జగనన్న కాల”నీళ్లు” – పేదలకు “కన్నీళ్లు”

  • జగనన్న కాలనీల మాటున భూ దందా
  • జగనన్న కాలనీలపై చర్చకు సిద్దమా?
  • వైసిపి నాయకులకు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సవాల్

తిరుపతి, పేదల కాలనీలలో కన్నీళ్లు మిగిల్చి వైసిపి నాయకులు మాత్రం కోట్లు దండుకున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోళ్ల సొంతింటి కలమాటున వైసిపి పెద్దలు తమ ఇంటిని చక్కబెట్టుకున్నారని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు చెరువులను తలపిస్తున్నాయన్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. కొండలు, గుట్టలు చదును చేసి ఇంటి స్థలాలు కేటాయించారన్నారు. అక్కడ ఇళ్లు కట్టుకోలేక చిత్తూరు జిల్లాలో దాదాపు ఆరువేల మందికి పైచిలుకు అనాసక్తత చూపుతున్నారన్నారు. మరో పక్క జగనన్న కాలనీలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందన్నారు. భూ సేకరణ పేరుతో ప్రభుత్వాన్ని మోసం చేసి వైసిపి నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతిపై జోగి రమేష్ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న కాలనీల్లో పేదల కన్నీళ్లను ప్రపంచానికి చాటడమే కాకుండా జరిగిన అవినీతిపై జనసేన పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహిస్తోందన్నారు. ఈ క్యాంపెయిన్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని వైసిపి అరాచకాలను బయటపెట్టాలని ఆయన ఆ పత్రికా ప్రకటనలో కోరారు.