కన్నుమూసినా….కనికరం లేదు!

*ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు ఏదీ పరిహారం?
*అధికారుల చుట్టూ తిరగలేక ఆపసోపాలు
*నాలుగేళ్లలో చేసిన సాయం రూ.47 కోట్లే
*జగన్ హామీ గాలికి….

వ్యవసాయంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. మద్దతు ధరలు రైతుకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. గడచిన నాలుగేళ్లుగా ఏపీలో వేలాది మంది రైతులు సాగు గిట్టుబాటు కాక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా ఆ రైతు కుటుంబాలలో పరిహారం అందుకున్న వారు నామమాత్రం. సాగులో నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డ ఒక్కో రైతు కుంటుంబానికి రూ.7 లక్షలు సాయం అందిస్తామని సీఎం జగన్ రెడ్డి 2019 జులై 8న జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవంలో ప్రకటించారు. నాలుగేళ్లలో కేవలం 672 రైతు కుటుంబాలకు రూ.47 కోట్లు మాత్రమే సాయం అందించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 70 శాతం మందికి వివిధ కారణాలతో సాయం అందించడం లేదు. కౌలు రైతుల్లో 8.8 శాతం మందికే రుణ అర్హత కార్డులు ఉన్నాయి. కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడితే అతనికి రుణ అర్హత కార్డు ఉంటేనే పరిహారం అందిస్తున్నారు. దీంతో వేలాది మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డా వారి కుటుంబాలకు సాయం దక్కడం లేదు.
* తెలంగాణలో రైతు మరణిస్తే రూ.5 లక్షలు
తెలంగాణలో భూమి ఉన్న రైతులు ఏ కారణం చేత చనిపోయినా రూ.5 లక్షలు రైతు బీమా సాయం అందిస్తున్నారు. రైతు బీమా పథకంలో నమోదు చేసుకుంటే చాలు రైతులు ఏ కారణం చేత చనిపోయినా వారి కుటుంబానికి రైతు మరణించిన పది రోజుల్లోనే సాయం అందుతోంది. 2018 ఆగష్టు నుంచి 2022 నవంబరు వరకు మరణించిన 93170 మంది రైతులకు రూ. 4658.50 కోట్ల రైతు బీమా సొమ్ము అందించారు. తెలంగాణలో మొత్తం 65 లక్షల మంది రైతులున్నారు. వారిలో 50 లక్షల మందికి రైతు బీమా వర్తిస్తోంది. ఏపీలో 85 లక్షల మంది రైతులున్నా వారికి ప్రత్యేక బీమా పథకమే లేదు. వైఎస్ఆర్ బీమా ఉన్నా అది అందరికీ సంబంధించినది. తెలంగాణలో 2018 ఆగష్టు నుంచి ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ ద్వారా రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. 2018 ఆగష్టు నుంచి 2022 నవంబరు వరకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీకి రూ.5383.83 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. తిరిగి ఎల్ఐసీ రూ.4658 కోట్లు రైతులకు పరిహారం చెల్లించింది. ఈ పథకానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కూడా దక్కింది.
*ఏపీలో పరిహారం అందించేందుకు సుదీర్ఘ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ లో రైతు ఆత్మహత్యకు పాల్పడి ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉన్నా, సాయం కోసం రైతు కుటుంబ సభ్యులు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఆ సర్టిఫికెట్ కావాలని, ఫలానా అధికారి సంతకం కావాలంటూ బాధితులను తిప్పుతున్నారు. ఎవరైనా రైతు ఆత్మహత్యకు పాల్పడితే ముందుగా వీఆర్వో, తహశీల్దార్, వ్యవసాయ అధికారి, ఎస్సైల కమిటీ నివేదిక ఇవ్వాలి. ఆ తరవాత డివిజన్ స్థాయిలో ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్, డీఎస్పీల కమిటీ విచారణ చేసి సిఫారసు చేస్తేనే ఆ రైతు కుటుంబానికి పరిహారం అందుతుంది. ఇక కౌలు రైతుల్లో ఎక్కవ మందికి గుర్తింపు కార్డులు లేవు. ఈ కారణంతో వారికి పరిహారం అందించడం లేదు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారిని ఇంఛార్జిగా నియమించాలి. కానీ ఆ అధికారి ఎవరో, అతని ఫోన్ నెంబరు ఏమిటో తహశీల్దారులకు కూడా తెలియడం లేదు. కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ కూడా ఉండాలి. కాని ఏ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా వ్యవసాయంలో చేసిన అప్పులతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తేలితేనే పరిహారం అందిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుకు… కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే పరిహారం అందుతుంది. ఏటా ఏపీలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం ఏదొక వంక చూపి సాయం అందించడం లేదు. ఎక్కువ మందికి సాయం అందిస్తే, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా చూపాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే సాయంలో కొర్రీలు పెడుతున్నారని భావిస్తున్నారు.
*ఉదారత….ఒట్టి మాట
రైతులు ఏ కారణం చేత ఆత్మహత్యకు పాల్పడ్డా వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. కరెంటు షాకు, పాము కాటు, పిడుగుపాటు….ఇలా ఏ కారణం చేత రైతు చనిపోయినా వారికి సాయం అందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో 20 లక్షల మంది రైతులు ఎక్కువగా సాగుపై ఆధారపడ్డారు. విపత్తులు కూడా ఏపీలోనే అధికం. అధిక వర్షాలు, కరువు, వరదలు, చీడపీడలు, పంటలు చేతికి వచ్చినా సరైన గిట్టుబాటు ధర దక్కకపోవడంలాంటి కారణాలతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి ఉదారంగా సాయం అందించాల్సిన ఏపీ ప్రభుత్వం రైతు చనిపోయి, నెలలు గడుస్తున్నా వారి కుటుంబాలకు పరిహారం అందించడం లేదు. వ్యవసాయం పండగ చేశామని, అందుకే ఏపీలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పుకునేందుకే ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారనేది నిజం. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఉదారంగా ఆదుకుంటామని సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీ ఒట్టిమాటగానే మిగిలిపోయింది.