అత్యున్నత పీఠానికి అన్ని అర్హతలతో….!

భారత పదిహేనో రాష్ట్రపతిగా భారీ మెజారిటీతో ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము కారణజన్మురాలు. ఆదివాసీ మహిళను మొట్టమొదటిసారిగా అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికయ్యేలా చూసిన ప్రధాని నరేంద్ర మోదీ అభినందనీయులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జన్మించిన భారత తొలి రాష్ట్రపతిగా 64 సంవత్సరాల శ్రీమతి ద్రౌపది చరిత్రకెక్కుతున్నారు. అలాగే మిగిలిన దేశ ప్రథమ పౌరులతో పోల్చితే తక్కువ వయసులో రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన తెలుగు నేత శ్రీ నీలం సంజీవరెడ్డి కన్నా కొన్ని నెలల తక్కువ వయసులో శ్రీమతి ద్రౌపది దేశ అత్యున్నత పీఠమెక్కుతుండడం మరో కొత్త రికార్డు. సాధారణ ఒడియా ఆదివాసీ కుటుంబంలో పుట్టిన ఆమె ఆరు పదులు నిండిన తర్వాత రాష్ట్రపతి అవుతానని ఊహించలేదు. అయితే, ఆమె అకుంఠిత దీక్ష, పట్టుదల, అంకితభావంతో ప్రజాజీవితంలో చేసిన సేవలే దేశ రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యేలా చేశాయి. ఆమె భారత పార్లమెంటు ఉభయసభలకు ఎన్నిక కాలేదు. ఒడిశా అసెంబ్లీకి రెండుసార్లు మాత్రమే ఎన్నికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండేళ్లు మత్స్య, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర హోదా) 2002–2004 మధ్య ఆమె పనిచేశారు. అంతకు మించి కేబినెట్‌ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. కాని సొంత రాష్ట్రానికి పొరుగున ఉన్న ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఆరు సంవత్సరాల విశిష్ఠ అనుభవం శ్రీమతి ద్రౌపదిని న్యూఢిల్లీ రైసినా హిల్‌పై ఉన్న రాష్ట్రపతి భవన్‌లో ఐదు సంవత్సరాలు ఉండడానికి అన్ని విధాలా అర్హురాలిని చేసింది.
*కీలు బొమ్మలా లేరు….కీలకంగా వ్యవహరించారు
రాజకీయాల్లోకి రాక ముందు శ్రీమతి ద్రౌపది సాధారణ ఉద్యోగాలే చేశారు. ఒడిశాలో వైశాల్యం రీత్యా అతి పెద్దది అయిన మయూర్‌భంజ్‌ జిల్లా ఉపర్‌బెడలో ఆమె 1958 జూన్‌ 20న జన్మించారు. ఆమె తండ్రి బిరించి నారాయణ టుడు, తాత గ్రామ సర్పంచులుగా పనిచేశారు. ఆదివాసీలు ఎక్కువ మంది నివసించే మయూర్‌భంజ్‌ జిల్లాలో పుట్టినా ద్రౌపదిని ఆమె తండ్రి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రమాదేవి కాలేజీలో చదివించారు. ఆమె కళాశాల విద్య కోసం కొద్దిపాటి భూమిని సైతం ఆయన అమ్మివేశారు. రాజనీతిశాస్త్రంతో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఆమె తాను చదువుకున్న పాఠశాలలో టీచర్‌గా, నీటిపారుదలశాఖలో గుమాస్తాగా పనిచేశారు. ఆమె ప్రయాణం అంతటితో ఆగలేదు. ప్రజాసేవ కోసం తన ఊరుకు దగ్గరలోని పెద్ద పట్టణం రాయ్‌రంగపూర్‌ స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీచేయడం శ్రీమతి ద్రౌపది జీవితానికి కొత్త మలుపు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఇది ఉపయోగపడింది. 38 ఏళ్ల వయసులో ఆమె రాయ్‌రంగపూర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్ గా ఎన్నికవడం తర్వాత 2000, 2004 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించడానికి దారితీసింది. మున్సిపల్‌ కౌన్సిలర్‌ నుంచి ఆమె రాయ్‌రంగపూర్‌ పురపాలక సంఘం అధ్యక్షురాలయ్యారు. రాయ్‌రంగపూర్‌ ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికవడం ప్రజాజీవితంలో ఆమెకు కొండంత బలం ఇచ్చింది. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాకే ఆమె నవీన్‌ పట్నాయక్‌ కేబినెట్‌లో బీజేపీ తరఫున మంత్రిగా రెండేళ్లు ఉన్నారు. ఆమె శాసన సభ్యత్వం 2009లో ముగిసినా ఆమె రాజకీయ జీవితానికి తెరపడలేదు. కేంద్రంలో శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2015 మే 18న శ్రీమతి ద్రౌపది ఆదివాసీలు 25 శాతానికి పైగా ఉన్న పొరుగు రాష్ట్రం ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆమె వరుసగా ఆరేళ్లు రికార్డు స్థాయిలో ఈ పదవిలో కొనసాగారు. ఆదివాసీ కుటుంబంలో పుట్టినాగాని ఆమె తన పార్టీకే చెందిన శ్రీ రఘువర్‌ దాస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంతో చాలా గట్టిగానే వ్యవహరించారు. గవర్నర్‌ అంటే కేంద్ర సర్కారు. అక్కడి అధికారపక్షం చేతుల్లో కీలుబొమ్మ కాదని, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ అని ఆమె నిరూపించారు. శ్రీ రఘువర్‌ దాస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న రెండు చట్టాలు ఆదివాసీ ప్రయోజనాలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఆమె భావించి వాటికి ఆమోదముద్ర వేయలేదు. చివరికి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ బిల్లులపై ఆదివాసీల వ్యతిరేకతను, నిరసనను ఆమె పరిగణనలోకి తీసుకుని వ్యవహరించారు. అంతటి అంకితభావంతో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే శైలి ఉన్న నాయకురాలు ద్రౌపది ముర్ము.
* విషాదాలను దిగమింగి ప్రజాసేవకు అంకితం
తన మయూర్‌భంజ్‌ జిల్లా పహాడ్‌పూర్‌కు చెందిన శ్రీ శ్యామచరణ్‌ ముర్ముతో శ్రీమతి ద్రౌపదికి వివాహమైంది. ఆయన బ్యాంక్‌ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు పుట్టాక ఆమె కుటుంబంలో వరుస విషాదాలు కుదిపివేశాయి. సిమెంటు గోడలు కూడా లేని ద్రౌపది ఇంట్లో 2010–2014 మధ్య మూడు విషాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నాలుగేళ్లలో భర్త, ఇద్దరు కొడుకులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు. ఆమె చిన్న కొడుకు మొదట మరణించాడు. రెండేళ్ల తర్వాత పెద్ద కొడుకు కన్నుమూశాడు. ఇద్దరు కొడుకులతోపాటు భర్త మరణించడం శ్రీమతి ద్రౌపదిని తాత్కాలికంగా కుంగదీసినా ఆమె కోలుకున్నారు. తన ఇంటి భవనాన్ని ఆమె విద్యార్థుల వసతిగృహంగా మార్చి ఇచ్చారు. చిన్న కొడుకు తర్వాత పెద్ద కొడుకు చనిపోవడం ఆమెను కోలుకోలేనంతటి విషాదంలోకి నెట్టేసింది. పెద్ద కొడుకు మరణించిన ఆరు నెలల వరకూ ఆమె దిగులు నుంచి బయటపడలేకపోయారు. తర్వాత ఆమె ఆధ్యాత్మికం వైపు దృష్టి సారించి కొంత కాలం బ్రహ్మకుమారీల బోధనలతో ఉపశమనం పొందారు. మొత్తంమీద ఆమె తన కుటుంబంలో ముగ్గురి మరణాలు సృష్టించిన పెను విషాదం నుంచి కొన్నేళ్ల తర్వాత బయటపడ్డారు. ప్రజాసేవకు పునరంకితమయ్యారు. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ సత్సంగ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు, దేవాలయాల ప్రాంగణాలు ఊడ్చుతూ విషాదాన్ని దిగమింకున్నారు. శివ మహత్యాలు వివరించే ఒక పుస్తకం ఎప్పుడూ ఆమెకు తోడుగా ఉంటుంది. సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున 3–30 గంటలకు ఆమె నిద్ర నుంచి లేస్తారు. ఉదయం నడక, యోగా పూర్తిచేసుకుని రోజూవారీ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాంచీ నగరంలో ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆమె నివాసం తలపులు అందరికీ తెరిచే ఉండేవి. ప్రజలందరికీ ఆమె అందుబాటులో ఉండేవారు. నిరంతర ప్రజాసేవ, ఆధ్యాత్మికత, దైవభక్తి ద్వారా తన వ్యక్తిగత విషాదాలను అధిగమించారు శ్రీమతి ద్రౌపది ముర్ము. ఉత్తమ ఎమ్మెల్యేగా ఆమెకు 2007లో ఒడిశా అసెంబ్లీ నీలకంఠ్ అవార్డు ప్రదానం చేసింది.
