గ్రామ స్వరాజ్యం గంగలొ కలిసే…. !

* సర్పంచుల అధికారాలకు కత్తెర
* పల్లెసీమల్లో నడుస్తున్న సమాంతర వ్యవస్థ
* మితిమీరిన ఎమ్మెల్యేల పెత్తనం

చెప్పింది చేయకపోవడం వంచన…
అలా చేయకపోగా చేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం నయవంచన…
వైకాపా ప్రభుత్వం పని తీరు అచ్చం అలాగే ఉంది…
ఇది పంచాయితీల విషయంలో మరింత సుస్పష్టం!
అదెలాగో తెలుసుకోవాలంటే… వివరాల్లోకి వెళ్లక్కర్లేదు…
ఏ గ్రామంలో సర్పంచ్‌ను కదిలించినా చాలు…
ఎందుకంటే…. ఇప్పుడు సర్పంచ్‌ ఓ అనామకుడు!
ఎలాంటి అధికారాలూ లేని ఓ అమాయకుడు!
అతడిని పట్టించుకునే వారు ఉండరు…
పట్టించుకున్నా అతడి మాటకు విలువ ఉండదు…
సర్పంచ్‌కి తెలియకుండానే కీలకమైన నిర్ణయాలు అమలవుతుంటాయి…
కనీసం సమాచారం లేకుండానే పనులు జరిగిపోతుంటాయి…
ఆఖరికి కార్యాలయంలో ఎవరు ఎప్పుడు సెలవులో ఉన్నారో తెలియని దుస్థితి!
ఇక పంచాయితీ ఆదాయం, నిధుల గురించి చెప్పేదేముంది?
ఏ నిధులు ఎప్పుడు మాయమవుతాయో తెలియదు!
ఏ కాసులు ఏ కాతాల్లోకి జమవుతాయో అర్థం కాదు!!
వెరశి… సర్పంచ్‌ అంటే ఓ ఉత్సవ విగ్రహం!!!
పరిస్థితి ఇలా ఉంటే… ‘స్థానిక సంస్థలను పరిపుష్ఠం చేయడమే మా ధ్యేయం’, ‘పంచాయితీలను పటిష్ఠం చేయడమే మా లక్ష్యం’, ‘అధికార వికేంద్రీకరణే మా ఆశయం’… అంటూ వైకాపా ప్రచారం మాత్రం హోరెత్తుతోంది.
చెప్పేదొకటీ, చేసేదొకటిగా ఉన్న ఈ నయా నయవంచన తీరుతెన్నులు చూడాలంటే గ్రామస్థాయి పరిస్థితుల్లోకి ప్రయాణం చేయాలి.
* పాపం… సర్పంచులు!
ప్రతి పంచాయితీలోనూ సర్పంచులు ఉన్నారు. కానీ జగన్‌ ప్రభుత్వం విధానాల వల్ల వాళ్లకు చేతులు కట్టేసినట్టు అవుతోంది. గ్రామాల్లో సమస్యలు కళ్ల ముందే కనిపిస్తూ ఉంటాయి. కానీ పరిష్కరించలేరు. గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తారు. అవి అమలయ్యే పరిస్థితులు లేవు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు ఉంటారు. అయితే ఎవరికీ ఏమీ చెప్పలేని దుస్థితి. ఒకవేళ చెప్పినా ఎవరూ వినరు. కారణం… పంచాయితీలకు ఉండే అధికారాలను ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఒకొటొకటిగా కైవసం చేసుకుంటోంది. పేరుకు సర్పంచులున్నా పంచాయితీలపై ఎమ్మెల్యేల పెత్తనమే కొనసాగుతోంది. ఇక పంచాయితీలకు వేర్వేరు పద్దుల కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా సరిగా విడుదల కావు. కేంద్ర పథకాల ద్వారా నేరుగా వచ్చే నిధులు సైతం ఎప్పుడు ఏ పద్దు కింద మాయమవుతాయో తెలియని పరిస్థితి. అలాగే ఏ విద్యుత్‌ ఛార్జీల బకాయిల కిందనో ప్రభుత్వం ఆ నిధులను జమ చేసుకున్నా ఏమీ చేయలేని దయనీయ స్థితి. రాష్ట్రంలో 2021 ఫిబ్రవరి 21న పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో బాధ్యతలు చేపట్టిన సర్పంచులు ఈ రెండేళ్లలో ఏమీ చేయలేని, ఎటూ చెప్పలేని దుస్థితిలో పడిపోయారు.
