వైసీపీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోంది

• విలువలు లేని సంక్షేమం వినాశనానికి దారి తీస్తుంది
• రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు
• ప్రతి ఒక్కరి తలపై రూ.లక్ష అప్పు ఉంది
• జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. సంక్షేమం పేరుతో విలువల్లేని పాలన జరుగుతోంది, విలువలు లేని సంక్షేమం వినాశనానికి దారి తీస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తూ ప్రజల్ని కోలుకోలేని దెబ్బ కొడుతుందని అన్నారు. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ మంళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ “మొదటి నుంచి జనసేన పార్టీ ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంది. ప్రతి అడుగులోనూ అది కనిపిస్తుంది. ఉన్నత ఆశయాలతోనే పార్టీ ఆవిర్భావ సభకు దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని నామకరణం చేశాం. అతి తక్కువ వయసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అద్భుతమైన ఆలోచనపరుడు శ్రీ దామోదరం సంజీవయ్య . మనకు తాగు, సాగు, కరెంట్ ను పుష్కలంగా ఇస్తున్న శ్రీశైలం ప్రాజెక్ట్ ఆయన హయాంలోనే మొదలైంది. ఇలా ఎన్నో ప్రజా అభ్యున్నతి ఆలోచనలు చేశారు. నీతిగా, నిజాయతీతో ఎలా పాలించవచ్చో దామోదరం సంజీవయ్య గారిని చూసి నేటి పాలకులు నేర్చుకోవాలి.
* సమష్టిగా కృషి చేస్తే అధికారం మనదే
జనసైనికులు పార్టీ ఉన్నతి కోసం ఇప్పుడు ఎంత కష్టపడ్డారో దానికి మూడింతలు భవిష్యత్ లో కష్టపడాల్సింది ఉంది. దీని కోసం పార్టీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. 2024 లో కచ్చితంగా జనసేన పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంతా సమిష్టిగా కృషి చేయాలి. సంక్షేమం పేరుతో విలువల్లేని పాలన ఎలా జరుగుతోందో యువత గుర్తించాలి. వచ్చే వినాశనాన్ని అర్ధం చేసుకోవాలి. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. దాదాపు రూ.7 లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరిపై లక్షల రూపాయల అప్పు ఉందని గ్రహించండి. నీతి, నిజాయతీ కలిగిన జనసేన పార్టీకి అండగా నిలబడండి.
* జనసైనికులకు సాంకేతిక “అస్త్రం”
చిరు ప్రయాణంగా మొదలైన జనసేన పార్టీ ప్రయాణం 2 లక్షలకు పైగా క్రీయాశీల సభ్యులతో పెద్ద వ్యవస్థగా మారింది. క్రియాశీలక సభ్యులంతా వచ్చే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీ కోసం పని చేయాలి. వారికీ పార్టీ విడతల వారీగా శిక్షణ ఇస్తుంది. దీని కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి శ్రేణులకు తెలియజేస్తాం. పార్టీ క్రీయాశీల సభ్యుల కోసం “అస్త్ర” అనే యాప్ రూపొందించాం. కమ్యూనికేషన్ మరింత మెరుగు పరిచేందుకు ఈ సాంకేతిక అస్త్రం ఉపయోగపడుతుంది. మీరు పార్టీ కోసం చేసే ప్రతి కార్యక్రమం ఈ యాప్ లో నమోదు చేయండి. అలాగే పార్టీ చేసే అన్నీ కార్యక్రమాలు, ఇతర సమాచారాలు మీకు యాప్ లో అందుతాయి. క్రీయాశీల సభ్యులంతా యాప్ లో సమాచార మార్పిడికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ సభ కార్యక్రమం కోసం నెల రోజులుగా పార్టీ శ్రేణులు తపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఆయన బృందం.. వారితోపాటు 12 కమిటీల్లోని సభ్యులకు అభినందనలు.
* విష ప్రచారం మొదలైంది జాగ్రత్త
గత ఎన్నికల్లో జనసేన పార్టీపై ఎంతటి విషయాప్రచారం జరిగిందో.. ఎవరు చేసారో అందరికీ తెలిసిందే. మళ్ళీ రకరకాల పేర్లతో విషప్రచారం చేసేందుకు బృందాలు రెడీ అయ్యాయి.. దీనిని గుర్తించండి. వారు ఈ సారి రకరకాల మార్గాలను అనుసరిస్తారు. అసలే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత తో కొత్త దారులు తొక్కుతారు. జనసైనికులు ఈ విషయంలో జాగ్రత్త గా ఉండండి. దానిని తిప్పికొట్టేలా మన ప్రణాళిక ఉండాలి తప్పుతే దానిలో ఇరుక్కుపోయేలా ఉండకూడదు. ఇంతటి అభిమానం సంపాదించడం చిన్న విషయం కాదు. అది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కే సొంతం. ఆయన నాయకత్వం లో 2024 లో రాష్ట్రానికి సరికొత్త భవిష్యత్ సౌధాలు నిర్మించాలి. ఈ యజ్ఞం లో ప్రతి జనసైనికుడు ఒక గొప్ప పోరాట యోధుడిగా నిలిచిపోవాలి. ఐక్యత గా ఉందాం. కలిసికట్టుగా పోరాడుదామని” అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ పి.ఎ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, వివిధ విభాగాల చైర్మన్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, నియోజక వర్గాల ఇంఛార్జులు, పార్టీ తెలంగాణ ప్రతినిధులు ఈ వేదికపై వున్నారు.