*తొలి ఆదివాసీ గవర్నర్ గా ఎనలేని కీర్తి
మొదటి ఆదివాసీ రాష్ట్రపతిగా చరిత్ర తిరగరాయబోతున్న శ్రీమతి ద్రౌపది ముర్ము తొలి ఆదివాసీ గవర్నర్‌ కూడా. తాను పుట్టిన సామాజికవర్గమైన సంతాలీలు గణనీయ సంఖ్యలో ఉన్న ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఆమె పనితీరు అత్యుత్తమైనది కాబట్టే ఆమె ఆరు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగగలిగారు. గవర్నర్‌ పదవిలో ఉండగా ఆమె రాష్ట్రంలోని ఉన్నత విద్యకు సంబంధించి అనేక లోక్‌ అదాలత్‌ సమావేశాలు నిర్వహించారు. విశ్వవిద్యాలయాలు, వాటి ఉద్యోగులకు సంబంధించిన 5000కు పైగా వివాదాలను ఈ సమావేశాల్లో పరిష్కరించారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్ధుల ప్రవేశాల ప్రక్రియను కేంద్రీకరించేందుకు ఛాన్సలర్‌ పోర్టల్‌ ఒకదాన్ని ఆమె ఏర్పాటు చేయించారు. గవర్నర్‌గా ఆమె తాను రబ్బర్‌ స్టాంపు కాదని పదే పదే నిరూపించుకున్నారు. అనేక బిల్లులు శాసనసభ ఆమోదం పొంది తన ఆమోదముద్ర కోసం వచ్చినప్పుడు ఆమె గుడ్డిగా సంతకాలు పెట్టలేదు. ఈ చట్టాలకు సంబంధించి తన అనుమానాలు నివృత్తి చేసుకున్నాకే ఆమె సంతకాలు పెట్టేవారు. అలా అని ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై తన సొంత అభిప్రాయాలను ఆమె బలవంతంగా ఎన్నడూ రుద్దలేదు.
* స్ఫూర్తిప్రదాతకు సహకరించాలి
‘‘కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా పేదరికం అనుభవించిన జనం, కష్టాలు ఎదుర్కొన్నవారు శ్రీమతి ద్రౌపది ముర్ము జీవితం నుంచి స్ఫూర్తి పొందుతారు. ప్రభుత్వ విధానాలపై ఆమెకున్న అవగాహన, ఆమె దయార్ద్ర స్వభావం మన దేశానికి ఎంతగానో ఉపయోగపడతాయి,’’ అన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాటలు అక్షరసత్యాలు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రపతి పదవిలో వ్యక్తిగతంగా తన రాజకీయ అజెండాతో చేయడానికి పెద్దగా ఆమెకు అవకాశం లేని మాట నిజమే. అయినా ఆమె దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం శాయశక్తులా కృషి చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. దీనికితోడు స్త్రీలు, ఆదివాసీలు, సాధారణ పేద ప్రజానీకం సహా సమాజంలో బడుగువర్గాలుగా భావించే అందరికీ శ్రీమతి ద్రౌపది ముర్ము స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా ఆదివాసీల హక్కుల పరిరక్షణకు, వారి పురోగతికి తగిన విధానాలు రూపొందించి అమలు చేస్తే, తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది పేరు చిరకాలం నిలిచిపోవడానికి వీలు కలుగుతుంది.