* సమాంతర వ్యవస్థతో తంటాలు
నిజానికి పంచాయితీలకు పూర్తి అధికారాలు ధఖలు పరచాలని భారత రాజ్యాంగంలోని 73వ సవరణ స్పష్టంగా చెబుతోంది. కానీ అందుకు జగన్‌ ప్రభుత్వం సుముఖంగా లేదని దాని వ్యవహారశైలే చెబుతోంది. సంక్షేమ కార్యక్రమాల నుంచి అభివృద్ధి పనుల వరకు అన్ని పనులు సర్పంచులకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. ఎందుకంటే పంచాయితీల వ్యవస్థకు సమాంతరంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను జగన్‌ ప్రభుత్వం నెలకొల్పింది. ఆ సచివాలయాల్లో ఉద్యోగులను, వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. ఈ సచివాలయాలు 2019 నుంచి పనిచేయడం ప్రారంభించాయి.
”గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడానికే సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. ఇది కూడా పంచాయితీలో భాగమే, సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు పంచాయితీల పర్యవేక్షణ, నియంత్రణలో సేవలందిస్తారు” అంటూ జగన్‌ ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. అలాగే సచివాలయాల ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసే అధికారాలను తొలుత సర్పంచులకే ఇస్తూ జీవో కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం నిజస్వరూపం బయటపడింది. మొదట్లో చెప్పినదానికి భిన్నంగా వ్యవహరించడం కనిపించింది. సచివాలయాలపై సర్పంచులకు పర్యవేక్షణ, నియంత్రణలను తొలగించింది. ఉద్యోగులకు సెలవులు ఇచ్చే అధికారాలను సైతం తీసేసింది. దాంతో ఏ ఉద్యోగి ఎప్పుడు సెలువులో ఉంటాడో తెలియని అయోమయ స్థితిలో సర్పంచులు పడిపోయారు. సచివాలయాలను నేరుగా పర్యవేక్షించేలా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేరుతో పూర్తిగా కొత్త శాఖను సృష్టించింది. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు వంతున వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. వీరిపై కూడా సచివాలయాల పెత్తనమే ఉంటోంది. ఇటు ఉద్యోగుల పైన, అటు వాలంటీర్లపైన కూడా సర్పంచుల పర్యవేక్షణ కానీ, నియంత్రణ కానీ లేని పరిస్థితి ప్రతి గ్రామంలో నెలకొంది. దాంతో పంచాయితీల్లో సర్పంచులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు.
