చిక్కుడు బట్టి గ్రామంలో జనసేన గ్రామ స్థాయి సమావేశం

చింతపల్లి మండలం, చిక్కుడు బట్టి గ్రామంలో మంగళవారం జనసైనికుడు బద్రీనాద్ ఆధ్వర్యంలో గ్రామ యువత,పెద్దలతో సుదీర్ఘ రాజకీయాంశాలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆదివాసీ రైతాంగ సమస్యలు, రోజు రోజుకి నిర్వీర్యమైపోతున్న ఆదివాసీ హక్కుల దుర్వినియోగం మొదలగు అంశాలను జనసేన పార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ డా.. వంపురు గంగులయ్య గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రజల ఓట్లతో గెలిచి కనీసం మారుమూల పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితుల్లో మన ప్రజా ప్రతినిధులున్నారని ఈ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదయాలపై ఇసుమంతైనా జ్ఞానం లేని ప్రజా ప్రతినిధుల నుంచి ఆదివాసీ సంక్షేమం ఆశించడం అత్యాశే అవుతుందని, అలా అని గిరిజన జాతికి ద్రోహం తలపెడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రధాన రహదారినుంచి సుమారు ఆరు కిలోమీటర్లు ఉన్న రహదారిని మంజూరు చేయలేని నిస్సహాయ స్థితిని వివరిస్తూ.. ఇది పూర్తిగా నాయకుల వైఫల్యమేనంటూ ఎద్దేవా చేశారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఇంతవరకు మా గ్రామాన్ని ఏ ప్రజా ప్రతినిధి సందర్శించలేదని.. ఈ ప్రాంత ప్రజలంటే ఎందుకంత చిన్న చూపు అంటూ.. ఆవేదన చెందారు.