ప్రతి మత్స్యకార సొసైటీకి ఒక కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేయాలి

* సముద్ర తీర ప్రాంతాల్లో నీటి కాలుష్యం అరికట్టాలి
* జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు

మత్స్య సంపదను భద్రపరచుకోవడానికి మత్స్యకారులకు ప్రతీ సొసైటీకి ఒక కోల్డ్ స్టోరేజిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. ప్రాణాలకు తెగించి సంపాదించుకుంటున్న మత్స్య సంపదను కాపాడుకోవటానికి మత్స్యకారులు చాలా ఇబ్బందులకు గురి కావల్సి వస్తోందని, మత్స్య సంపదను దాచుకొవటానికి సరైన వసతులు లేక ఒకటి, రెండు రోజుల కన్నా ఎక్కువకాలం తమ వద్ద ఉంటే చేపలు దెబ్బ తింటాయనే భయంతో తక్కువ రేటుకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటు చేసినట్లయితే కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకొని ఆశించిన ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చనే ధైర్యాన్ని మత్స్యకారుల్లో నింపవచ్చని పేర్కొన్నారు. మత్స్యకారుల కనీస అవసరాలను ఇప్పుడున్న వై.సీ.పీ. ప్రభుత్వం విస్మరిస్తే జనసేన పార్టీ అధికారంలోకి రాగానే మత్స్యకారుల కోసం ప్రతీ సొసైటీకి ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పలు కర్మాగారాల్లోని కలుషిత నీరు సముద్ర తీర ప్రాంతాల్లోకి మళ్ళించడం ద్వారా తీర ప్రాంతంలోని జీవరాశులు దెబ్బ తింటున్నాయని, దాని వలన తీర ప్రాంతాల్లో మత్స్య సంపద కరవై కిలోమీటర్ల మేర లోతుకు మత్స్యకారులు పోవడం వలన ప్రాణాల మీదకు వస్తోందని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న నాగబాబు గారిని ఉత్తరాంధ్ర మత్స్యకార సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూలంకషంగా చర్చించారు.
* జనసేనలో భారీగా చేరికలు
జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితులై శుక్రవారం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జనసేనలో చేరారు. రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో నాగబాబు జనసేన పార్టీ కండువ కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా పని చెయ్యాలని వారికి సూచించారు.
* వివిధ వర్గాల ప్రతినిధుల భేటీ
కొణిదెల నాగబాబు పర్యటిస్తున్న సంగతి తెలుసుకొని ఉభయ గోదావరి జిల్లాల్లోని వైద్యులు, లాయర్లు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, కులవృత్తి సంఘాల నాయకులు, వ్యాపారస్తులు, ఆయా సామాజిక సంఘాల, స్వచ్చంద సంస్థల నాయకులు వచ్చి కలుస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్తితుల్లో జనసేన పార్టీకి రాజ్యాధికారం అప్పచెప్పడం తప్ప వేరే మార్గం లేదనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు.