ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడమే వీళ్లకు తెలుసు

•హైకోర్టుతో మొట్టికాయలు తిన్నవారు కూడా రంగుల గురించి మాట్లాడడం విడ్డూరం
•నిబంధనల ప్రకారమే వారాహి వాహనానికి రంగులు

•ఏపీఎస్ఆర్టీసీని వైసీపీఆర్టీసీగా మార్చేశారు
•పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలిస్తూ ప్రయాణికులను అవస్థల పాల్జేస్తున్నారు
•ఉత్తరాంధ్ర సంక్షేమం జనసేన పార్టీ బాధ్యత
•వైసీపీ కుట్రలను సాంకేతిక సహాయంతో అడ్డుకోవాలి
•విశాఖలో జనసేన ఐటీ విభాగం ప్రతినిధులతో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

హైకోర్టుతో లెక్కకు మించి మొట్టికాయలు వేయించుకున్న వారు కూడా నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యాత్రకు సంబంధించిన వారాహి వాహనం రంగులపై వైసీపీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ మూర్ఖత్వాన్ని తెలియచేస్తోంది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకొంటోంది… శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిబంధనలకు లోబడి నిర్ణయాలు తీసుకుంటారు అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం ప్రజల డబ్బుతో వైసీపీ పార్టీ రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయి? ఆ పార్టీ నాయకుల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమన్నారు. గురువారం రాత్రి విశాఖపట్నంలో జనసేన ఐటీ విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పర్యటన రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. వైసీపీ అభద్రతాభావంతో వారాహి వాహనం గురించి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా జనసేన పార్టీ సాంకేతిక సైన్యం పనిచేయాలి. పాలనలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 30 చెరువుల నీళ్లు తాగించిన ఈ వైసీపీ ప్రభుత్వ దుర్నీతిని ఏమాత్రం భయపడకుండా జనం దగ్గరకు చేరవేయాలి. ప్రజలను జాగృతం చేసే బాధ్యతను తీసుకోండి. రాజకీయంగా పూర్తి చైతన్యవంతులై వచ్చే ఏడాది పాటు జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు చేరేవేసేలా పని చేయండి. వైసీపీ నాయకులకు వ్యక్తిగత విమర్శలు చేయడం వాళ్ళ సంస్కృతిలో భాగం. అలాంటివారికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చెప్పు చూపిస్తే భయపడ్డారు. ఉలిక్కి పడ్డారు. అది నిజాయతీకి ఉన్న దమ్ము. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిద్దాం.
•ఉత్తరాంధ్ర అభివృద్ధిని జనసేన బాధ్యతగా తీసుకుంటుంది
ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిపై జనసేన పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ప్రాంత అభివృద్ధిని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతగా తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ యువత కోసం త్వరలోనే చేపట్టబోయే పెద్ద కార్యక్రమం గురించి శుక్రవారం ప్రకటిస్తాం. ఈ ప్రాంతంలో చిన్న సెంటర్ పెడతామని ముందుకు వచ్చిన ఇన్ఫోసిస్ లాంటి సంస్థకు సైతం ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఉత్తరాంధ్రలో ఖాళీగా ఉన్న ఐటీ టవర్లను చూసి మురిసిపోవడం తప్ప, ఒక కంపెనీని కూడా ఈ ప్రభుత్వం తీసుకురాలేకపోతోంది. ఉత్తరాంధ్రలో ఖాళీగా ఉన్న ప్రతి ఐటీ టవర్ కళకళలాడే స్థితిని జనసేన పార్టీ తీసుకొస్తుంది. ఉత్తరాంధ్ర యువత కోసం ఒక ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను త్వరలోనే పార్టీ తరఫున ప్రారంభిస్తాం. ఉత్తరాంధ్ర నుంచి భారీగా జీవన భృతి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వలసలను నిరోధించే బాధ్యతను పార్టీ తరఫున స్వీకరిస్తాం. వలసలను నిరోధించేందుకు యువతకు ఉద్యోగ, ఉపాధి చూపించేలా కచ్చితంగా జనసేన పార్టీ ప్రణాళిక ఉంటుంది. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ కాస్త వైసీపీ ఆర్టీసీగా మారిపోయింది. