చౌదరి శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ని రాజు

రాజాం నియోజకవర్గం, వంగర మండలం, చౌదరి వలస గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న చౌదరి శ్రీనివాసరావు (14) శుక్రవారం వేగావతి నది అవతల మరువాడ ఉన్నత పాఠశాలకు తోటి విద్యార్థులతో పాటు నది దాటి వెళ్ళే క్రమంలో కొట్టుకుపోయాడు. శుక్రవారం రోజంతా పోలీసులు, అధికారులు, స్థానికుల సహాయంతో గాలించినా అతని జాడ కనిపించలేదు. విషయం తెలుసుకున్న రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు జనసైనికులతో కలిసి శనివారం ఉదయం కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో శ్రీనివాసరావు ఆచూకీ కోసం గాలిస్తుండగా అధికారులు, స్థానికుల సమన్వయంతో పాటు ఎన్ని రాజు మరియు జనసైనికుల సహకారంతో తన ఆచూకీ మధ్యాహ్నం లభించింది. ఈ క్రమంలో శ్రీనివాసరావు చదువుతున్న పాఠశాలను రాజు జనసైనికులతో సందర్శించి, ఉపాధ్యాయులను అబ్బాయి వివరాలను అడిగి పాఠశాల మౌళిక వసతుల గురించి చర్చించారు. పాఠశాలకు నాడు – నేడు కార్యక్రమం ద్వారా ఇంకా పూర్తికాని పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడమని ఉపాధ్యాయులకు చెప్పారు. అలాగే చౌదరి వలస గ్రామానికి చెందిన విద్యార్థులను నది దాటే అవసరం లేకుండా వారికి అన్ని మౌళిక వసతులు ఉండేటట్లు వేరే పాఠశాలకు మార్పించే ఆలోచన వీలైనంత త్వరగా చేయాలని రాజు జిల్లా విద్యాశాఖాధికారిని కోరటం జరిగింది. ఈ బాధాకరమైన సంఘటనను దృష్టిలో ఉంచుకుని స్థానిక ప్రజలను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నాక ఎన్ని రాజు మాట్లాడుతూ.. ఇటువంటి వరదలు వచ్చే సమయంలో పాచిపెంట డ్యాంకు దిగువ ఉన్న ప్రాంతాలకు ప్రమాద హెచ్చరిక మరియు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా డ్యాం గేట్లు ఎత్తివేయటం వల్ల ఇలా జరిగింది అని ప్రజలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ అలా జరిగినట్లయితే ప్రభుత్వం దీని పై విచారణ జరిపించాలని, నిజనిర్ధారణ జరిగితే, ప్రభుత్వం తక్షణమే ఈ సంఘటనపై బాధ్యత వహించి ఆ కుటుంబానికి తగినంత నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపున ఎన్ని రాజు డిమాండ్ చేయటం జరిగింది. ఈ హృదయ విచారకరమైన ఘటన వల్ల కుటుంబ సభ్యులను చూసి ఎన్ని రాజుతో పాటు ఘటన స్థలానికి చేరుకున్న జనసైనికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చుతూ, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన స్థలానికి ఎన్ని రాజుతో పాటు జనసైనికులు సత్యనారాయణ, జన, వెంకటరమణ, అన్నం నాయుడు, అప్పలనాయుడు, కిరణ్, గోవింద్, శివరాం వెళ్ళటం జరిగింది.