ్రీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.