కంచికచర్ల జనసైనికుల పిర్యాదు

నందిగామ, జనసేన పార్టీ అధినేత చిత్రపటాన్ని చించారని జనసేన పార్టీ జెండా తొలగించారని మరోసారి జనసేన పార్టీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. మండలంలోని బత్తినపాడు గ్రామంలో ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని జండా దిమ్మని ఏర్పాటు చేసి ఆపార్టీ జిల్లా నాయకులు బండి రామకృష్ణ చేతుల మీదుగా ఆ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉన్న పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని కోసి తొలగించారు. ఈ సందర్భంగా బత్తినపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి వేసిన పూలదండలు సైతం తొలగించినట్లు జనసేన పార్టీ కార్యకర్తలు గుర్తించారు. ఈ విషయమై సోమవారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్ ఆధ్వర్యంలో కంచికచర్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించడంతో కందిచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మరోసారి మండల పరిధి అయిన బత్తినపాడు గ్రామంలో ఇదే విషయం మరోసారి జరగడం ద్వారా అధికార పార్టీ నాయకులు తమన ఆపేవారు లేరన్నట్లు వ్యవహరిస్తున్న తీరు మండలంలోని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా సమాన హక్కులు ఉంటాయని అధికార పార్టీ నాయకులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన అన్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ సమన్వయం పాటించాలని సూచించినట్లు ఆయన తెలిపారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం ఉందని బత్తినపాడు గ్రామంలో జెండాను తొలగించి బ్యానర్లు చించి అంబేద్కర్ విగ్రహానికి వేసిన పూలదండలను తీసివేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ నాయకులు పూజారి రాజేష్, మండల సంయుక్త కార్యదర్శి గొర్రెముచ్చు రాజు, మండల ప్రధాన కార్యదర్శి పి.ప్రసాద్ కార్యదర్శి తేజ, ముప్పాళ్ల వేణు, కె తిరుమలరావు, కుర్ర నాని, మణికంఠ, నవీన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.