నాయకులారా ఈ తల్లి ఆవేదన వినండి, పైడమ్మ కాలనీ వాసులను ఆదుకోండి

పెడన, సాంకేతిక విప్లవం వచ్చి ప్రతి ఇంటికి ఇంటర్నెట్, ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ వచ్చేసింది ఎంతో అభివృద్ధి చేశాం అని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులారా ఒక్కసారి కళ్ళు తెరవండి. ఇప్పటికీ పెడన పట్టణంలో ఒక కుటుంబం రాతి యుగాన్ని గుర్తుకు తెచ్చేలా, ఓ చిన్న దీపపు కాంతిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తల్లి ఆవేదన విన్న నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ తల్లి నిరుపేద చేనేత కార్మికురాలు. అద్దె కట్టే స్తోమత లేక, ఎలాంటి వసతులు లేకపోయినా, తమ కష్టార్జితంతో కట్టిన ఇల్లు పాడు పడిపోకూడదు అనే ఉద్దేశంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో నివాసం ఉంటున్నారు. పెడన పట్టణంలో పైడమ్మ అమ్మవారి దేవాలయం దగ్గరలో పైడమ్మ కాలనీ పేరుతో 2008లొ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలనీ ప్రారంభించడం జరిగింది. సుమారు 220 ఇల్లు నిర్మించడం జరిగింది. నేటికీ ఆ కాలనీలో మౌళిక వసతులు లేవు. విద్యుత్ సరఫరా లేకపోవడం వలన, డ్రైనేజ్, తాగునీరు, రోడ్లు లేకపోవడం వల్ల ఎవరు నివాసం ఉండటం లేదు. తమ సొంత ఇంటి కల నెరవేరుతుందని నిరుపేదలు అప్పుచేసి మరీ ఇల్లు కట్టుకున్నారు. అప్పులకు వడ్డీలు కడుతున్నారు గాని కష్టపడి కట్టుకున్న ఇంట్లో లో నివాసం ఉండలేని పరిస్థితి. కొందరు అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇటు అద్దె, అటు చేసిన అప్పుకు వడ్డీ కడుతున్నామని వాపోతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు కడుతున్నామని ఎంతో గొప్పగా చెప్పుకునే జోగి రమేష్ ఆఫీసుకు అతి దగ్గరలో ఉన్న పైడమ్మ కాలనీకి కనీస వసతులను కల్పించకపోవడం హాస్యాస్పదం. ఇక్కడి ప్రజలు కనీసం విద్యుత్ లైన్ అయినా వేయించండి అని దీనంగా వేడుకుంటున్నారు.
మున్సిపల్ ఎలక్షన్ లో వైసీపీ గెలిస్తే, వారం రోజుల్లో కరెంటు లైన్ ఇస్తామని వాగ్దానం చేసి ఓట్లు దండుకుని పదవి పొందిన సిగ్గులేని నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు గెలిచి అందలం ఎక్కి సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు కరెంటు లైన్ వేయలేకపోయారు? నీకు ఓటు వేసిన ప్రజలకే న్యాయం చేయలేనప్పుడు మీకు మంత్రి పదవి ఎందుకు? స్థానిక ఎమ్మెల్యేగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నిర్మాణ ఆఖరి దశలో ఉన్న గృహాలకి నువ్వు విద్యుత్ లైన్ వేయించలేనప్పుడు, ఈ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు ఎలా నిర్మిస్తారు జోగన్న. ఇప్పుడు మీరు నిర్మిస్తున్న జగనన్న కాలనీలు, రేపు ఇదే పరిస్థితిని రవు అనటానికి గ్యారెంటీ ఏంటి? అరకొర వసతులతో నిర్మిస్తున్న జగనన్న కాలనీల పరిస్థితి కూడా భవిష్యత్తులో పైడమ్మ కాలనీ లాగానే మారితే 30 లక్షల మంది జీవితాలు ప్రశ్నార్థకం అవుతాయి. అధికారులు, మంత్రి జోగు రమేష్ తక్షణమే స్పందించి పైడమ్మ కాలనీకి విద్యుత్ లైన్లు వేయాలి. లేనియెడల ఆ కాలనీ వాసులకు అండగా జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించి కాలనీవాసుల హక్కులను సాధించుకుంటామని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.