* పాలన లేని పాలక వర్గం
పంచాయితీల ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలతో పని లేకుండా జరుగుతాయి. స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తులు, గ్రామ ప్రజలకు ఏదో చేయాలనే ఆకాంక్ష ఉన్న వారు, గ్రామస్థులలో పలుకుబడి, మంచి పేరు ఉన్న వాళ్లు రాజకీయాలకు అతీతంగా పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. వారి గెలుపు కూడా ఆయా గ్రామాల్లో ఉండే పరిస్థితులకు అనుగుణంగానే జరుగుతుంది. అందుకనే సర్పంచులు కానీ, పాలక వర్గ సభ్యులు కానీ పార్టీలకు అతీతంగానే ఎన్నికవుతారు. ఆయా వ్యక్తులు ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతుదారులయితే అవుతారు కానీ పంచాయితీ స్థాయిలో ఆ రాజకీయాల ప్రభావం పెద్దగా పైకి కనిపించదు. సర్పంచు సహా పాలక వర్గ సభ్యులంతా తమ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి స్థానిక సమస్యల పరిష్కరానికి ఏకాభిప్రాయంతో పనిచేయాల్సి వస్తుంది. గ్రామంలో ఉండే ప్రతి కుటుంబం స్థితిగతులు, అవసరాలు పాలక వర్గానికే తెలుస్తాయి. అయితే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల నియామకం, ఉద్యోగులు కేటాయింపు, వారిపై ఎలాంటి పర్యవేక్షణ లేని పరిస్థితుల మధ్య పంచాయితీ పాలక వర్గం ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది. ఆఖరికి గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు, లబ్దిదారుల ఎంపిక కూడా పంచాయితీ సర్పంచులకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. నిజానికి సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపిక కమిటీకి సర్పంచే ఛైర్మన్‌. అయితే ఆయన ప్రమేయం లేకుండానే గ్రామ సచివాలయంలోని సంక్షేమ కార్యదర్శి, వాలంటీర్లే లబ్దిదారులను ఎంపిక చేసేస్తున్నారు. ఇక సర్పంచులు విపక్షాల మద్దతుతో గెలిచిన వారయితే వాళ్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇక వ్యవసాయం, పశుసంవర్థక, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పంచాయితీలు, సర్పంచులకు భాగస్వామ్యం లేదు. ఇవన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరిగిపోతున్నాయి.
*నిధులు సైతం హుళక్కే
కేంద్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘాలు పంచాయితీల పరిపుష్ఠికి ఎన్ని నిధులు కేటాయించాలో ప్రభుత్వాలకు సిఫార్సు చేస్తుంటాయి. అలా రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2020 నాటి సిఫార్సుల నివేదిక ఇప్పటికి కూడా వెలుగు చూడకపోవడం ఇందుకు తార్కాణం. పంచాయితీల పరిధిలో వృత్తి పన్ను, తలసరి ఆదాయం, సీనరేజి, స్టాంపు డ్యూటీ కింద పంచాయితీల వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఆ నిధులను కేటాయించడంలో సైతం జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇక కేంద్రం ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు నేరుగా కొన్ని నిధులను విడుదల చేస్తుంటుంది. అయితే అలా పంచాయితీల ఖాతాల్లోకి పడిన కేంద్ర నిధులను సైతం జగన్‌ ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద మళ్లిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలా 14, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు రూ. 1245 కోట్లను పంచాయితీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే కేంద్రం రెండు విడతలుగా పంచాయితీలకు విడుదల చేసిన రూ. 948 కోట్లను పంచాయితీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్టే చేసి, తిరిగి విద్యుత్‌ ఛార్జీల బకాయిల కింద చెల్లించాలంటూ మళ్లించింది. దాంతో ఆఖరికి గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలను కూడా సర్పంచులు చేపట్టలేని దుస్థితి నెలకొంది. అంతేకాదు కొన్ని పంచాయితీల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలు సైతం చెల్లించలేని దారుణ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని అత్యవసర పనులను సర్పంచులే సొంత నిధులు వెచ్చించి పూర్తి చేసి బిల్లులు పెట్టుకున్నా వాటిని చెల్లించడంలో సైతం తీవ్రమైన జాప్యం ఎదురవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పంచాయితీల సర్పంచులు బాహాటంగానే నిరసనలకు దిగుతున్నారు. సర్పంచులే ఇళ్లకు వచ్చి చెత్త సేకరించడం, వీధుల్లో బిచ్చమెత్తుకోవడం, మండల సమావేశాలను బహిష్కరించడం, ప్రదర్శనలు చేయడం లాంటి వేర్వేరు రీతుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పైకి ‘గ్రామ స్వరాజ్యం’ అంటూ ప్రచారం చేసుకుంటూ, లోపాయికారీగా పంచాయితీల పాలన వ్యవస్థను స్వప్రయోజనాల కోసం అస్తవ్యస్తం చేస్తున్న జగన్‌ ప్రభుత్వం తీరు… నయవంచన కాక మరేమిటి?