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ బస్సులు వాడుకోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అడిగిన వారిని కేసులతో వేధిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. 14 ఎకరాలు కబ్జా చేస్తున్న వారిని ప్రశ్నించిన అనంతపురం జిల్లా జనసైనికుడు శ్రీ సురేష్ మీద దాడికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ దాష్టికాలకు బలైపోయిన సామాన్య ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తమకు భరోసాగా నిలుస్తారని బలంగా నమ్ముతున్నారు. ఇటీవల అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను పరామర్శించడానికి నేను వెళ్ళినప్పుడు.. జనసేన పార్టీ పర్యటన ఉందని తెలిసి బాధితుల అకౌంట్లో అప్పటికప్పుడు డబ్బులు వేశారు. బాధితులు సైతం మరోసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తమ ప్రాంతంలో పర్యటిస్తే తమ అందరికీ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుందని కోరుకుంటున్నారు అంటే అది ప్రజలకు మన మీద ఉన్న నమ్మకం. ప్రభుత్వం మీద బలంగా పోరాడే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని ప్రజల భావిస్తున్నారు. బలమైన ఆశయానికి, ప్రజల పట్ల ప్రేమ ఉన్న నాయకుడికి ఉన్న బలం అదే. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజా బలం ఉంది దానిని మనం మరింత సమర్థంగా ప్రజలకు తెలియజెప్పాలి.
•సమర్థంగా… సమష్టిగా ముందుకు వెళ్దాం
వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు చెప్పడంతో పాటు ప్రజలకు అర్థమయ్యే విధంగా సాంకేతిక సైన్యం పనిచేయాలి. వైసీపీ మూర్ఖుల మాటలకు తలొగ్గకుండా, ప్రతి విషయాన్ని ప్రజలకు చేరువయ్యేలా పని చేద్దాం. రాజకీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి శత్రువుతో పోరాడుదాం. పార్టీ సిద్ధాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి పాలన కోసం క్షేత్రస్థాయిలో ఎందరో త్యాగాలు చేసి పోరాడుతున్నారు. భారతదేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తలు ప్రమాదవశాత్తూ చనిపోతే వారిని రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకున్న పరిస్థితి లేదు. ఆ బాధ్యతను జనసేన తీసుకొంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా నిలబడింది లేదు. జనసేన పార్టీ ప్రజా సంక్షేమంతో పాటు కార్యకర్తల సంక్షేమాన్ని కూడా గుర్తిస్తుంది” అన్నారు.
•పార్టీ బలోపేతంపై వరుస సమావేశాలు
అంతకు ముందు పార్టీ బలోపేతంపై విశాఖపట్నం నాయకులతో శ్రీ మనోహర్ గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర కీలక నేతలకు తగిన దిశా నిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రజలలో నిత్యం ఉంటూ వారి సమస్యల మీద పోరాడే విషయంలో శ్రీ మనోహర్ గారు నాయకులకు తగిన విధంగా సూచనలు చేశారు. ప్రణాళికబద్ధంగా ఎన్నికలకు సిద్ధం కావాలని, యువతను పూర్తిస్థాయి సైనికులుగా మార్చి ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఉందని నాయకులకు గుర్తు చేశారు. ప్రజల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు వారి తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. పార్టీకి సంబంధించిన కీలక నాయకులతోపాటు జీవీఎంసీ కార్పొరేటర్లతో, వీర మహిళలతో శ్రీ మనోహర్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సమావేశాల్లో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి.శివశంకర్, పార్టీ నాయకులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కరరావు, శ్రీ పంచకర్ల సందీప్, శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్, శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు, శ్రీ వంపూరు గంగులయ్య, వీర మహిళలు శ్రీమతి తుమ్మి లక్ష్మిరాజ్ , శ్రీమతి ఎం.నాగలక్ష్మి, శ్రీమతి త్రివేణి, శ్రీమతి శరణి దేవి, శ్రీమతి కిరణ్ ప్రసాద్, శ్రీ పీతల మూర్తి యాదవ్, శ్రీ దల్లి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.