తెలుగు భాషని రాజకీయ అంశంగా మార్చిన వైసీపీ నేతలు

  • బాల్యం నుంచే మాతృభాషను దూరం చేసేలా వైసీపీ ప్రణాళికలు
  • ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషతోనే బుద్ధి వికాసం
  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళహరి

గుంటూరు: తెలుగుభాషపై ఏమాత్రం గౌరవం, ప్రేమాభిమానాలు లేని వైసీపీ ప్రభుత్వం చివరికి తెలుగుభాషను రాజకీయ అంశంగా మార్చిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలుగు భాష ఉన్నతికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా జరుపుకునే తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నేతలు జిల్లా కలక్టరేట్ ఆవరణలో ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి పూలదండ వేసి, ఎన్ని బాషలైనా నేర్చుకో, మాతృభాషను అక్కున చేర్చుకో అంటూ నినాదాలిచ్చారు. మాతృభాషలో చదువుకోవడం అంటే పిల్లల అభివృద్ధిని అడ్డుకోవటమేనని, ఇంగ్లీష్ వస్తే చాలు ప్రపంచాన్ని జయించవచ్చు అనే విధంగా పాలకులే విషబీజాలు నాటడాన్ని బాషాభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషలో ప్రాథమిక విద్య సాగినప్పుడే మిగతా భాషలు నేర్చుకోవటానికి సులువవుతాయన్న విషయం దేశ ప్రధాని సైతం పదే పదే చెబుతున్నా పాలకులు పెడచెవిన పెట్టడం శోచనీయమన్నారు. ఈ క్రమంలో తెలుగుభాషను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ కంకణబద్ధులు కావాలన్నారు. కార్యక్రమంలో నగర కమిటీ కార్యదర్సులు బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, బుడంపాడు కోటి, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.